
- కార్పొరేట్‌లోనైతే రూ.వెయ్యికి పైనే
- ఓపీ, సర్జరీ చార్జీలపై లేని నియంత్రణ
- రేట్లు ఫిక్స్ చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు
- ఆదేశించినా చర్యలు శూన్యం
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఓపీ ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఏదైనా నొప్పి, జ్వరం అంటూ సాధారణ చెకప్‌కు వెళ్లినా.. ఆస్పత్రులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి. ఇక ఎమర్జెన్సీ టైమ్‌లో వెళ్తే మరింత ఎక్కువగా ఫీజులు గుంజుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు జిల్లా ల్లోని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ సైతం ఓపీ ధరలను ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతున్నాయి.
హైదరాబాద్‌లో ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్‌లో స్పెషలిస్ట్ ఓపీ కావాలంటే కనీసం రూ.500 కట్టాల్సిందే. అదే కార్పొరేట్ హాస్పిటల్, పేరున్న డాక్టర్అయితే రూ.1,000 నుంచి రూ.1,500 దాకా ఉంటుంది. అది కూడా కేవలం పేషెంట్‌ను నిమిషం, రెండు నిమిషాల్లోపు చూసేసి బ్లడ్ టెస్టులు, ఇతర ట్యాబ్‌లెట్స్ రాసి పంపించేస్తున్నారు.
ఒకవేళ అదే స్పెషలిస్టు డాక్టర్ దగ్గరికు ఎమర్జెన్సీ టైమ్‌లో వెళ్తే ఓపీ పేరుతోనే రూ.2 వేల దాకా వసూలు చేస్తున్నారు. జిల్లాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. గతంలో రూ.300 దాకా ఉండే ఓపీ ధర.. ఇప్పుడు రూ.500 నుంచి రూ.1,000 దాకా పెరిగింది. కరోనా తర్వాత నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఓపీ ధరలను అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారు. సోషల్ మీడియా ఫాలోవర్స్ఉన్న డాక్టర్ అయితే.. అసలు అపాయింట్మెంట్దొరకడమే కష్టమంటూ హైప్ క్రియేట్ చేస్తూ ఇష్టారీతిన డబ్బులు గుంజుతున్నారు.
దృష్టిపెట్టని వైద్యారోగ్య శాఖ..
ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఓపీ ధరలు, సర్జరీల రేట్లపై రాష్ట్ర ప్రభుత్వానికి నియంత్రణ లేదు. కేవలం ఆరోగ్యశ్రీ పరిధిలో రేట్లను ఫిక్స్చేసి.. దానికింద ఎంత అవుతుందో అంత మొత్తం ఆయా హాస్పిటల్స్‌కు నిధులు రిలీజ్ చేస్తున్నది. దీంతో ఓపీ, సర్జరీలకు ఆస్పత్రులు తమకు ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రేట్లు ఫిక్స్ చేయాలని గతేడాది సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అయితే ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లినికల్ ఎష్టాబ్లిష్మెంట్యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అన్ని ప్రైవేట్, కార్పొరేట్హాస్పిటల్స్తీసుకున్న పర్మిషన్లకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? నిబంధనలు పాటిస్తున్నాయా? లేదా? అనే అంశాలపై మానిటరింగ్చేస్తూ వైద్యారోగ్య శాఖ తనిఖీలు చేస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. ఇష్టారీతిన వసూలు చేస్తున్న ఫీజులపైనా ప్రశ్నిస్తే కొంత మేర అయినా తగ్గుతాయని చెబుతున్నారు. అయితే ఆ దిశగా వైద్యారోగ్యశాఖ దృష్టి సారించడం లేదు.
ఫీవర్, దగ్గు ఉందని పోతే రూ.5 వేల బిల్లు
దగ్గు, ఫీవర్ ఉందని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌కు ఒకరు వెళ్లగా.. ఓపీకి వెయ్యి ఫీజుతో పాటు బ్లడ్‌టెస్టులు, పారాసిటామాల్, యాంటీబయాటిక్, ఇతర ట్యాబ్‌లెట్లు, సిరప్‌లకు కలిపి రూ.5 వేలు అయ్యాయి. చెస్ట్ పెయిన్వస్తున్నదని రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌కు ఓ బాధితుడు వెళ్లగా.. ఎమర్జెన్సీలో వైద్యం అందించారు. ఎమర్జెన్సీ ఓపీ, ఈసీజీ, 2డీ ఎకో, ఇతర బ్లడ్ టెస్టులు చేసి.. ఏం లేదని తేల్చారు. రూ.12 వేలు బిల్లు వేసి, అదే రోజు రాత్రి 11.30 గంటలకు డిశ్చార్జ్ చేశారు. ఇలా హైదరాబాద్‌లోనే కాదు.. జిల్లాల్లోనూ జరుగుతున్నది.
దీంతో నెలంతా కష్టపడే పేదలు.. ఒక్కసారి హాస్పిటల్‌కు వెళితే చేసిన కష్టమంతా అటే ఖర్చవుతున్నదని ఆవేదన చెందుతున్నారు. పైగా గతంలో అవుట్ పేషెంట్ (ఓపీ) టోకెన్ కాలపరిమితి 15 రోజుల వరకు ఉండేదని.. ఇప్పుడు నాలుగైదు రోజులకు మళ్లీ వెళ్లినా రెండోసారి ఓపీ ఫీజు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు.
ఒక్క విజిట్‌తో రూ.5 వేల నుంచి 10 వేలు ఖతం..
సాధారణ చెకప్‌ల కోసమని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌కు వెళ్తే ఒక్క విజిట్‌లోనే కనీసం రూ.5 వేలు ఖర్చవుతున్నది. హైదరాబాద్‌లో ఉన్న వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఓపీకి వెళ్లిన 10 మందితో ‘వెలుగు’ మాట్లాడగా.. వారికి ఒక్క విజిట్‌లోనే ఓపీతో కలిపి రూ.5 వేల నుంచి రూ.10 వేలు ఖర్చయినట్టు పేర్కొన్నారు. వీరిలో ఒకరు బాడీ పెయిన్స్‌తో స్పెషలిస్టు డాక్టర్ దగ్గర రూ.వెయ్యికి ఓపీ తీసుకున్నారు. ఆయన ఒక నిమిషం పరీక్షించి.. బ్లడ్ టెస్టులు, ఎంఆర్ఐ, ఈఎంజీ టెస్టులు రాశారు. వీటికే దాదాపు రూ.8 వేలు అయింది. ఇక మెడిసిన్‌కు అదనం.