సమగ్ర కులగణన సర్వే సమాచారం సగమే

  • సమగ్ర కులగణనలో అన్ని వివరాలు చెప్తలే
  • దరఖాస్తులో 56 ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు
  • కులం, కుటుంబ వివరాలు,  అప్పులే చెప్తున్నరు
  • ఆస్తులు, పథకాల లబ్ధి, ఇతరత్రా ప్రశ్నలకు నో
  • వస్తున్న స్కీమ్స్​ పోతాయన్న భయంతో వెనుకడుగు
  • జీతాలు కూడా కరెక్ట్​గా వెల్లడించని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో సగం సమాచారమే వస్తున్నది. దరఖాస్తులో ఉన్న ప్రశ్నలన్నింటికీ ఎవరూ పూర్తి వివరాలు ఇవ్వడం లేదు. సర్వే దరఖాస్తులో మొత్తం 56 ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో కేవలం 20 నుంచి 25 ప్రశ్నలకే పూర్తి స్థాయిలో జనం సమాచారం ఇస్తున్నారు. 

ఇందులో కులం, కుటుంబ సభ్యుల వివరాలు, చదువు వివరాలు, అప్పులు తప్ప ఇతరత్రా వివరాలు చెప్పడం లేదు. ఆస్తుల గురించి అడిగితే చాలు... అప్పులే తప్ప ఆస్తులు లేవని చెప్తున్నారు. పథకాల లబ్ధి గురించి కూడా లబ్ధిదారులు వెల్లడించడం లేదు. లబ్ధి పొందినవి చెప్తే భవిష్యత్​లో ఇస్తరో ఇవ్వరో అనే భయం.. రేషన్​కార్డులు, ఆరోగ్య శ్రీ వంటివి కూడా పోతాయేమోనన్న అనుమానంతో వెనుకడుగు వేస్తున్నట్లు తెలిసింది. 

ఆఖరికి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా తాము ఎంత జీతం అందుకుంటున్నదీ,  ఆస్తులు ఎన్ని ఉన్నాయనేది కూడా కరెక్ట్​గా చెప్పడం లేదు. ఆధార్​ నంబర్లు ఇచ్చేందుకు కూడా కొందరు జనం ఆలోచిస్తున్నారు. ఇక కొన్నిచోట్ల  రెంటర్లను తమ ఇంటి నంబర్​ చెప్పొద్దంటూ ఆ ఇంటి యాజమానులు దబాయిస్తున్నారు. ఈ విషయంలో ఎన్యుమరేటర్లు కూడా అవగాహన కల్పించడం లేదు.

 కొన్ని ఏరియాల్లో ఎన్యుమరేటర్లు  అసిస్టెంట్లను పెట్టుకొని సర్వే ఫారాలు నింపుతున్నారు. అయితే గ్రామాల్లో తెలిసిన వ్యక్తులను ఎన్యుమరేటర్లు తమతో తీసుకెళ్లడంతో కొంత వరకైనా పూర్తి స్థాయి సమాచారం అందుతున్నది.కొంతమంది బీసీలు మాత్రం కులగణన కోసమే సర్వే చేస్తున్నారని, తమకు రిజర్వేషన్లు పెంచుతారని వాస్తవాన్ని గ్రహించి  పూర్తి వివరాలు వెల్లడిస్తున్నారు. 

ఒక్కో దరఖాస్తు పూర్తికి 20 నిమిషాలు

ఈ నెల 6 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను ప్రారంభించింది. తొలుత ఇండ్లకు స్టిక్కర్లు అంటించగా.. 9వ తేదీ నుంచి వివరాల నమోదు మొదలైంది.  ఇప్పటి వరకు 58.3 శాతం ఇండ్ల సర్వే పూర్తయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తొలి రెండు రోజులు ఎన్యుమరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్​తో పాటు రాష్ట్రంలోని వివిధ పట్టణ ప్రాంతాల్లోనూ సర్వేలో ఎన్యుమరేటర్లకు సమాచారం ఇవ్వకపోగా.. ఎందుకివ్వాలంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇంకొందరు అవసరం లేదంటూ తెగేసి చెప్పారు.

 అదే సమయంలో ఎన్యుమరేట్లకు కూడా సర్వేపైనా పూర్తి అవగాహన లేకపోవడంతో సమస్యలు వచ్చాయి.  ఈ విషయాలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎవరు ఎంత సమాచారం ఇస్తే అంతే తీసుకోండి అని ఎన్యుమరేటర్లను ఆదేశించింది. దీంతో పబ్లిక్ ఎన్ని వివరాలు చెప్తే అంతవరకే ఎన్యుమరేటర్లు తీసుకుంటున్నారు. ఇక పబ్లిక్​కు కూడా ఎందుకు ఇంటింటి సర్వే చేస్తున్నామనే విషయాన్ని కూడా కొందరు ఎన్యుమరేటర్లు అర్థమయ్యేలా చెప్పలేకపోవడంతోనూ పూర్తి సమాచారం రావడం లేదని తెలుస్తున్నది. ఒక్కో దరఖాస్తు కంప్లీట్​ చేసేందుకు కనీసం 20 నిమిషాలు పడుతుండటంతో  కొందరు ఎన్యుమరేటర్లు సీరియస్​గా తీసుకోవడం లేదని తెలిసింది.  

ఆస్తులు, స్కీమ్​ల లబ్ధి చెప్పేందుకు నో

సర్వేలో ప్రధానంగా జనం తమ ఆస్తులు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. ఈ సర్వేలో 19వ ప్రశ్న నుంచే ఎన్యుమరేటర్లకు అసలు సమస్య మొదలవుతున్నది. ఈ ప్రశ్న కింద.. ఏం పనిచేస్తున్నారో అడుగుతున్నారు. కొందరు చేసే పనిని చెప్తుండగా.. మరికొందరు చేసే పని కాకుండా వేరే పనిని చెప్తున్నట్లు తేలింది. ఆ తర్వాత ప్రశ్నల్లో వ్యాపారం ఏం చేస్తున్నారు? అని అడిగితే.. ఏం బిజినెస్​ లేదని జనం అంటున్నారు. 

ఇక వార్షిక ఆదాయం, ఐటీ చెల్లింపులు, కుల వృత్తి, బ్యాంకు ఖాతా నంబర్ల గురించి ప్రశ్నలు ఉన్నాయి. వాటికి జనం సరిగ్గా సమాచారం ఇవ్వడం లేదు. వాస్తవానికి ధరణిలో ప్రభుత్వం దగ్గర ఎవరెవరి పేరు మీద ఎంత భూములున్నాయనే వివరాలు ఉన్నాయి. అయితే సర్వేలో కుటుంబాల వారీగా ప్రభుత్వం ఈ వివరాలను కూడా తీసుకుంటున్నది. గ్రామాల్లో ఎవరికి ఎంత భూమి ఉన్నదో జనం చెప్పేందుకు ముందుకు రావడం లేదు. 

కొందరు అయితే ఇంట్లో నాన్న పేరు మీద ఉన్నదని.. తాము వేరుగా ఉంటున్నామని.. ఇంకొందరైతే ఉన్న భూమిని ఎప్పుడో అమ్ముకున్నామని తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు తెలిసింది. అసైన్డ్​ భూములు పొందిన వాళ్లు కూడా ఆ వివరాలు తెలియజేయడం లేదు. ఇవే కాకుండా ఇతర స్థిర, చరాస్తులు, ఇంట్లో బైక్​ ఉందా కారు ఉందా , ట్రాక్టర్ ఉందా అనే వాటికి కూడా ‘నో’ చెప్తున్నారు. 

ఇక గొర్రెలు, ఆవులు వంటి పశుసంపద విషయంలోనూ కరెక్ట్​ సమాచారం ఇవ్వడం లేదు. మరో ప్రధానమైన ప్రశ్న.. రిజర్వేషన్ నుంచి ఉద్యోగ ప్రయోజనాలు ఏమైనా పొందారా? అని ఉండగా అదీ కూడా చాలా మంది చెప్పడం లేదు. గత ఐదేండ్లలో ప్రభుత్వం నుంచి పథకాలు ఏమైనా లబ్ధి పొందారా? అంటే దాదాపు 70 శాతం మంది లేదనే సమాధానం ఇస్తున్నారు. కేవలం ఆసరా పెన్షన్లు వస్తున్నవాళ్లే ఆ విషయాన్ని వెల్లడిస్తున్నారు. 

పథకాలు వచ్చాయని చెప్తే భవిష్యత్​లో అసలు ఏమీ ఇవ్వరేమోనన్న అపోహతో తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు తెలిసింది. కొంతమంది ఇప్పటికే సర్పంచ్​లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, ఇతర ప్రభుత్వ పొలిటికల్​ నామినేటెడ్​ పోస్టుల్లో పనిచేసినోళ్లలో కూడా ఆ వివరాలు ఇచ్చేందుకు వెనకంజవేస్తున్నారు.

ఎక్కడ ఎలాంటి సమస్యలు వస్తున్నాయంటే..!

హైదరాబాద్​​ జిల్లాలోని కొన్ని ఏరియాల్లో ఇండ్లు కిరాయికి ఇచ్చిన ఓనర్లు అందులో ఉంటున్న ఫ్యామిలీ వివరాలు నమోదు చేయడానికి ఒప్పుకోవడం లేదు. తమ ఇంటి నంబర్ పై అద్దెకుంటున్న కుటుంబీకుల పేర్లు ఎంటర్ అయితే ఓనర్ షిప్ మారుతుందని వారు అనుమానిస్తున్నారు.

నారాయణపేట జిల్లాలోని ఊట్కూరు మండలంలో రెండ్రోజులు సర్వే నిలిచిపోయింది. ఆ మండలంలోని కొన్ని గ్రామాల్లో మాదాసి కుర్వలు సర్వే కోసం వచ్చిన సిబ్బందికి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ ఉందని, వాటికి సంబంధించిన సర్టిఫికెట్లు ఇస్తేనే వివరాలు చెప్తామని స్పష్టం చేశారు. దీంతో తహసీల్దార్ గ్రామాలకు చేరుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో కొందరు మాత్రమే వివరాలు చెప్పారు. 

కామారెడ్డి జిల్లాలో మధుర లంబాడీలు ( లగాన్ లంబాడీలు ) వివరాలు ఇవ్వడం లేదు. వీరు ప్రస్తుతం బీసీల్లో ఉన్నారు.  వారి నుంచి ఎస్టీల్లో చేర్చాలనే డిమాండ్​ కొన్నాళ్లుగా వస్తున్నది.  తమ సమస్యను పరిష్కరించే వరకు వివరాలు ఇవ్వమంటూ  చెప్తున్నారు. ఇక జిల్లాలోని మిగతా చోట్ల సర్వేలో ఆస్తుల వివరాలు, అప్పుల వివరాలు జనం సరిగ్గా చెప్పట్లేదు.  

జగిత్యాల జిల్లాలో కొన్ని ఏరియాల్లో జనం ఆస్తుల వివరాలను చెప్పకుండా అప్పులు వెల్లడిస్తున్నారు. కొందరు తమకు ఆస్తులు లేవని, అప్పులు మాత్రమే ఉన్నాయని అంటున్నారు. 

కరీంనగర్ జిల్లాలో సర్వే కోసం ఇంటికొస్తున్న ఎన్యుమరేటర్లకు‌‌ పూర్తి వివరాలు చెప్పేందుకు చాలామంది వెనకాడుతున్నారు. ఆస్తుల వివరాలు చెప్తే రేషన్ కార్డులు, పింఛన్లు పోతాయని, ఇతర స్కీమ్ లు రావేమోనని భయపడుతున్నారు. ఆధార్​ వివరాలు వెల్లడించడం ఆప్షనల్‌‌ కావడంతో, వాటి వివరాలు చెప్పడం లేదు.    

ఇప్పటి వరకు 58.3 శాతం ఇండ్ల సర్వే పూర్తి

ఈ నెలఖారులోగా సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్​లైన్​గా పెట్టుకున్నది. ఇప్పటికే 58.3 శాతం పూర్తయినట్లు వెల్లడించింది. ఇంకో వారం, పది రోజుల్లో వివరాల నమోదు పూర్తయ్యే అవకాశం ఉంది. సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇండ్లను గుర్తించారు. నవంబర్ 9 నుంచి వివరాల  నమోదు ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు  67,72,246 గృహాల సర్వే పూర్తయింది. 

జిల్లాల వారీగా చూస్తే.. ములుగు (87.1% ),నల్గొండ (81.4%) జిల్లాలు ముందంజలో ఉన్నాయి. జనగాం (77.6%), మంచిర్యాల (74.8%), పెద్దపల్లి (74.3%) తర్వాత వరుస లో ఉన్నాయి.  జనసాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్​ హైదరాబాద్​ సిటీలో  38.3%  సర్వే పూర్తయింది. ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని ఆన్​లైన్​లో ప్రత్యేక సాఫ్ట్​వేర్​లో ఎంట్రీ చేస్తున్నారు. మొత్తం 87,807 మంది ఎన్యుమరేటర్లు పనిచేస్తున్నారు. 8,788 మంది సర్వేను పర్యవేక్షిస్తున్నారు.