- దివ్యాంగులు, మహిళా ఓపీ సెంటర్ల ఆధునీకరణ
- హస్పిటల్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు
- సమస్యలను కలెక్టర్‍కు ఫిర్యాదుకై ఇప్పటికే 20 బాక్సులు
- వరంగల్ ఎంజీఎం అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్ స్పెషల్ ఫోకస్
వరంగల్, వెలుగు: పేదలకు పెద్ద దిక్కు అయిన వరంగల్ ఎంజీఎం హస్పిటల్లో ఓపీ, మందుల తండ్లాటకు చెక్ పడింది. ఓపీ చీటీలు, పేషెంట్లకు ఉచితంగా మందులు అందించే కౌంటర్లను పెంచారు. ఓరుగల్లు కేంద్రంగా ఉన్న పెద్దాసుపత్రిలో ఏండ్ల తరబడిగా పేరుకుపోయిన సమస్యలు, పేషెంట్లు వారి వెంట సాయానికి వచ్చే బంధువులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. గడిచిన ఏడెనిమిది నెలలుగా పలు మార్పులకు శ్రీకారం చుట్టింది.
కొత్తగా 2 ఓపీ చీటీ, 4 ఫార్మసీ కౌంటర్ల పెంపు
వరంగల్ ఎంజీఎంలో ట్రీట్‍మెంట్ కోసం నిత్యం 2 వేలకు మందికిపైగా వస్తున్నారు. సోమవారం దీని సంఖ్య దాదాపు 3 వేలకు చేరుతోంది. ఈ క్రమంలో డాక్టర్లు అందించే ట్రీట్‍మెంట్ మాటేమోగానీ.. వారికి చూపించుకోవడానికి అవసరమయ్యే ఓపీ చీటీ సంపాదించడం పేషెంట్లు వారి బంధువులకు గగనమైతోంది. దీంతో 9 గంటలకు మొదలయ్యే.. ఓపీ కోసం తెల్లవారుజామునే వచ్చి క్యూలో నిల్చుంటున్నారు. ఏండ్ల తరబడిగా ఈ సమస్య ఉంది.
ఈ క్రమంలో మూడు నెలల క్రితం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి, కొండా సురేఖ ఎంజీఎం పరిశీలనకు వచ్చిన సమయంలో సమస్యను గమనించారు. చీటీలు ఇచ్చే కౌంటర్లు పెంచాలని అధికారులను ఆదేశించారు. మొత్తంగా నిన్నమొన్నటి వరకు 4 ఉన్న ఓపీ కౌంటర్ల సంఖ్య 6కు పెంచారు. అలాగే పేషెంట్లకు డాక్టర్లు మందులు రాసే క్రమంలో సరిపడ కౌంటర్లు లేక వాటిని తీసుకోవడానికి చాలా సమయం వృథా అవుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేలా ఫార్మసీ కౌంటర్ల సంఖ్యను 6 నుంచి 10 వరకు పెంచారు. గతంలో కూర్చోవడానికి కుర్చీలు, కావాల్సిన సదుపాయాలు లేక.. దివ్యాంగుల, మహిళలు ఇబ్బందులు పడేవారు. ఓపీ సెంటర్లను ఆధునీకరించడంతో రోగుల కష్టాలు తీరాయి.
ఎంజీఎంపై.. కలెక్టర్ ఫోకస్
మూడు నెలల క్రితం మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ హస్పిటల్ పర్యటన సందర్భంగా ఎంజీఎం సమస్యలపై కలెక్టర్ రెగ్యులర్ పర్యవేక్షణ ఉండాలని సూచించారు. నాటినుంచి వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద దాదాపుగా వారంలో రెండుమూడు రోజులు ఎంజీఎం సమస్యలు, డాక్టర్ల విధులు, సౌకర్యాలపై ఫాలోఅప్ చేస్తున్నారు.
ఎంజీఎం వచ్చే పేషెంట్లు, వెంటవచ్చే వారి బంధువులు హస్పిటల్లో నెలకొన్ని సమస్యలు, ఇబ్బందులు డైరెక్టుగా తనకు తెలిపేలా సత్యశారద ఇప్పటికే 20 ఫిర్యాదు బాక్సులను హస్పిటల్ మెయిన్ సెంటర్లలో ఏర్పాటు చేసి..అందులోని ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. దీనికితోడు ఏరోజు ఏ డాక్టర్ అందుబాటులో ఉంటున్నాడో తెలిపేలా డాక్టర్ల వివరాలు పొందుపరుస్తున్నారు. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపడాన్నిమంత్రి కొండా సురేఖ సైతం పలుమార్లు ప్రస్తావించారు.
క్యాంటీన్‍తో..అటు ఉపాధి, ఇటు క్వాలిటీ ఫుడ్
రాష్ట్ర ప్రభుత్వం మహిళల స్వయం ఉపాధి కోసం మహిళ ఇందిరా శక్తి పథకంలో భాగంగా ఎంజీఎం ఆవరణలో క్యాంటీన్ ఏర్పాటు చేశారు. బృందంగా ఏర్పడిన మహిళలకు ప్రభుత్వమే బ్యాంకు లోన్ ఇప్పించడం ద్వారా ఎంజీఎంలో మహిళ ఇందిరా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించి స్వయం ఉపాధి పొందేలా చూశారు.హస్పిటల్ పనుల కోసం వచ్చే వేలాది మందికి ఆసుపత్రి ఆవరణలోనే బయటికంటే తక్కువ ధరల్లో ఆహారం, పిండి వంటలు, టిఫిన్, పచ్చళ్లు, చాయ్, కాఫీ అందుబాటులోకి తీసుకువచ్చారు.