డ్వెంచర్ ట్రిప్స్, ఫొటోగ్రఫీ ' ఇష్టపడేవాళ్ల కళ్లు ఎప్పుడూ కొత్త ప్లేస్లని వెతుకుతుంటాయి. పచ్చదనంతో కళకళలాడుతూ ఉన్నకొండ ప్రాంతాల్లోని వాటర్ ఫాల్స్ వీకెండ్ లో టూరిస్టులని బాగా ఆకర్షిస్తాయి. 'ప్రకృతి అందాలు చూస్తూ పులకించాలి' అనుకునే వాళ్లకి ఒంటిమామిడి లొద్ది జలపాతం బెస్ట్ ఆప్షన్. అడవి మార్గంలో ఉన్న ఈ వాటర్ ఫాల్ జర్నీ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఎక్కువమందికి తెలియని ఈ వాటర్ ఫాల్ ఎక్కడ ఉందంటే.. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పాత్రపురం అనే ఊరు ఉంది. దానికి సమీపాన ఉన్నమంగవాయిగూడెం అడవిలో ఉంది. ఈ జలపాతం. అక్కడికి అడవి మార్గంలో ఏడుకిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాలి. దారంతా చిన్నచిన్న కొండలు ఉంటాయి.
పిల్ల బాట మాత్రమే ఉన్న ఈ వాటర్ ఫాల్ కి గైడ్స్ సాయం లేకుండా వెళ్లడం సాధ్యం కాదు. మంగళవాయిగూడెంకి చెందిన వాళ్లకి ఈ అడవి బాట బాగా తెలుసు. అందుకే, టూరిస్టుల్ని వాటర్ ఫాల్ వరకు తీసుకెళ్లడమే కాకుండా దారి పొడవునా కనిపించే విశేషాల్ని చెబుతారు కూడా. జలపాతంకి చేరుకొనే దారిలో అడ్వెంచర్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే... రాళ్లు రప్పలతో ఉన్న దారిలో దాదాపు నాలుగు కిలోమీటర్లు నడవాలి. తర్వాత ఒక కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలి. ఇంకా రెండు కిలోమీటర్లు నడిస్తే వాటర్ ఫాల్ కనిపిస్తుంది. తోవంతా పచ్చని చెట్లు, పక్షుల అరుపులు వింటూ నడుస్తుంటే అలసటే తెలియదు. ఇదంతా ఒక ఎత్తయితే ధారలా కిందకి పడుతున్న నీళ్లను చూస్తుంటే పాలధారలా పడుతున్నాయా? అనిపిస్తుంది. అందుకే ఈ జలపాతం టూర్కి ఒక్కసారి వెళ్లినా, ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది.
ఇలా వెళ్లాలి
ములుగు నుంచి వెళ్లేవాళ్లు ఏటూరునాగారం నుంచి ముళ్ల కట్ట బ్రిడ్జ్ మీదుగా వెంకటాపురం చేరుకోవాలి. అక్కడి నుంచి పాత్రపురం, తర్వాత ఒక కిలోమీటర్ జర్నీ చేస్తే మంగవాయి గూడెం వస్తుంది. అక్కడి నుంచి అడవి బాటలో కాలినడకన వెళ్లాలి. హైదరాబాద్ నుంచి వెళ్తుంటే కనుక ముందుగా ములుగు వెళ్లాలి. వరంగల్ నుంచి 156 కిలోమీటర్ల దూరం జర్నీ చేయాలి.