యాదగిరిగుట్టలో ఘనంగా ఊంజల్ సేవ

యాదగిరిగుట్టలో ఘనంగా ఊంజల్ సేవ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆండాళ్ అమ్మవారిని రకరకాల పూలు, వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి.. అద్దాల మండపంలో ఉన్న బంగారు ఊయలలో అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజల్ సేవను చేపట్టారు. 

అనంతరం ప్రత్యేక అలంకారంలో అమ్మవారిని ముస్తాబు చేసి ప్రధానాలయ మాడవీధుల్లో విహరింపజేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఊంజల్ సేవలో పాల్గొని గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని తరించారు. మరోవైపు ఆలయంలో నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో మొదలై రాత్రి పవళింపుసేవతో ముగిశాయి. నిత్య కైంకర్యాల ద్వారా శుక్రవారం ఆలయానికి రూ.19 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.