- హరీశ్‌రావు బీజేపీలో చేరిపోతడు
- ముఖం చెల్లకే కేసీఆర్ అసెంబ్లీకి రాలే
- అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నరు
- త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు
- మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి
యాదాద్రి, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకోవడం మొదలుపెడితే ఆ పార్టీలో మిగిలేది నలుగురేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు మాత్రం బీజేపీలో చేరతారని కీలక వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘గతంలో మా వాళ్లను బెదిరించి పార్టీలోకి లాక్కున్నా.. ఉన్న ఐదుగురే మీతోటి కొట్లాడారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లైన్ కడుతున్నరు. మేం అందరినీ గుంజుకుంటే బీఆర్ఎస్లో నలుగురే (కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్) మిగులుతరు.
హరీశ్‌రావు మాతో టచ్‌లో లేడు. బీజేపీతో టచ్‌లో ఉన్నడు. ఆ పార్టీలో చేరుతడు’ అని వ్యాఖ్యానించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం విధ్యంసానికి గురై వందేండ్లు వెనక్కి వెళ్లిందని, ప్రతిరోజు కుంభకోణమే అని ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్టర్లకు రూ .36 వేల కోట్ల బకాయిలు పెట్టారని మండిపడ్డారు. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. ముఖం చూపించుకోలేక అసెంబ్లీకి కేసీఆర్ రాలేదని ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్ నువ్వేమన్నా ఆకాశం మీద నుంచి ఊడిపడ్డవా? 20 రోజులు అసెంబ్లీ నడిచినా ఎందుకు రాలేదు?’ అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేత ఎవరో తేల్చిన మరుక్షణమే బీఆర్ఎస్లో కేటీఆర్, హరీశ్‌రావు వేర్వేరు దుకాణాలు పెడ్తారని అన్నారు. బీఆర్ఎస్ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయిందని తెలిపారు. ఆ పార్టీ ఎంపీలు బీజేపీలోకి వెళ్లారని చెప్పారు. యాదగిరిగుట్ట, భద్రాచలం అభివృద్ధి పేరుతో రూ. వందల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. కొందరు ఆఫీసర్లు రికార్డులు, హార్డ్‌డిస్క్‌లు మాయం చేశారని వెల్లడించారు. ట్రిపుల్ ఆర్ విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, మార్పులు, చేర్పులతో ముందుకు సాగుతామని తెలిపారు.
ఎల్ఆర్ఎస్ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇండ్లు, సాధ్యమైనంత తొందరగా రేషన్‌కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. ఉద్యోగాల పేరు చెప్పి.. బీఆర్ఎస్ అన్ని పెండింగ్‌లో పెడితే తాము ఓ పద్ధతి ప్రకారం.. నియామకాలు చేపట్టామని, మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నామని తెలిపారు.
మోదీతో రాజకీయంగా కొట్లాడుతం
ప్రధాని మోదీతో తాము రాజకీయంగా కొట్లాడతామని, అభివృద్ధి విషయంలో కలిసి ముందుకు పోతామని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. భువనగిరి లేదా నల్లగొండ నుంచి పోటీ చేయాలని రాహుల్‌గాంధీని అడిగామని, ఆయన పోటీకి అంగీకరిస్తే వారణాసి ( ప్రధాని మోదీ నియోజకవర్గం) కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. కార్యకర్తలకు న్యాయం చేస్తామని, పాలకమండళ్లు ఏర్పాటు చేస్తామని, నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు.
ఇందుకోసం కార్యకర్తలు పార్టీకి నెల సమయం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో 13 నుంచి 14 లోక్‌సభ సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణం కోసం ప్రతి అసెంబ్లీకి రూ.30 కోట్ల చొప్పున మొత్తం రూ. 1,150 కోట్లు అందిస్తామని వెల్లడించారు. రూ.200 కోట్లతో గంధమల్ల, బస్వాపూర్ పనులు పూర్తి చేసుకుని మల్లన్నసాగర్ నుంచి తాగు నీరు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, చీర శ్రీశైలం పాల్గొన్నారు.