- నాలుగు రోజుల్లో నలుగురు మృతి
- ములుగు జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అప్పయ్య
మేడారం(తాడ్వాయి, ములుగు), వెలుగు: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చిన భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించామని ములుగు జిల్లా వైద్యాధికారి, జాతర నోడల్ ఆఫీసర్ డాక్టర్ అల్లెం అప్పయ్య తెలిపారు. శనివారం జాతర ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదు రోజుల్లో 1,83,268 మందికి ఓపీ, 5,893 మందికి ఇన్ పేషెంట్ సేవలు అందించినట్లు వెల్లడించారు. భక్తుల కోసం 50 పడకలతో కూడిన వైద్య శిబిరం నిర్వహించినట్లు చెప్పారు.
భక్తులు ఎక్కువగా వాంతులు, విరోచనాలు, స్పృహ కోల్పోవడం, జలుబు, దగ్గు, జ్వరం తదితర సమస్యలతో శిబిరానికి వచ్చారని తెలిపారు. నీట మునిగి ఇద్దరు, గుండెపోటుతో మరో ఇద్దరు చనిపోయారన్నారు. మెరుగైన చికిత్స కోసం 343 మందిని ములుగు జిల్లా ఆస్పత్రి, వరంగల్ఎంజీఎంకు రెఫర్చేసినట్లు తెలిపారు. జాతరలో సేవలు అందించిన డాక్టర్లు, మెడికల్ఆఫీసర్లు, మెడికల్సిబ్బందిని అప్పయ్య అభినందించారు.