శివ్వంపేట, వెలుగు: మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం గురువారం వివాదాస్పదమైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే సునీతా రెడ్డి రాకముందే, కాంగ్రెస్ కు చెందిన సహకార సంఘం చైర్మన్ వెంకటరామ్ రెడ్డి ఎలా ప్రారంభిస్తారని, కాంగ్రెస్ నాయకులు ప్రొటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ కు చెందిన సహకార సంఘం డైరెక్టర్ యాదగౌడ్ రిబ్బన్ కట్ చేయగా, కాంగ్రెస్ సహకార సంఘం చైర్మన్ వెంకటరామిరెడ్డి కొబ్బరికాయ కొట్టారు.దీనిపై కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రైతుల వడ్లు కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తున్నారని, ఇప్పటికే ఆలస్యమైందని, కొనుగోలు కేంద్రం వద్ద ప్రొటోకాల్ అవసరమా అన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి. కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు యాద గౌడ్, నరసింహారెడ్డి, భిక్షపతి రెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు.