ఎండలు దంచి కొడుతున్నాయి. జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. నిప్పుల కొలిమిలా వేడిగాలులు వీస్తున్నాయి. ఇంట్లో ఉన్నా ఉక్కపోత తగ్గడం లేదు. చాలా మంది ఈ వేడికి తట్టుకోలేక సమ్మర్లో ఏ ఊటికో, కొడైకనల్ కో పోదామనుకుంటారు. కానీ అసలు విషయమేంటంటే.? ఊటీలో కూడా ఎండలు దంచికొడుతున్నాయి. అక్కడ ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 29న 29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే 5.4 డిగ్రీలు ఎక్కువని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మే 1న కూడా సాధారణ ఉష్ణోగ్రత కంటే 5.1 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యింది. ఇది 1986 ఏప్రిల్ 29 న 28.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యిందని.. మళ్లీ 38 ఏళ్ల తర్వాత 29 డిగ్రీల టెంపరేచర్ నమోదు కావడంతో ఆ రికార్డ్ బద్దలయ్యిందని అధికారులు వెల్లడించారు.
మరో వైపు ఏపీలో ఆదివారం (మే 5వ తేదీ) 30మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 247మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరన శాఖ తెలిపింది. సోమవారం ( మే 6వ తేదీ )15మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 69మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం మొదలుకొని చిత్తరు వరకు 247మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ.