33 వేల మందికి ఒక్కడే డాక్టర్​.. ఇదీ మన ఆరోగ్యరంగం

33 వేల మందికి ఒక్కడే డాక్టర్​.. ఇదీ మన ఆరోగ్యరంగం
  • హెల్త్​లో సర్కార్ పూర్
  • జనాభాకు తగ్గట్టు డాక్టర్లు, నర్సులు లేరు
  • సర్కారు తీరును తప్పుపట్టిన 15వ ఫైనాన్స్​ కమిషన్
  • రాష్ట్రంలో హెల్త్​ డిపార్ట్​మెంట్​కు అతి తక్కువ ఫండ్స్

రాష్ట్ర సర్కారు పబ్లిక్​ హెల్త్​లో చాలా వెనుకబడిందని, హాస్పిటళ్లలో పరిస్థితి దారుణంగా ఉందని 15వ ఫైనాన్స్​ కమిషన్​ వెల్లడించింది. బడ్జెట్​లో పబ్లిక్​ హెల్త్​పై తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే రెండో ప్లేస్​లో ఉందని తెలిపింది. సగటున ఒక్కొక్కరికి చేస్తున్న హెల్త్​ ఎక్స్​పెండిచర్​లో రాష్ట్రం వెనుకబడిందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, వచ్చే ఐదేండ్లకు సంబంధించిన అంచనాలతో విడుదల చేసిన రిపోర్టులో ఫైనాన్స్​ కమిషన్​ ఈ వివరాలు వెల్లడించింది.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జనాభాకు సరిపడా డాక్టర్లు లేరని.. పేదలకు ట్రీట్​మెంట్​ అందే గవర్నమెంటు దవాఖాన్లలో తీవ్రంగా డాక్టర్ల కొరత ఉందని ఫైనాన్స్​ కమిషన్​ తెలిపింది. నేషనల్​హెల్త్​ పాలసీ ప్రకారం ప్రతి రాష్ట్రం 2020 నాటికల్లా బడ్జెట్లో 8% ఫండ్స్​ను హెల్త్ కేర్​పై ఖర్చు చేయాలని, కానీ తెలంగాణ 4.19 శాతం మాత్రమే ఖర్చు చేస్తోందని 15వ ఫైనాన్స్​ కమిషన్​ తేల్చింది. ఏకంగా 3.81 శాతం గ్యాప్​ ఉందని.. హెల్త్​పై కనీసం 5 శాతానికిపైగా అయినా ఖర్చు చేయకపోవడం సరికాదంది.

పీహెచ్​సీల్లో 1,066 మంది డాక్టర్లే..

రూరల్​ ఏరియాల్లో, గ్రామాల్లో ఉండే హెల్త్​ సెంటర్లలో అసలు డాక్టర్లే లేరని పేర్కొంది. రాష్ట్రంలోని రూరల్​ ఏరియాల్లో సగటున 33 వేల మందికి ఒక్క డాక్టర్​ మాత్రమే ఉన్నారని తెలిపింది. రాష్ట్రంలోని పీహెచ్​సీల్లో 1,066 మంది డాక్టర్లే ఉన్నారని వివరించింది. ప్రైమరీ హెల్త్​కు ప్రయారిటీ ఇవ్వాలని.. బడ్జెట్లో హెల్త్​కు కేటాయించే మొత్తంలో మూడో వంతు పీహెచ్​సీలకే ఖర్చు చేయాలని సిఫార్సు చేసింది. డబ్ల్ యూహెచ్ వో (వరల్డ్​హెల్త్​ఆర్గనైజేషన్) గైడ్ లైన్స్ ప్రకారం.. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక డాక్టర్ ఉండాలని.. కానీ రాష్ట్రంలో జనాభాకు తగినట్టుగా డాక్టర్లేకాదు, నర్సులు, ఫార్మాసిస్టు‌లు కూడా లేరని స్పష్టం చేసింది. ఈ విషయంలో చొరవ తీసుకోవడంలో రాష్ట్ర సర్కారు ఫెయిలైందని పేర్కొంది. రాష్ట్రంలో సగటున 2,894 మందికి ఒక్క నర్సు మాత్రమే అందుబాటులో ఉన్నారని.. ఎప్పటికప్పుడు డాక్టర్లను, నర్సులను రిక్రూట్ చేసుకోకపోవడంతోనే సమస్య వస్తోందని వివరించింది. సర్కారు తీరు ఫలితంగా పబ్లిక్‌కు సరైన ట్రీట్‌మెంట్ అందడం లేదని పేర్కొంది. రాష్ట్రంలో 8,536 మందికి ఒక్క గవర్నమెంట్ డాక్టర్ మాత్రమే ఉన్నారని, దీంతో పేద రోగులు కూడా ప్రైవేటు వైపు పరుగులు తీయాల్సి వస్తోందని ఫైనాన్స్ కమిషన్ తెలిపింది. రాష్ట్ర సర్కారు ఏటా యావరేజ్‌గా ఒక్కొక్కరి పై రూ.1,405 మాత్రమే ఖర్చు చేస్తోందని వెల్లడించింది. తెలంగాణలో 100 బెడ్లు, 50 బెడ్ల క్రిటికల్ కేర్ హాస్పిటళ్ల ఏర్పాటు కోసం కేంద్రం నుంచి రూ.270 కోట్లు గ్రాంటు ఇవ్వాలని రికమండ్ చేసింది. పబ్లిక్ హెల్త్, హాస్పిటల్స్‌ను రాష్ట్రాల జాబితా నుంచి ఉమ్మడి లిస్ట్​లోకి మార్చాలని కేంద్రానికి సూచించింది. అలాగే రైట్ టు హెల్త్ (ఆరోగ్య హక్కు) ను ప్రాథమిక హక్కుగా ప్రకటించవచ్చని తెలిపింది.

ఉద్యోగాల కల్పనలో ఫెయిల్
నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే ఐదో ప్లేస్‌లో ఉందని 15వ ఫైనాన్స్ కమిషన్ వెల్లడించింది. 15 ఏండ్లు ఆపై వయసున్న వారికి ఉద్యోగాలు కల్పించడంలో రాష్ట్ర సర్కారు ఫెయిలైందని విమర్శించింది. ఉపాధి కల్పించేందుకు రాష్ట్రంలో లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్‌ను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని సూచించింది. అటు ఎడ్యుకేషన్‌లో కూడా తెలంగాణ పరిస్థితి ఘోరంగా ఉందని ఫైనాన్స్ కమిషన్ పేర్కొంది. మూడో తరగతి చదువుతున్న స్టూడెంట్లలో 18.1 శాతం మంది.. కనీసం రెండో తరగతికి సంబంధించిన పాఠాలను చదవలేకపోతున్నారని తెలిపింది. మూడో క్లాసు స్టూడెంట్లు కనీసం తీసివేతలు చేయలేకపోతున్నరని.. అలాంటి వారు 34.5 శాతంగా ఉన్నారని వెల్లడించింది. ఇది నేషనల్​ యావరేజీ కంటే దారుణమని పేర్కొంది. రాష్ట్రంలో
ఎడ్యుకేషన్ పై పెడ్తున్న ఖర్చు జీఎస్డీపీలో 1.8 శాతమేనని.. ఇది డబుల్​ ఉండాలని స్పష్టం చేసింది.

నాలుగేండ్లైనా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్​ ఇయ్యరా?
లోకల్​బాడీస్ విషయంలో నాలుగేండ్లు గడుస్తున్నా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ (ఎస్ఎఫ్సీ) రిపోర్ట్​ ఇవ్వకపోవడం ఏమిటని 15వ ఫైనాన్స్ కమిషన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాగైతే లోకల్​బాడీస్ డెవలప్‌మెంట్ ఎలా గాడిన పడుతుందని నిలదీసింది. తమ రికమెండేషన్స్ ఆధారంగానే ఎస్ఎఫ్సీ రికమెండేషన్స్ ఉంటాయని తెలిపింది. సిఫార్సులను అమలు చేస్తున్నరా, లేదా అనే దానిపై స్పష్టత ఉండాలని.. మార్చి 2024 కంటే ముందు దీనిపై అసెంబ్లీలో యాక్షన్ టెకెన్ రిపోర్ట్ ​పెట్టాలని స్పష్టం చేసింది.

అడ్డగోలు అప్పులు ఆందోళనకరం

అప్పులు తీసుకోవడంలో తెలివిగా వ్యవహరిస్తున్నామని తెలంగాణ సర్కారు అనుకుంటోందని.. కానీ బడ్జెటేతర లోన్ల విషయంలో జాగ్రత్తగా లేకుంటే ఆర్థిక సంక్షోభం తప్పదని ఫైనాన్స్​ కమిషన్​ హెచ్చరించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. వాటి పేరుమీద లోన్లు తీసుకుంటున్నారని.. వడ్డీల భారం పెరిగి త్వరలోనే ఫైనాన్షియల్​గా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. బడ్జెట్​లో పెట్టకుండా బయటి నుంచి 2016–17 నాటికే రూ.29,965 కోట్ల లోన్​ తీసుకుందని.. జీఎస్డీపీతో చూస్తే 5 శాతాన్ని మించిపోయిందని తెలిపింది. ఇరిగేషన్ పై పెద్ద మొత్తంలో ఖర్చు చేశారని.. కానీ వాటి ఫలితాలేవీ ఇంకా రాలేదని పేర్కొంది. పంట దిగుబడులు పెరగలేదని, రైతులకేం అదనపు ఆదాయం రాలేదని స్పష్టం చేసింది. రాష్ట్ర సర్కారు వివిధ రూపాల్లో తీసుకున్న లోన్లు అన్నింటినీ తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

For More News..

పోతిరెడ్డిపాడు పక్కనే రాయలసీమ లిఫ్ట్‌

ఈ యాసంగి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు బంద్‌