- మల్కాపూర్‌లో ఆపరేషన్ థియేటర్
- వెటర్నరీ డాక్టర్ సహా10 మందితో ప్రత్యేక బృందం
గోదావరిఖని, వెలుగు : వీధికుక్కల సంతానోత్పత్తి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు సూచనల మేరకు వీధికుక్కలకు బర్త్ కంట్రోల్ చేయడంతోపాటు యాంటీ రేబిస్ టీకాలు వేయాలని నిర్ణయించింది. గోదావరిఖని మల్కాపూర్‌లో గల స్లాటర్ హౌస్‌లో ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్ఏర్పాటు చేసింది. ముందుగా రామగుండం కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించిన తర్వాత జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్నారు.
ఈ సెంటర్ నిర్వహణ బాధ్యతను హైదరాబాద్‌లోని యానిమల్వెల్ఫేర్ సొసైటీకి అప్పగించింది. వీరి ఆధ్వర్యంలో 10 మందితో కూడిన బృందం ప్రతిరోజు కుక్కలను పట్టుకుని తీసుకొచ్చి బోన్లలో పెడుతున్నారు. ఈ బృందంలో ఒక వెటర్నరీ డాక్టర్, ఇద్దరు అసిస్టెంట్లు, మిగిలిన ఏడుగురు ప్రత్యేక సిబ్బంది ఉన్నారు. కుక్కను తీసుకొచ్చి ఆపరేషన్ చేసి తిరిగి పట్టుకొచ్చిన చోటనే వదిలిపెట్టినందుకు ఒక్కో కుక్కకు రూ.1,650 చొప్పున బిల్లు చెల్లించడానికి రామగుండం కార్పొరేషన్ ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
జిల్లాలో 30 వేలకుపైగా కుక్కల గుర్తింపు
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 వేలకు పైగా వీధి కుక్కలు ఉన్నట్టు ఆఫీసర్లు గుర్తించారు. ముందుగా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలోని కుక్కలను పట్టుకొని బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు నిర్వహిస్తారు. మల్కాపూర్‌లోని స్లాటర్ హౌస్‌లో ఏర్పాటు చేసిన థియేటర్‌లో 50 కుక్కలను ఉంచేందుకు అవసరమైన బోన్లను సిద్ధం చేశారు. ఆపరేషన్ చేసిన కుక్క చెవుకు ‘వి’ ఆకారంలో కత్తిరించి మూడు రోజుల పాటు వాటి ఆరోగ్యాన్ని పరీక్షించి, ఆ తర్వాత వాటిని పట్టుకొచ్చిన ప్రాంతంలో వదిలిపెడుతున్నారు. ఒకవేళ కుక్క ఆరోగ్యం బాగా లేకపోతే అవసరమైన టీకాలు ఇచ్చి అది కోలుకునేవరకు పర్యవేక్షిస్తున్నారు.
త్వరలో సుల్తానాబాద్‌లో ఏర్పాటు...
ఆయా ఏరియాల్లో కుక్కలకు బర్త్ కంట్రోల్ చేసేందుకు వీలుగా ఎక్కడికక్కడ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) టీమ్ చేసిన సూచన మేరకు త్వరలో సుల్తానాబాద్‌లో కూడా కుక్కల సంతానోత్పత్తి నియంత్రణ కోసం ఆపరేషన్ థియేటర్ ఏర్పాటుకు అప్రూవల్ లభించింది. అలాగే మంథని, పెద్దపల్లి ఏరియాల్లో కూడా ఈ ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.