
- సత్ఫలితాలు ఇచ్చిన ఇంటర్ రీవాల్యువేషన్
- రీవాల్యువేషన్‌తో చాలా మంది విద్యార్థులకు కలిసిన మార్కులు
- ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయినోళ్లు 1.04 లక్షల మంది ఉన్నారని అధికారుల వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ఇంటర్ రీవాల్యువేషన్ ప్రక్రియ సత్ఫలితాలిచ్చింది. ఒక్క మార్కుతో ఫెయిలైన వాళ్లు గతంలో వేలల్లో విద్యార్థులు ఉండగా, ఈసారి వందలోపే ఉన్నారు. రెండ్రోజుల క్రితం రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో 76 మంది మాత్రమే ఒక్క మార్కు తగ్గడంతో ఫెయిల్ అయ్యారు. 35 శాతం కంటే తక్కువ మార్కులు వచ్చిన వారిలో ఫస్టియర్‌లో 29 మంది ఉండగా, జనరల్ 24 మంది, ఒకేషనల్‌లో ఐదుగురు ఉన్నారు. సెకండియర్‌లో 47 మంది ఉండగా, జనరల్ విద్యార్థులు 39 మంది, ఒకేషనల్‌లో 8 మంది ఉన్నారు. కాగా, మార్చిలో పూర్తయిన ఇంటర్ పరీక్షలకు 9.97 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా, 6.56 లక్షల మంది పాసయ్యారు. జనరల్ కేటగిరీలో 3.04 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. అయితే, రాష్ట్రంలో రెగ్యులర్ వాల్యువేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే, ఈసారి కొత్తగా ఇంటర్ బోర్డు రీవాల్యువేషన్ ప్రక్రియ చేపట్టింది. ముఖ్యంగా అన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చి.. ఒక్క సబ్జెక్టులో మాత్రమే ఫెయిల్ వాళ్లను, 30 నుంచి 34 మార్కుల మధ్యలో వచ్చిన పేపర్లను మరోసారి రీవాల్యువేషన్ చేశారు. ఈ క్రమంలో చాలామందికి మార్కులు కలిశాయి. దీంతో ఈసారి ఒక్క మార్కుతో ఫెయిలైన వారి సంఖ్య వందలోపే వచ్చిందని అధికారులు చెప్తున్నారు.
ఒక్క సబ్జెక్టులో ఫెయినోళ్లు లక్షకుపైనే..
ఇంటర్ జనరల్ కోర్సుల్లో మొత్తం 3,04,950 మంది ఫెయిలయ్యారు. ఇందులో జనరల్ కేటగిరీలో ఒక్క సబ్జెక్టులోనే ఫెయిలైనోళ్లు 1,04,382 మంది ఉన్నారు. అంటే దాదాపు మూడో వంతు విద్యార్థులు ఒకే సబ్జెక్టులో ఫెయిలైనట్టు తెలుస్తోంది. సెకండియర్‌లో 61,515 మంది ఉండగా, ఫస్టియర్‌లో 42,867 మంది ఉన్నట్టు ఇంటర్ బోర్డు గుర్తించింది. కాగా, సెకండియర్‌లో ఫెయిలైన వారిలో ప్రైవేటు విద్యార్థులు 20 వేలకు పైగా ఉన్నారు. ఫస్టియర్‌లో ఏడు సబ్జెక్టులుంటే.. ఒక్క సబ్జెక్టులో ఫెయిలైనోళ్లు 42,867 మంది ఉన్నారు. రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైనోళ్లు ఫస్టియర్‌లో30,497 మంది ఉండగా, అన్ని సబ్జెక్టులు ఫెయిలైనోళ్లు 1,829 మంది ఉన్నారు. సెకండియర్‌లో రెండు సబ్జెక్టులు ఫెయిలైనోళ్లు 24,427 మంది ఉన్నారు. అయితే, అత్యధికంగా సెకండియర్‌లో 18 సబ్జెక్టులుంటే అన్నీ ఫెయినోళ్లు 48 మంది, 17 సబ్జెక్టులు ఫెయిలైనోళ్లు 62 మంది, 16 ఫెయిలైనోళ్లు 277 మంది ఉన్నారు.