న్యూఢిల్లీ: ఐపీఓల జోరుకు బ్రేక్ పడింది. ఈ వారం కేవలం రెండు ఐపీఓలు మాత్రమే ఇన్వెస్టర్ల ముందుకొస్తున్నాయి. రూ.365 కోట్లను సేకరించనున్నాయి. కిందటి నెలలో ఏకంగా 12 మెయిన్ బోర్డ్ ఐపీఓలు, 40 ఎస్‌ఎంఈ ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకొచ్చాయి. ఈ నెల 8 న మెయిన్‌బోర్డ్ ఐపీఓ గరుడ కన్‌స్ట్రక్షన్ అండ్ ఇంజినీరింగ్ ఓపెన్ కానుండగా, ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో శివ్ టెక్స్‌కెమ్ ఐపీఓ ఓపెన్ కానుంది.
గరుడ కన్‌స్ట్రక్షన్ రూ.264 కోట్లను సేకరించాలని చూస్తోంది. శివ్ టెక్స్‌కెమ్ రూ.101 కోట్లను రైజ్ చేయనుంది. ఈ రెండు ఐపీఓలు ఈ నెల 10 న ముగుస్తాయి. తాత్కాలికంగా నెమ్మదించినప్పటికీ ఐపీఓ మార్కెట్ ఫుల్ జోష్‌లోనే ఉంది. 26 కంపెనీలు రూ.72 వేల కోట్లను సేకరించడానికి రెడీగా ఉన్నాయి. మరో 55 కంపెనీలు సెబీ అనుమతుల కోసం చూస్తున్నాయి. ఇవి రూ.89 వేల కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 63 ఐపీఓలు రాగా, రూ.64 వేల కోట్లను సేకరించగలిగాయి.