కులాల జాబితా సవరణ పార్లమెంట్ పని.. కనీసం కామాను‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా మార్చలేం: సుప్రీంకోర్టు

కులాల జాబితా సవరణ పార్లమెంట్ పని.. కనీసం కామాను‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా మార్చలేం: సుప్రీంకోర్టు
  • హైకోర్టు తీర్పుతో మణిపూర్​లో జరిగింది చూశారుగా
  • తెలంగాణ ఆరే కటిక సంఘం పిటిషన్​పై కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, వెలుగు: కులాల జాబితాను సవరించడం, కొత్త చట్టాలను రూపొందించడం పార్లమెంట్ పని అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంలో కనీసం కామాను కూడా మార్చలేమని స్పష్టం చేసింది. మైతేయి కులస్తులకు రిజర్వేషన్ ​విషయంలో హైకోర్టు తీర్పు తర్వాత మణిపూర్​లో ఏం జరిగిందో చూస్తున్నాం కదా? అని గుర్తుచేసింది. దేశవ్యాప్తంగా ఆరే-కటిక (ఖాతిక్) కులస్తులను షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) జాబితాలో చేర్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేస్తూ.. విచారణకు నిరాకరించింది. 

దేశవ్యాప్తంగా ఆరే-కటిక(ఖాతిక్) కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఆరే-కటిక(ఖాతిక్) సంఘం ఈ ఏడాది జనవరి 8న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. కొన్ని రాష్ట్రాల్లో ఆరే కటిక(ఖాతిక్) కులస్తులు ఎస్సీలుగా ఉంటే, మరికొన్ని రాష్ట్రాల్లో ఓబీసీలుగా ఉన్నారని పిటిషన్​లో పేర్కొంది. ఈ విధానంతో వేరే రాష్ట్రానికి చెందిన అమ్మాయి లేదా అబ్బాయితో వివాహం జరిగినప్పుడు రిజర్వేషన్ల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయని తెలిపింది. ఎస్సీ కేటగిరీలో చేర్చాలన్న ప్రతిపాదనను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫీసు 2006లో తొలిసారిగా పరిశీలించిందని, అయితే సరైన ఎథ్నోగ్రాఫిక్ డేటా లేదనందున మద్దతు ఇవ్వలేదని పిటిషన్​లో పేర్కొన్నారు. 

ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ బెంచ్ ముందుకొచ్చింది. ‘‘మణిపూర్​లో ఏం జరిగిందో మీకు తెలుసు కదా? హైకోర్టు తీర్పు తర్వాత ఎలాంటి పరిస్థితి నెలకొందో? ఆ తర్వాత మణిపూర్ లో ఎంతగా అల్లర్లు జరిగాయో చూశారు కదా?’’అని వ్యాఖ్యానించింది. కులాల జాబితాను సవరించడం, కొత్త చట్టాలను రూపొందించడం పార్లమెంట్ పని అని జస్టిస్ గవాయి అన్నారు. అందువల్ల పార్లమెంట్​ను ఆశ్రయించాలని సూచించారు. మరోసారి పిటిషనర్ అభ్యర్థించడంతో చివరికి పిటిషన్ ను ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.