మెడికల్ పీజీ, యూజీ సీట్లలో ఓపెన్ కోటా లొల్లి

అడ్మిషన్ల రూల్స్ మార్చిన ఏపీ ప్రభుత్వం
2014కు ముందు కొత్త సీట్లకు ఓపెన్ కోటా ఎత్తివేత
తెలంగాణ స్టూడెంట్ల​పై ఆంక్షలు
మన స్టేట్‌‌‌‌లోనూ మార్చాలంటూ మెడికోల డిమాండ్

హైదరాబాద్, వెలుగు: మెడికల్ పీజీ, యూజీ సీట్లలో ఏపీ, తెలంగాణకు ఉన్న 15 శాతం ఓపెన్ కోటాపై వివాదం కొనసాగుతున్నది. 2014 తర్వాత ఏర్పడిన కొత్త కాలేజీల్లో ఓపెన్ కోటాను తెలంగాణ ప్రభుత్వం ఎత్తేసింది. పూర్తిగా తెలంగాణ సొమ్ముతో ఏర్పాటు చేసిన కాలేజీలకు రాష్ట్ర విభజన రూల్స్ వర్తించవు. అందుకే ఈ కాలేజీల్లో ఓపెన్ కోటాను ఎత్తేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014కు ముందు ఉన్న కాలేజీల్లో ఓపెన్ కోటాను అలాగే కొనసాగిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌‌‌‌ ప్రభుత్వం కూడా రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన కాలేజీల్లో ఓపెన్ కోటాను ఎత్తేసింది. ఇక్కడితో ఆగకుండా 2014కు ముందు ఏర్పడిన కాలేజీల్లో కొత్తగా యాడ్ అయిన సీట్లకు కూడా ఓపెన్ కోటా వర్తించకుండా రూల్స్ తీసుకొచ్చింది. దీంతో తాము తీవ్రంగా నష్టపోతామని పీజీ, యూజీ సీట్ల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ స్టూడెంట్స్, మెడికోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ఉస్మానియా, గాంధీ, నిజామాబాద్, మహబూబ్‌‌‌‌నగర్ మెడికల్ కాలేజీల్లో, ఆదిలాబాద్‌‌‌‌ రిమ్స్‌‌‌‌లో ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్ల సంఖ్య దాదాపు 35 శాతం పెరిగింది. ఈ సీట్లలోకి ఏపీ స్టూడెంట్స్‌‌‌‌ను రానీయకుండా.. ఏపీ తరహాలోనే రూల్స్‌‌‌‌లో మార్పులు చేయాలని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల అయినప్పటికీ, ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించలేదు. దీంతో మెడికోలు, స్టూడెంట్స్‌‌‌‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ:ములుగు జిల్లా.. వెంకటాపూర్​లో 69.4 సెంటీమీటర్ల వర్షపాతం 

సెప్టెంబర్ డెడ్‌‌‌‌లైన్
ఎంబీబీఎస్ అకడమిక్ ఇయర్‌‌‌‌‌‌‌‌ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ప్రారంభం అవుతుందని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌‌‌‌ఎంసీ)గురువారం ప్రకటించింది. ఈనెల 25 నుంచి ఎంబీబీఎస్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌‌‌‌ ప్రారంభించాలని, సెప్టెంబర్ 27 లోపల అన్ని రౌండ్ల కౌన్సిలింగ్‌‌‌‌ పూర్తి చేయాలని రాష్ట్రాలకు సూచించింది. కాలేజీల్లో జాయిన్ అయ్యేందుకు సెప్టెంబర్ 30 చివరి తేదీగా నిర్ణయించింది. మన రాష్ట్రంలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సుమారు 22,167 మంది కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా, సర్టిఫికెట్స్ వెరిఫై చేసి మెరిట్ లిస్టును కూడా యూనివర్సిటీ విడుదల చేసింది. మెడికల్ పీజీ సీట్ల కౌన్సిలింగ్ కూడా ప్రారంభమైంది. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అకడమిక్ ఇయర్ ప్రారంభం అవుతుందని, అక్టోబర్ పదో తేదీ నాటికి అడ్మిషన్లు పూర్తి చేయాలని ఎన్‌‌‌‌ఎంసీ హెల్త్ వర్సిటీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా రూల్స్ మార్చి తెలంగాణ స్టూడెంట్స్ నష్టపోకుండా చూడాలని మెడికోలు కోరుతున్నారు.