మెట్ పల్లి, వెలుగు: మైనార్టీ యువత సంక్షేమం కోసం వందల కోట్లు బడ్జెట్ కేటాయించామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో భిన్నంగా వ్యవహరిస్తోంది. ఆరున్నర ఏండ్లుగా వేలాది మంది నిరుద్యోగ యువత లోన్ల కోసం ఎదురు చూస్తుండగా, సర్కార్లోన్లు ఇస్తామని ఇటీవల ప్రకటించారు. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లు పెట్టుకోవాలని సూచించారు. అయితే జిల్లాలో మున్సిపాలిటీకి ఐదుగురికి, మండలానికి ముగ్గురికే లోన్లు ఇస్తున్నట్లు ప్రకటించడంతో పోటీ ఎక్కువగా ఉండడంపై మైనారిటీ యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోన్ల యూనిట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
రూ.1లక్ష లోపు 59 యూనిట్లు..
జిల్లాలోని 5 మున్సిపాలిటీలు, 18 మండలాల్లో మైనారిటీ యువకులకు 84 సబ్సిడీ లోన్యూనిట్లు ప్రభుత్వం కేటాయించింది. దీనిలో 80 శాతం సబ్సిడీతో రూ. లక్ష లోపు 59 యూనిట్లు, 70 శాతం సబ్సిడీతో రెండు లక్షల లోపు 25 యూనిట్లను కేటాయించింది. ఈ లోన్ల కోసం ఈ నెల 5 వరకు అప్లై చేసుకోవాలని ముందుగా ప్రకటించి, మళ్లీ 9 వరకు పెంచారు. మొత్తం 84 యూనిట్లకు 3,948 మంది అప్లై చేసుకున్నారు. ఒక్కో లోనుకు 47 మంది పోటీ ఉంది. దీంతో ఎవరికి దక్కుతాయోనని చర్చించుకుంటున్నారు.
లోన్కోసం ఏండ్లుగా ఎదురు చూస్తున్న..
బైక్‌మెకానిక్ పని చేస్తూ కుటుంబాన్ని నడుపుతున్న. రోజంతా పనిచేస్తే తిండిమందం కూడా పైసలు వస్తలేవు. లోన్కోసం ఏండ్లుగా ఎదురు చూస్తున్న. ఇటీవల ప్రభుత్వం మైనారిటీలకు లోన్లు ఇస్తున్నట్లు ప్రకటించడంతో అప్లై చేసిన. మున్సిపాలిటీకి 5 లోన్లు మాత్రమే ఇస్తున్నట్లు ఆఫీసర్లు చెప్పిన్రు. నాకు లోన్ వస్తదో రాదో ఆందోళనగా ఉంది. - మోసిన్ ఖాన్, మెట్ పల్లి
లోన్ల బడ్జెట్ పెంచాలి
జగిత్యాల జిల్లాలో చాలా మంది మైనారిటీ యువత నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతోంది. ప్రభుత్వం మైనారిటీల ఉపాధి కోసం లోన్లు ఇస్తున్నట్లు ప్రకటించగానే అందరూ సంబరపడ్డారు. జిల్లాలో 35 వేలకు పైగా మైనారిటీ ఫ్యామిలీలు ఉంటే 84 యూనిట్లు మాత్రమే కేటాయించడం అన్యాయం. మైనారిటీ శాఖ మంత్రి సొంత జిల్లాలో ఇంత తక్కువ సబ్సిడీ యూనిట్లు శాంక్షన్ చేయడం బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూనిట్లు పెంచాలని కోరుతున్నాం. - ఖుతుబొద్దిన్ పాషా, ముస్లిం సెంట్రల్ కమిటీ ప్రెసిడెంట్, మెట్ పల్లి
గల్ఫ్ కు పోయి లాస్ అయ్యి వచ్చిన..
ఐదేండ్ల కింద ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లిన. అక్కడ జీతం సరిగా ఇవ్వకపోయినా ఎన్నో అవస్థలు పడి మూడేండ్లు పని చేసిన. అనంతరం స్వేదేశానికి తిరిగొచ్చిన. వచ్చి కూడా రెండేండ్లు అవుతోంది. ఉపాధి లేక ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న. వెల్డింగ్ పని కోసమని సబ్సిడీ లోన్ కోసం అప్లై చేసుకున్న. ప్రభుత్వం లోన్ ఇచ్చి ఆదుకోవాలి. - షేక్ మసూద్, మెట్పల్లి