చర్మ కణాలను యంగ్ స్టెమ్ సెల్స్‌గా మార్చేందుకు పరిశోధనలు
ప్రొటీన్ల రీఇంజనీరింగ్‌కు ప్రత్యేక టూల్ రూపొందించిన ఓపెన్ ఏఐ
సక్సెస్ అయితే.. మనుషుల జీవితకాలాన్ని పదేండ్లు పెంచేందుకు చాన్స్
హైదరాబాద్, వెలుగు: మనుషుల మాదిరిగానే ఆలోచిస్తూ, ఎన్నో పనులు చేసి పెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు సైన్స్ పరిశోధనలకు కూడా సాయం చేస్తోంది. ఏజ్‌ను తగ్గించి, మనుషుల జీవితకాలాన్ని పెంచే పరిశోధనల్లో ఎలా సక్సెస్ అవ్వాలన్న విషయంలో సైంటిస్టులకు కొత్త మార్గాలను చూపుతోంది. ప్రొటీన్లను రీ ఇంజనీరింగ్ చేయడం ద్వారా చర్మ కణాలను యంగ్ స్టెమ్ సెల్స్‌గా మార్చి.. కొత్త టిష్యూ, అవయవాలను ఉత్పత్తి చేసేందుకు జరుగుతున్న రీసెర్చ్‌లో ఇప్పుడు ‘జీపీటీ 4బీ మైక్రో’ అనే ఏఐ టూల్ కీలకంగా మారింది. చాట్ జీపీటీతో సంచలనం సృష్టించిన ఓపెన్ ఏఐ సంస్థ ఈ కొత్త ఏఐ టూల్‌ను తయారు చేసింది. మనుషుల జీవితకాలాన్ని కనీసం పదేండ్లు పెంచేందుకు ప్రయత్నిస్తున్న రెట్రో బయోసైన్సెస్ సంస్థ ఈ జీపీటీ 4బీ మైక్రో టూల్‌ను ఉపయోగించి ప్రొటీన్ల రీఇంజనీరింగ్ పరిశోధనల్లో కీలక ముందడుగు వేసింది.
టెక్నాలజీలో సరికొత్త మార్పులను తెచ్చి మనుషులు చేసే పనులనూ వేగంగా చేసేందుకు ఏఐ ఉపయోగపడుతున్నది. ఇప్పుడు సైన్స్ రంగంలోనూ ఏఐని ఉపయోగించేలా ‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(ఏజీఐ)’ అనే కాన్సెప్ట్‌కు ఓపెన్ ఏఐ శ్రీకారం చుట్టింది. దీనిద్వారా సైన్స్ కు సంబంధించి మనుషులు కనిపెట్టలేని కొత్త అంశాలను సైతం వెలికితీయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఏడాది క్రితం మనిషి జీవితకాలాన్ని పెంచే పరిశోధనలు చేస్తున్న అమెరికాకు చెందిన రెట్రో బయోసైన్సెస్ అనే సంస్థతో చాట్‌జీపీటీ చేతులు కలిపింది. సుమారు రూ.1,560 కోట్లు (18 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేసింది. వాస్తవానికి మనిషి జీవితకాలాన్ని కనీసం మరో పదేండ్లు పెంచేలా రెట్రో బయోసైన్సెస్ ఎప్పటినుంచో ప్రయోగాలు చేస్తున్నది. స్టడీలో భాగంగా ‘యమనక ఫ్యాక్టర్స్’ అనే ప్రొటీన్ సెట్లను మనిషి చర్మ కణాలకు అటాచ్ చేయడం ద్వారా.. వాటిని మూలకణాలుగా మార్చి ఒంట్లోని ఏ టిష్యూనైనా సృష్టించే పరిశోధనలను ప్రారంభించింది. అయితే, ల్యాబ్‌లో ఆ ప్రయోగాలు చేయడానికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంటుందని, సైంటిస్టులు చెబుతున్నారు.
మరింత మెరుగుపరుస్తూ..
రెట్రో సంస్థ పరిశోధనలను మరింత సమర్థవంతంగా చేసేందుకు ఓపెన్ఏఐ ‘జీపీటీ 4బీ మైక్రో’ అనే ఏఐ టూల్‌ను రూపొందించింది. యమనక ఫ్యాక్టర్స్ సహా వివిధ ప్రొటీన్ ఫ్యాక్టర్లు మరింత మెరుగ్గా పనిచేసేందుకున్న మార్గాలను అన్వేషించేందుకు జీపీటీ 4బీ మైక్రోను ట్రైన్ చేశారు. అందులో భాగంగా రెండు యమనక ఫ్యాక్టర్ల సామర్థ్యాన్ని 50 రెట్లు పెంచారు. మిగతా ప్రొటీన్ ఫ్యాక్టర్లతో పోలిస్తే యమనక ఫ్యాక్టర్లు ప్రత్యేకంగా ఒక రూపు అంటూ లేని ప్రొటీన్ స్ట్రక్చర్లని సైంటిస్టులు చెబుతున్నారు. అందుకే యమనక ఫ్యాక్టర్లను జీపీటీ 4బీ మైక్రో ఏఐ టూల్ ద్వారా రీఇంజనీరింగ్ చేసేందుకు పరిశోధనలు ప్రారంభించారు. ఆ ప్రొటీన్లలోని ప్రతి మూడో అమైనో యాసిడ్‌ను మార్చి యమనక ఫ్యాక్టర్స్ సమర్థవంతంగా పనిచేయగలిగేలా చేశారు. మూలకణాలను తయారు చేసేందుకు జీపీటీ 4బీ మైక్రో ఏఐ టూల్ బాగా ఉపయోగపడుతుందని ఈ పరిశోధనలో భాగమైన హార్వర్డ్ వర్సిటీ రీసెర్చర్లు చెబుతున్నారు. దీని ద్వారా చర్మ కణాలను చాలా సులువుగా రీప్రోగ్రామ్ చేసేందుకు చాన్స్ ఏర్పడుతున్నదన్నారు. అయితే, ఈ టూల్ కేవలం చర్మ కణాలకు మాత్రమే సూట్ అవుతున్నదని, మిగతా కణాలనూ మూల కణాలుగా మార్చే టూల్‌ను డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
భారీ ప్రయోగాలకు సిద్ధం
ప్రస్తుతం ఓపెన్ఏఐ, రెట్రో సంస్థలు చేస్తున్న ఈ పరిశోధనలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. దీనిపై ఇంకా భారీ స్థాయిలో పరిశోధనలు, ప్రయోగాలు చేస్తామంటున్నారు. అందులో భాగంగానే రెట్రోకు ఓపెన్ ఏఐ సంస్థ భారీగా నిధులను సమకూరుస్తున్నదని చెబుతున్నారు. ఏజీఐని మరింతగా డెవలప్ చేసి పరిశోధనలను సాగించేందుకు కసరత్తు చేస్తున్నదని అంటున్నారు. పనిలోపనిగా ఓపెన్ ఏఐ సంస్థ.. ఇతర టెక్నాలజీ రంగాల్లోనూ రూ. వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు ఏఐ నిపుణులు చెబుతున్నారు.
గూగుల్ కూడా రంగంలోకి..
యాంటీ ఏజింగ్ పరిశోధనలపై గూగుల్ కంపెనీ కూడా ఇదివరకే రంగంలోకి దిగింది. ప్రొటీన్ నిర్మాణాలను నిమిషాల్లోనే గుర్తించి వాటిని రీ ఇంజనీరింగ్ చేసే ఆల్ఫాఫోల్డ్ అనే ఏఐ టూల్‌ను నాలుగేండ్ల కిందటే సృష్టించింది. ఒక్కో ప్రొటీన్ ఎలా పనిచేస్తుంది? ప్రొటీన్లు ఇతర కణాలతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయన్న విషయాన్ని ఈ ఆల్ఫాఫోల్డ్ గుర్తిస్తున్నది. ఇప్పటిదాకా దాదాపు 20 కోట్ల ప్రొటీన్ స్ట్రక్చర్లను ఆల్ఫాఫోల్డ్ టూల్ గుర్తించగా..
ఆ సమాచారాన్ని ప్రత్యేక డేటాబేస్‌లో గూగుల్ భద్రపరిచింది.