అల్టర్నేట్​పై ఆశావహుల నజర్ .. ఇతర పార్టీ నేతలతో టచ్​లోకి మెయిన్​ పార్టీ లీడర్లు

అల్టర్నేట్​పై ఆశావహుల నజర్ .. ఇతర పార్టీ నేతలతో టచ్​లోకి మెయిన్​ పార్టీ లీడర్లు
  • ఎలక్షన్లు దగ్గర పడుతున్నా క్యాండిడేట్లను కన్ఫాం చేయకపోవడంపై టెన్షన్
  • టికెట్​ రాకపోతే ఏం చేద్దామని అనుచరులతో మంతనాలు
  • సింబల్స్​ మీద పోటీ చేస్తే కలిసి వస్తుందనే భావన

మహబూబ్​నగర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఐదు వారాల టైం మాత్రమే ఉంది. రూలింగ్​ పార్టీ క్యాండిడేట్లు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే, ప్రధాన పార్టీల హైకమాండ్లు ఇంత వరకు క్యాండిడేట్లను ఫైనల్​ చేయలేదు. రెండు రోజుల్లో కన్ఫర్మేషన్​ వస్తుందనే టాక్​ నడుస్తున్నా.. పోటీ ఎక్కువగా ఉండటంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. వీరంతా ఏడాదిన్నరగా ఆయా పార్టీల నుంచి పోటీలో ఉంటామని కోట్లల్లో ఖర్చు చేయగా, లిస్ట్​లో పేరు లేకుంటే పరిస్థితి ఏంటని టెన్షన్​ పడుతున్నారు.  ఈ క్రమంలో ప్రధాన పార్టీల నుంచి టికెట్లు రాకుంటే.. ఆల్టర్నేట్​గా చిన్న పార్టీల నుంచి టికెట్లు తెచ్చుకునేందుకు ఆ పార్టీ లీడర్లతో టచ్​లోకి వెళ్తున్నారు.

బీఎస్పీపైనే అందరి దృష్టి..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో అందరి చూపు బీఎస్పీపైనే ఉంది. సొంత జిల్లా కావడంతో ఇక్కడి నుంచి మెజార్టీ సీట్లు గెలుపొందాలనే పట్టుదలతో ఆ పార్టీ స్టేట్​ చీఫ్​ ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్  ఉన్నారు. స్వేరోస్​ బలంగా ఉన్న చోట్ల ఆ పార్టీ కార్యక్రమాలను కూడా విస్తృతం చేశారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ లీడర్లను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అయితే ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహులు బీఎస్పీ లీడర్లతో టచ్​లోకి వెళ్తున్నారు.

మక్తల్​ అసెంబ్లీ స్థానం కోసం బీఆర్ఎస్​ నుంచి వర్కటం జగన్నాథ్​ రెడ్డి టికెట్​ ఆశించారు. కానీ, సిట్టింగ్​ ఎమ్మెల్యే చిట్టెం రాంమెహన్​రెడ్డికే హైకమాండ్​ చాన్స్​ ఇవ్వడంతో.. ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మూడు రోజుల కింద కారు దిగి బీఎస్పీలో చేరారు. మహబూబ్‌‌నగర్‌‌ మండల మాచన్​పల్లి ఇండిపెండెంట్​ ఎంపీటీసీ బి.స్వప్నను పార్టీలోకి రావాల్సిందిగా ఆ పార్టీ లీడర్లు ఆహ్వానిస్తున్నారు. ఆమె పార్టీలో జాయిన్​ అయితే పాలమూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దింపేందుకు హైకమాండ్​ ఆలోచన చేస్తోంది.

అలాగే బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు మహబూబ్​నగర్​ పార్లమెంట్​ పరిధిలో ఇంకా  క్యాండిడేట్లను కన్ఫాం చేయలేదు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టికెట్లు ఆశిస్తున్న లీడర్లు లిస్టులో తమ పేర్లు ఉంటాయా? ఉండవా? అనే విషయంపై ఆందోళన చెందుతున్నారు. దీంతో మహబూబ్​నగర్​, దేవరకద్ర, జడ్చర్ల, నారాయాణపేట అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన కొందరు లీడర్లు టికెట్లు రాకుంటే ఏనుగు గుర్తు మీద పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. 

రంగంలోకి వైఎస్సార్​టీపీ..

వైఎస్సార్​టీపీ కూడా ఈ ఎన్నికల్లో బరిలో ఉంటుందని ఆ పార్టీ స్టేట్​ చీఫ్​ వైఎస్​ షర్మిల ఇటీవల ప్రకటించారు. పది రోజులుగా ఆ పార్టీ నుంచి పోటీ చేయాలనుకునే లీడర్ల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే పార్టీ నుంచి వనపర్తి స్థానం కోసం అడ్వకేట్​ వెంకటేశ్వర్​రెడ్డి, దేవరకద్ర నుంచి సరోజ్​రెడ్డి,  కల్వకుర్తి నుంచి అర్జున్​రెడ్డి, షాద్​నగర్​ నుంచి మహ్మద్​ ఇబ్రహీం, మక్తల్ నుంచి కర్ని గంగాధర్, అచ్చంపేట నుంచి దండుసిరి రమేశ్, కొడంగల్​ నుంచి తంబలి బాలరాజు, గద్వాల నుంచి అతీకుర్​ రహ్మాన్​ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదే క్రమంలో ఇతర పార్టీల నుంచి కూడా వలసలను పార్టీ హైకమాండ్​ ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ఆయా పార్టీల అసంతృప్తులపై ఫోకస్​ పెట్టారు. అవసరమైతే అసెంబ్లీ ఎన్నికల్లో వారికి టికెట్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

రెండు స్థానాల్లో జనసేన పోటీ చేసే చాన్స్..

రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్  కొద్ది రోజుల కింద ప్రకటించారు. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఆ పార్టీ హైకమాండ్  భావిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్​రెడ్డి, పవన్ కల్యాణ్​ కూడా చర్చలు జరిపారు. జనసేన 20 సీట్లను డిమాండ్ చేస్తుండగా, బీజేపీ మాత్రం తొమ్మిది నుంచి పది సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఉమ్మడి జిల్లాలోని ఒకటి, రెండు స్థానాలుంటయనే టాక్ నడుస్తోంది.