యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం ఆండాల్ అమ్మవారికి ఊంజల్‌సేవను ఆలయ అర్చకులు నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ఊంజల్‌సేవను కనుల పండువగా జరిపారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో అమ్మవారిని అందంగా అలంకరించి మన్యుసూక్త పారాయణాల మధ్య ఊంజల్ సేవను నయనానందకరంగా నిర్వహించారు.
అనంతరం అద్దాల మండపంలోని బంగారు ఊయల్లో అమ్మవారిని అధిష్టింపజేసి వివిధ రకాల పాటలతో శయనింపజేశారు. అనంతరం లక్ష్మీసమేత నారసింహుడిని ఆలయ మాడవీధుల్లో విహరింపజేశారు. ప్రధానాలయ వీధుల్లో ఊరేగిన స్వామి అమ్మవార్లను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని తరించారు. మరోవైపు ఆలయంలో నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో మొదలై రాత్రి పవళింపుసేవతో ముగిశాయి. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా శుక్రవారం ఆలయానికి రూ.32,70,834 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు
వెల్లడించారు.