ఉక్కుపాదం మోపితేనే..‘డ్రగ్స్ ఫ్రీ’ తెలంగాణ..!

ఉక్కుపాదం మోపితేనే..‘డ్రగ్స్ ఫ్రీ’ తెలంగాణ..!

గత ఫిబ్రవరి రెండోవారంలో హైదరాబాద్​లో ఒక పారిశ్రామికవేత్తను ఆయన మనుమడు కత్తితో 73 సార్లు పొడిచి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి, టెస్టులు చేయగా అతను డ్రగ్స్ తీసుకుంటున్నట్టు వెల్లడైంది. అదేవిధంగా గత మార్చి మొదటివారంలో హైదరాబాద్‎లో ఆస్తి పంచి ఇవ్వడం లేదని తల్లిని కన్న కొడుకు కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. హంతకుడిని పోలీసులు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయగా డ్రగ్స్‎కు అడిక్ట్ అయినట్టు తేలింది. పై రెండు ఘటనల్లో సొంత కుటుంబసభ్యులనే చంపిన నిందితులు 30 ఏండ్లలోపు యువకులే కావడం గమనార్హం. ఇలా డ్రగ్స్‎కు యూత్ ఎక్కువగా అడిక్ట్ అవుతుండడం.. ప్రస్తుతం సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 

ఈ ఏప్రిల్ ఫస్ట్ వీక్‎లో డ్రగ్స్ కోసం విదేశాలకు డబ్బును తరలించే ముఠా నార్కొటిక్ పోలీసులకు పట్టుబడింది. ఎండీఎంఏ, కొకైన్ కోసం డబ్బు పంపించే ముగ్గురు నైజీరియన్లను అరెస్ట్ చేశారు. ముఠా ముంబై, ఢిల్లీలో షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి, వాటి అకౌంట్ల నుంచి డబ్బు పంపుతోంది. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ను క్యాష్ ఆన్ డెలివరీ చేస్తుంది. ఇందుకు యువతులను ముఠా ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇలా నిత్యం ఎక్కడో చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. 

పల్లె నుంచి పట్నందాకా..

తెలంగాణలో డ్రగ్స్, గంజాయి మహమ్మారి పట్నం నుంచి పల్లె దాకా పట్టుకుంది.   విద్యార్థులను, యువతను మత్తు భూతం పట్టి పీడిస్తోంది. టీనేజ్ పిల్లలు, యూత్​నే టార్గెట్​గా చేసుకుని డ్రగ్స్ మాఫియా దందాకు పాల్పడుతోంది. సెలబ్రెటీల నుంచి సామాన్యుల దాకా డ్రగ్స్ బారిన పడి కేసులు, జైళ్ల పాలయ్యే  ఘటనలు అప్పుడప్పుడు మీడియాలోనూ చూస్తున్నాం.

డ్రగ్స్ ఊబిలో  చిక్కుకుని  విలువైన జీవితాలను, భవిష్యత్‎ను ఆగం చేసుకుంటున్న దుర్భర పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. రెస్టారెంట్లు, పబ్‎లు, స్టార్ హోటల్స్‎లోనూ డ్రగ్స్ దందా ఇష్టానుసారంగా నడుస్తుండగా పోలీసుల రైడ్స్‎లోనూ వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తున్నాం.  డ్రగ్స్, గంజాయిని ఎప్పటికప్పుడు నార్కొటిక్ బ్యూరో, పోలీసులు పట్టుకుంటూ కట్టడి చేస్తున్నా తెలంగాణలో అక్రమ రవాణా మాఫియా చాపకింద నీరులా పాకుతూనే ఉంది. 

కఠినంగా హెచ్చరించిన సీఎం రేవంత్​ 

రాష్ట్రంలో డ్రగ్స్ కేసుల్లో సెలబ్రిటీలున్నా.. అంతకంటే పెద్దోళ్లున్నా ఉపేక్షించొద్దని నార్కొటిక్, పోలీసు డిపార్ట్ మెంట్‎ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేద్దామని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుపుదామని పిలుపునిస్తున్నారు. ఇలా డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా సీఎం రేవంత్​ ముందుకు వెళ్తుండడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు.

 ఇకముందు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడినా.. కొంటూ  దొరికినా నిందితుల ఇండ్లకు కరెంట్, వాటర్ సప్లయ్ బంద్ చేస్తామని.. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో  సాక్షాత్తూ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేయడం రాష్ట్రంలోని అన్నివర్గాల్లో విస్తృతంగా చర్చకు దారి తీసింది. సీఎం ఆదేశాలతో తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీజీఏఎన్ బీ) కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది.  

 సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు 

గత పాలకులు డ్రగ్స్, గంజాయి కట్టడిపై ఆదేశాలతోనే సరిపెట్టారు తప్పితే.. ఆచరణలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. ఇందుకు ఉదాహరణగా చూస్తే..  2017లో  డ్రగ్స్ సప్లయర్ అరెస్ట్ టాలీవుడ్​లో తీవ్ర కలకలం రేపింది.  దేశవ్యాప్తంగానూ సంచలనంగా మారింది. ఆ కేసులో అనుమానిత సినీ నటులు, ప్రొఫెషనల్స్​ను  పోలీసులు విచారించి బ్లడ్, హెయిర్  శాంపిల్స్ సేకరించారు.  ప్రస్తుతం ఈ  కేసు కోర్టు పరిధిలో ఉంది. ఇక  ప్రస్తుత  ప్రభుత్వం కూడా డ్రగ్స్ కట్టడికి తగు చర్యలు తీసుకోవాలి. యువత  డ్రగ్స్ మత్తులోకి కూరుకుపోతోంది. బాలీవుడ్ లో ‘ఉడ్తా పంజాబ్’ వంటి సినిమాలు వచ్చాయి.  2017లో పంజాబ్ ఎన్నికల్లోనూ డ్రగ్స్ కట్టడి రాజకీయంగా ప్రధాన  ప్రచార అస్త్రమైంది.

అందరినీ భాగస్వాములను చేస్తేనే.. 

డ్రగ్స్ చట్టాల్లో సవరణలు చేసి  కఠిన శిక్షలు పడేలా రూపొందించాలి. స్పెషల్  ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఎంతో అవసరం.  ప్రజల్లోనూ చైతన్యం తెచ్చేందుకు  డ్రగ్స్ నియంత్రణ  ప్రచార కార్యక్రమాలు రూపొందించాలి.  ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, ఉపాధ్యాయులు, మేధావులతో సదస్సులు నిర్వహిస్తుండాలి.  యాంటీ డ్రగ్స్ టీమ్ ను నియమించి నిఘా పెట్టి అనుమానితులకు డ్రగ్స్ టెస్ట్ లు చేయిస్తుండాలి.  ఈ– కామర్స్ వెబ్ సైట్లు, కొరియర్  సంస్థలపైనా పటిష్ట నిఘాను పెట్టాలి.  అన్నివర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ   డ్రగ్స్  నిర్మూలనకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.  

దక్షిణ కొరియా, చైనా చట్టాల మాదిరిగా..

డ్రగ్స్ సమస్య అంతర్జాతీయంగా ఉన్నదే. కానీ.. చాలా దేశాలు చట్టాలను కఠినంగా అమలు చేస్తూ  నేరస్తులను శిక్షిస్తుంటాయి. ప్రపంచంలోనే దక్షిణ కొరియా డ్రగ్స్ చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి.  ఆ దేశ పౌరులు  విదేశాలకు వెళ్లినా  అక్కడ కూడా డ్రగ్స్ వాడడంపై నిషేధం పెట్టింది.  చరిత్రలో  నల్లమందు యుద్ధాలను ఎదుర్కొన్న  చైనాలో డ్రగ్స్ చట్టాలు ఎంతో కఠినంగా ఉంటాయి. మాదక ద్రవ్యాల ఉత్పత్తి, అమ్మకం, రవాణా, వాడకం తీవ్రనేరంగా  పరిగణిస్తుంది.

 విదేశీ పౌరులెవరైనా సరే  చైనాలో డ్రగ్స్ కేసులో పట్టుబడితే  మరణశిక్ష కూడా విధిస్తుంది. బ్రిటన్ లోని  స్కాట్లాండ్ యార్డ్,  ఫ్రాన్స్ దేశాలు నార్కొటిక్​లో  మోడ్రన్ టెక్నాలజీ ఆధారంగా డ్రగ్స్ వ్యాప్తిని నియంత్రిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి.  ఆయా దేశాల్లో అమలయ్యే డ్రగ్స్ చట్టాలు, నియంత్రణ విధానాలపైనా స్టడీ చేసి రాష్ట్రంలోనూ అందుకనుగుణంగా అమలుపరిచే దిశగా  సర్కార్  చొరవ చూపితే.. డ్రగ్స్ ఫ్రీ స్టేట్​గా  తెలంగాణ మారుతుంది. 

- వేల్పుల సురేష్, 
సీనియర్ జర్నలిస్ట్