
న్యూఢిల్లీ: భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్కు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన మొదటి దేశంగా ఇండియా నిలిచింది. ‘ఆపరేషన్ బ్రహ్మ’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి శనివారం 15 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ130జే సైనిక విమానం మయన్మార్‌లోని యాంగూన్ సిటీకి చేరుకుంది.
సహాయ సామాగ్రిలో టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, దుప్పట్లు, రెడీ టూ ఈట్ ఫుడ్, వాటర్ రిఫైయర్లు, సోలార్ ల్యాంప్స్, జనరేటర్ సెట్లు, అవసరమైన మెడిసిన్ పంపినట్టు అధికారులు తెలిపారు. సహాయ సామగ్రితో మరో రెండు విమానాలు త్వరలో హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరుతాయని వివరించారు. అలాగే అరవై పారా-ఫీల్డ్ అంబులెన్స్‌లు కూడా మయన్మార్ కు విమానాల్లో పంపుతున్నట్లు చెప్పారు.
నేపిడాకు రెస్క్యూ టీమ్స్
ఆపరేషన్‘బ్రహ్మ’లో భాగంగా ఇండియా నుంచి మొదటి విడత మనవతా సహాయంతో కూడిన ఫ్లైట్ మయన్మార్ లోని యాంగూన్ విమానాశ్రయానికి చేరుకుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆ దేశంలోని భారత రాయబారి అభయ్ ఠాకూర్ యాంగూన్ ముఖ్యమంత్రి యు సో థీన్ కు సాయం అందజేశారు.
అలాగే ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ సాత్పురా, ఐఎన్ఎస్ సావిత్రి నౌకలు 40 టన్నుల మానవతా సహాయంతో మయన్మార్కు బయలుదేరాయని పేర్కొన్నారు. మరోవైపు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన 80 మందితో కూడిన సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ మయన్మార్ రాజధాని నేపిడాకు బయలుదేరిందని తెలిపారు.
మయన్మార్ ప్రజలకు సాయం చేయడానికి ఇండియా ఫస్ట్ రెస్పాండర్‌గా వ్యవహరించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. భారత ప్రభుత్వం తర్వాత చైనా, రష్యా, మలేసియా, దక్షిణ కొరియా, అమెరికా స్పందించాయి. రెస్క్యూ టీమ్‌లను, వైద్యులను, సహాయక సామగ్రిని పంపిస్తున్నట్లు తెలిపాయి. సహాయక చర్యలను ప్రారంభించడానికి ఐక్యరాజ్యసమితి 5 మిలియన్ డాలర్లను కేటాయించింది.