‘హైదరాబాద్’ ఎమ్మెల్సీ ఎన్నికకు 799 పోలింగ్ సెంటర్లు
రిటర్నింగ్ ఆఫీసర్ ప్రియాంక అలా వెల్లడి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారానికి కేవలం ఐదుగురికే అనుమతి ఉంటుందని, రోడ్ షో లకు ఐదు వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఉంటుందని రిటర్నింగ్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ ప్రియాంక అలా చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం జీహెచ్ఎంసీ ఆఫీసులో రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ప్రియాంక అలా మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో మొత్తం 799 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ర్యాలీలు, సమావేశాలు, బహిరంగ సభలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని చెప్పారు. ఈ ఎన్నికలకు చేసే ఖర్చుపై ఏ విధమైన నియంత్రణ లేదని, అయితే ఎన్నికల ప్రచార వ్యయ వివరాలను మాత్రం రిటర్నింగ్ ఆఫీసర్‌కు అందజేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థి పేరు, ఫొటో, పార్టీ పేరు మాత్రమే ఉంటాయన్నారు. సమావేశంలో ఎన్నికల విభాగం అడిషనల్ కమిషనర్ పంకజ, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ శ్రీనివాస్, ఎంఐఎం నుంచి ఎమ్మెల్సీ జాఫ్రీ, కాంగ్రెస్ నుంచి జి.నిరంజన్, రాజేష్ కుమార్, బీజేపీ నుంచి యాంటోని రెడ్డి, ఎస్ శ్రీనివాస్, కొల్లూరు పవన్ కుమార్, సీపీఐ నుంచి ఈటి నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
రెండో రోజు రెండు నామినేషన్లు
హైదరాబాద్–రంగారెడ్డి–-మహబూబ్ నగర్ స్థానానికి బుధవారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులుగా పూజారి లింగం గౌడ్, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) అభ్యర్థిగా కపిలవాయి దిలీప్ కుమార్ నామినేషన్లు వేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు మొత్తం 5 నామినేషన్లు వచ్చాయి.
For More News..