
హిందువులు చాలా మంది దేవుళ్లను పూజిస్తారు. ఒక్కో పండుగ రోజు ఒక్కో దేవుడి అవతారాన్ని పూజిస్తాము. సత్యనారాయణస్వామి వ్రతం చేసుకున్న తరువాత స్వామికి ఉద్వాసన చెప్పి.. ఇంట్లోనే ఉంచుకుంటాం.. వరలక్ష్మీ వ్రతం తరువాత కూడా అమ్మవారిని ఇంట్లోనే పెట్టుకుంటాం.. కాని వినాయకచవితి రోజున గణేషుడిని పూజించి... ఘనంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి వినాయకుడి ప్రతిమను నీళ్లలో నిమజ్జనం చేస్తాం.. మిగతా దేవుళ్లను ఎందుకు నిమజ్జనం చేయరు.. ఒక్క గణేషుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.. దీని వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యం ఏమిటో తెలుసుకుందాం. ..
వినాయకచవితి భాద్రపద మాసంలో ప్రకృతి అంత పచ్చదనంతో నిండిపోయి కనిపిస్తుంది, వేసవికాలం పోయి, బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకుని పచ్చదనాన్ని వెదజల్లుతుంది. నదులలో నీరు నిండి ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. గణపతి జన్మనక్షత్రానికి అధిపతి అయిన బుధగ్రహానికి ఆకుపచ్చనివి అంటే చాలా ఇష్టం. గణపతికి గడ్డిజాతి మొక్కలంటే చాలా ప్రీతి. అందుకే గణపతికి 21 గడ్డిజాతి మొక్కలను సమర్పించి పూజలు చేస్తుంటారు.
భక్తితో కూడిన వివరాలతో పాటు శాస్త్రీయ కోణం కూడా ఉంది. వినాయకచవితినాడు .. గణేషుడు భక్తుల పూజలు అందుకొని వారి మాటలను విని.. వారి కోర్కెలు తీర్చడానికి భూమిపైకి వచ్చిన వినాయకుడిని తిరిగి స్వర్గానికి పంపించడానికి దగ్గరి మార్గం సముద్రమే కనుక అందువలన వినాయకుడి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారని పండితులు చెబుతున్నారు.
తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణపతి విగ్రహాన్ని పదవరోజున మేళతాళాలతో జల నిమజ్జనం చేయడంలో వేదాంత రహస్యం ఉన్నదని పండితులు చెబుతున్నారు. పంచ భౌతికమైన ప్రతి పదార్దం .. అంటే పంచ భూతాల ( భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం) నుంచి జన్మించిన ప్రతి ఒక్క సజీవ మరియు నిర్జీవ పదార్దాలు మధ్యలో ఎంత వైభవంగా.. విలాసవంతంగా... లగ్జరీగా జీవితం గడిపినా చివరకు అంతిమంగా మట్టిలో కలిసి పోవాల్సిందే. అందుకే ప్రకృతి దైవుడైన మట్టి గణపతికి అంగరంగ వైభవంగా పూజలు చేసి ప్రజలు కోలాహలం.. హడావిడి.. మేళ తాళాలు..నత్యాల మధ్య వినాయకుడిని ఊరేగించి చివరికి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఎంత గొప్పగా బతికిన వారైనా చివరికి మట్టిలో కలిసి పోవాల్సిందే అన్న ఒక్క సారాంశంతో వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.
ఒండ్రుమట్టితో చేసిన వినాయకుడి ప్రతిమనే మాత్రమే గణేష్ పూజకు ఉపయోగించడంలో ఒక విశేషముంది. అందుకు కారణం జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి. బంకమట్టి కోసం జలాశయాలలో దిగి మట్టిని తీయడం వల్ల జలాశయాల్లో నీళ్లు తేట పడతాయి. జలాశయాల్లోని మట్టిని తీసి దానితో బొమ్మను చేయడం వల్ల ఆ మట్టిలోని మంచి గుణాలు మన శరీరానికి పడతాయి. నీటిలో నానిన ఉండ్రుమట్టి మనము తాకితే.. శరీరానికి చాలా మంచిదని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు.
గణపతి పూజకోసం మట్టి విగ్రహం మరియు 21 రకాల పత్రిలను ఉపయోగించడం వెనుక మరో కారణం కూడా ఉంది. ఒండ్రుమట్టిలోనూ.. గణపతిని పూజించే ఆకులలోనూ ఔషధ గుణాలున్నాయి. గణపతి విగ్రహాన్ని పూజించేటప్పుడు విగ్రహాన్ని.. ఆకులను తాకడం వలన ఔషధితత్వం మనకు చేరుతుంది. విగ్రహాన్ని... పూజించిన పత్రాలను ఇంట్లో ఉంచుకోవడం వలన చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధగుణాలు చేరుతాయి. మనము ఆ గాలిని పీల్చడం వలన మనకు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
తొమ్మిది రోజులు వినాయుడిని పూజించిన తరువాత విగ్రహాన్ని... పత్రిని దగ్గరలో ఉన్న చెరువుల్లో కాని జలాశయాల నీళ్లలో నిమజ్జనం చేస్తాము. సాధారణంగా వినాయకచవితి నాటికి బాగా వర్షాలు పడతాయి. వాగులు, వంకలు, నదులు, చెరువులు పొంగి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ సమయంలో నదులలో మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వలన వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో ప్రవహించే నీటిలో అధికంగా క్రిమి కీటకాలు ఉంటాయి. గణేష్ నిమజ్జన సమయంలో నీళ్లలో వదిలిన ఆకులతో నీరు పరిశ్రుభ్రంగా (క్రిమి రహితంగా) మారిపోతుంది. అందుకే వినాయకుడిని పూజించిన తరువాత నీళ్లల్లో నిమజ్జనం చేస్తారు.అయితే కొంతమంది ఆడంబరానికి పెద్ద పీటవేస్తూ ప్రతిష్ట కోసం రంగు రంగుల విగ్రహాలను నీటిలో కలపడం వలన నిమజ్జనం వెనుక ఉన్న ఉద్దేశాలను దెబ్బతీస్తున్నాయి. ఈ రోజుల్లో ప్రకృతిని కొలవడం ... అలాగే భక్తితో పూజించడం అన్న లక్ష్యాలను పక్కన పెట్టి ప్రకృతిని నాశనం చేస్తున్నారు.