న్యూఢిల్లీ: నాలుగో రౌండ్‌లో 99 బొగ్గు గనులను వేలానికి పెట్టగా, కేవలం ఎనిమిది బ్లాకులను మాత్రమే విజయవంతంగా కేటాయించినట్టు కేంద్రం బుధవారం పార్లమెంటుకు తెలియజేసింది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కొత్త గనుల అభివృద్ధి అవసరమని స్పష్టం చేసింది. 2030 నాటికి ఏడాదికి 1,500 మిలియన్ టన్నుల బొగ్గు డిమాండ్ (ఎంటీపీఏ) ఉంటుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
నాలుగో రౌండ్ వాణిజ్య వేలం 2021 డిసెంబర్ 16న ప్రారంభమైంది. మొత్తం 99 బొగ్గు గనులను కేటాయించారు. కేవలం ఎనిమిది గనులు మాత్రమే విజయవంతంగా వేలం వేశామని ఆయన చెప్పారు. ఈ 99 గనులు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్నాయి. ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు పునరావాసం & పరిహారం రాష్ట్ర ప్రభుత్వాల ప్రస్తుత నిబంధనల ప్రకారం జరుగుతుందని జోషి తెలిపారు.