
- తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పర్యాటకులు
ఉదగమండలం: తమిళనాడులోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన ఊటీ, కొడైకెనాల్ లో ఈ–పాస్విధానాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి షాపుల యజమానులు బుధవారం అన్ని రకాల దుకాణాలను మూసివేశారు. టూరిస్ట్వెహికల్స్ఆపరేటర్లు ఆటోలు, టాక్సీలను నిలిపివేశారు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడి, హోటల్ రూమ్స్, ఆహారం దొరకక పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే అదునుగా కొందరు అధిక ధరలకు ఫుడ్డును విక్రయిస్తున్నారు.
దీంతో పలువురు పర్యాటకులు ప్రభుత్వ నిర్వహణలోని అమ్మ క్యాంటీన్ల వద్దకు పరుగులు తీశారు. మంగళవారం వరకు ఓ గదిని రూ.5 వేలకు ఇచ్చిన ఓ హోటల్ యాజమాన్యం.. బుధవారం రూ.15 వేలు డిమాండ్ చేస్తోందని ఓ పర్యాటకుడు తెలిపారు. వేసవి విడిది ప్రాంతాలైన ఊటీ, కొడైకెనాల్‌కు ఏప్రిల్, మే నెలల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువ ఉంటుంది. రోజుకు సుమారు 30 వేల మంది వస్తారు. దీంతో అక్కడ కాలుష్యం పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో పర్యాటకుల సంఖ్యను నియంత్రించి, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు.. ఊటీ, కొడైకెనాల్ వెళ్లే వాహనాల సంఖ్యను తగ్గించేలా ఈ–-పాస్ విధానం అమలుచేయాలని మద్రాసు హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కోర్టు ఉత్తర్వుల మేరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు 6 వేల వెహికల్స్ ను, వీకెండ్లో 8 వేల వాహనాలను అనుమతిస్తారు.