- మూడేంద్ల కిందే తవ్వకాలకు ఏర్పాట్లు చేసిన సింగరేణి
- రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో వ్యతిరేకించిన స్థానికులు
- సర్వే రిపోర్ట్స్ చూపుతూ మరోసారి గని ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న సింగరేణి
జయశంకర్ భూపాలపల్లి/భద్రాద్రి కొత్తగూడెం/వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్‌కు సింగరేణి రూపంలో ముప్పు వెంటాడుతోంది. ఈ ఆలయానికి 6 కిలోమీటర్ల దూరంలోనే ఓపెన్ కాస్ట్ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ చర్యలు చేపడుతోంది. ఓపెన్ కాస్ట్ వల్ల ఆలయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎన్‌జీఆర్‌ఐ ఇచ్చిన రిపోర్ట్‌ను చూపుతూ గని ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో సింగరేణికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు రామప్ప దేవాలయ పరిరక్షణ కమిటీ సభ్యులు సిద్ధమవుతున్నారు.
రామప్పకు 6 కిలోమీటర్ల దూరంలోనే బొగ్గు
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామంలో రామప్ప ఆలయం ఉంది. ఇక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో వెంకటాపూర్ గ్రామ శివారులో 40.43 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు సింగరేణి సంస్థ గుర్తించింది. అన్ని రకాల సర్వేలు జరిపి 19 ఏండ్ల పాటు బొగ్గు తవ్వకాలు జరపాలని పర్మిషన్లు తీసుకుంది. 314 హెక్టార్ల అటవీ భూములు, 1,480 హెక్టార్ల వ్యవసాయ, ప్రభుత్వ అసైన్డ్ భూములను సేకరించాలని రిపోర్ట్ తయారు చేసింది.
గతంలోనే కొంత భూమిని సేకరించి హద్దులు కూడా నిర్ణయించారు. రైతులకు పరిహారం అందించి, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తింపచేసి 2021 డిసెంబర్‌లోనే తవ్వకాలు ప్రారంభించాలని మొదట భావించారు. అయితే రామప్ప దేవాలయానికి 2021 జూలై 25 యునెస్కో గుర్తింపు వచ్చింది. విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో సింగరేణి ఆఫీసర్లు సర్వే పనులు ఆపేసి రైతులతో మీటింగ్‌లకు రద్దు చేసుకోవడమే కాకుండా నష్టపరిహారం డబ్బులు కూడా రిలీజ్ చేయలేదు.
ఓపెన్ కాస్ట్‌కు అనుకూలంగా సర్వే రిపోర్ట్స్
వెంకటాపూర్‌లో ఓపెన్ కాస్ట్ ఏర్పాటు చేయకుండా అభ్యంతరాలు రావడంతో సింగరేణి మూడేండ్లుగా వివిధ సంస్థలతో సర్వే చేయించింది. ఇక్కడ ఓపెన్ కాస్ట్ ఏర్పాటు చేసి బాంబ్ బ్లాస్టింగ్‌లు జరిపినా రామప్ప టెంపుల్‌తో పాటు చెరువుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఐఐటీ మద్రాస్, ఎన్‌జీఆర్‌ఐ సర్వే బృందాలు చెప్పినట్లు సింగరేణి ఆఫీసర్లు చెబుతున్నారు.
ప్రతి కిలోమీటర్‌కు ఒక స్టేషన్ ఏర్పాటు చేసి టెస్ట్‌లు చేశామని, ఐదు కిలోమీటర్ల వరకు ఎటువంటి తీవ్రత లేదని, సైంటిఫిక్ రీసెర్చ్ వైబ్రేషన్స్ జీరోగా వచ్చాయని అంటున్నారు. ఎన్‌ఐఐటీ సూరత్, ఐఐటీ మద్రాస్ ఇప్పటివరకు నాలుగు రకాల సైంటిఫిక్ స్టడీస్ చేసి బ్లాస్టింగ్ ఎఫెక్ట్ లేదని తేల్చిందన్నారు. ఎయిర్ పొల్యూషన్‌పై నాగ్‌పూర్‌కు చెందిన నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ బృందం ఇటీవల రీసెర్చ్ చేసిందన్నారు.
రామప్ప టెంపుల్ 3.3 హెడ్జ్ ఫ్రీక్వెన్సీని తట్టుకుంటుందని, సింగరేణి ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ తీవ్రత ఓసీ నుంచి ఐదు కిలోమీటర్ల వరకు 0.01హెడ్జ్‌గానే ఉన్నట్లు రీసెర్చ్‌లో తేలిందన్నారు. ప్రస్తుతం భూపాలపల్లి ఏరియాలో నడుస్తున్న కేటీకే ఓసీ –3కి ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఘనపురం చెరువు, ఐదు కిలోమీటర్ల దూరంలో కోటగుళ్లు ఉన్నాయని, మూడేండ్లుగా ఓసీ నడుస్తున్నా ఎలాంటి కంప్లైంట్స్ లేవని సింగరేణి ఆఫీసర్లు చెబుతున్నారు.
ఈ నెల 19న నిరసన ర్యాలీ
రామప్ప టెంపుల్‌కు ముప్పుగా మారుతున్న సింగరేణి ఓపెన్‌కాస్ట్‌కు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నా ఆ సంస్థ మాత్రం తన ప్రయత్నాలు ఆపడం లేదని రామప్ప ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు మండిపడుతున్నారు. తమ ఆందోళనను పట్టించుకోకుండా సర్వేలు చేయిస్తూ, రిపోర్టులు రెడీ చేసుకుంటోందన్నారు. ఓపెన్ కాస్ట్ ఏర్పాటు కారణంగా ఏర్పడే సమస్యలపై గతేడాది డిసెంబర్ 19న ములుగు కలెక్టరేట్‌లో మీటింగ్ జరిగింది.
ఈ సమావేశానికి అటు సింగరేణి ఆఫీసర్లు, ఇటు ఫిర్యాదుదారులు హాజరై సమస్యలపై చర్చించారు. మరో వైపు ఓపెన్ కాస్ట్‌కు వ్యతిరేకంగా రామప్ప చుట్టుపక్కల ఉన్న ఆరు గ్రామాల ప్రజలతో కలిసి ఈ నెల 19న నిరసన ర్యాలీ చేపడుతున్నామని రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్ అక్కిరెడ్డి రామ్మోహన్‌రావు ప్రకటించారు. వెంకటాపూర్ వద్ద ఓపెన్ కాస్ట్ ఏర్పాటు చేస్తే రామప్ప టెంపుల్‌కు, చెరువుకు ప్రమాదం ఉంటుందన్నారు. పబ్లిక్ హియరింగ్ సమయంలో ఓపెన్ కాస్ట్‌కు వ్యతిరేకంగా మాట్లాడేలా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.