‘ఆపరేషన్ కగార్’ కు బలైతున్న మహిళా మావోయిస్టులు !

‘ఆపరేషన్ కగార్’ కు బలైతున్న మహిళా మావోయిస్టులు !
  • ఏడాది కాలంలో వంద మందికి పైగా మహిళలు మృతి
  • పదేండ్ల కింద సల్వాజుడుం అకృత్యాలతో పార్టీలో చేరిన ఆదివాసీ మహిళలు
  • మావోయిస్టుల ఏరివేతకు లొంగిపోయిన మహిళా నక్సల్స్‌‌ సేవలు
  • దంతేశ్వరి ఫైటర్స్‌‌, బస్తర్‌‌ ఫైటర్స్‌‌ పేరుతో మహిళా కమాండోల నియామకం
  • ఎన్‌‌కౌంటర్లలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మహిళా జవాన్లు

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లో మావోయిస్టుల నిర్మూలన కోసం ‘ఆపరేషన్​కగార్’​ పేరిట  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న యుద్ధంలో పెద్దసంఖ్యలో మహిళా మావోయిస్టులు కన్నుమూస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టులను తుదముట్టిస్తామన్న  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌‌షా ఆదేశాల మేరకు దండకారణ్యంలో భారీ ఎత్తున దిగిన బలగాలు వరుస ఎన్​కౌంటర్లతో విరుచుకుపడ్తున్నాయి.

ఈ క్రమంలో ఆపరేషన్​ కగార్​ ప్రారంభమైన 2024 జనవరి నుంచి ఇప్పటివరకు 303 మంది మావోయిస్టులు చనిపోగా, వీరిలో ఏకంగా 102 మంది మహిళలున్నారు.  మరోవైపు మావోయిస్టుల ఏరివేతకు సైతం లొంగిపోయిన మహిళా నక్సల్స్‌‌ను వాడుకుంటున్నారు. దంతేశ్వరి ఫైటర్స్‌‌, బస్తర్‌‌ ఫైటర్స్‌‌ పేరుతో పెద్దసంఖ్యలో నియమించుకున్న మహిళా కమాండోలు ప్రస్తుత ఎన్‌‌కౌంటర్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు.  ‘మహిళలు లేని విప్లవం గెలవబోదు’ 

అనే నినాదంతో...

‘మహిళలు లేని విప్లవం గెలవబోదు’ అనే నినాదంతో కొన్నేండ్లుగా మావోయిస్టు పార్టీలో మహిళలను భారీగా రిక్రూట్‌‌ చేసుకుంటున్నారు. దీనికి తోడు 2005లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పడిన సల్వాజుడుంతో పాటు మిజోరాం ఫోర్స్, సీఆర్‌‌పీఎఫ్‌‌ జవాన్లు ఆదివాసీ గ్రామాలపై, మహిళలపై దాడులు చేయడంతో బాధిత మహిళలు పెద్దసంఖ్యలో ఉద్యమం వైపు వెళ్లారు. బలగాలు గతంలో బేస్‌‌ క్యాంప్‌‌ల వద్ద శిబిరాలను ఏర్పాటు చేసి ఆదివాసీలను నిర్బంధించారు.

క్యాంపుల్లో ఆదివాసీ మహిళలపై రేప్‌‌లు సైతం జరిగాయని2006 జనవరి 11న డాక్టర్‌‌ ఇలీనా, అడ్వకేట్‌‌ సుధా భరద్వాజ్‌‌, జర్నలిస్ట్‌‌ వనజతో పాటు రించిన్, సోమా ముఖర్జీ, దేవేంద్ర, శ్రీదేవి, షర్మిలా శంకర్‌‌లతో కూడిన ఓ కమిటీ రిపోర్ట్‌‌ కూడా అందజేసింది. ఈ నివేదిక  ప్రకారం భద్రతా బలగాలు ఆదివాసీ మహిళలను నిర్బంధించడంతోపాటు వారిపై లైంగికవేధింపులకు, అత్యాచారాలకు పాల్పడేవారు. ఏకంగా12 మంది బాలికలు గర్భం దాల్చారు. కొంత మందిని మాయం చేశారు. సల్వాజుడుం మనుగడలో ఉన్న కాలంలో 34 మంది మహిళలపై అత్యాచారం జరిగినట్లు ఆల్‌‌ ఇండియా ఉమెన్స్‌‌ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌‌లోనూ వెల్లడైంది.

ఈ ఆకృత్యాల నేపథ్యంలో పెద్దసంఖ్యలో ఆదివాసీ మహిళలు మావోయిస్టుల్లో చేరారు. దండకారణ్యంలో సుమారు 2,500 మంది సాయుధ మావోయిస్టులు ఉంటే ఇందులో వెయ్యి మందికిపైగా మహిళా మావోయిస్టులే అని సమాచారం. ప్రస్తుతం ‘క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘటన్‌‌’ పేరుతో బస్తర్‌‌ ప్రాంతంలో విస్తరించిన మహిళా మావోయిస్టులు పార్టీకి ముందు భాగంలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్‌‌కౌంటర్లలో పెద్దసంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.

మహిళా మావోయిస్టులకు 2020 వరకు నిత్యం కోడిగుడ్డు, పల్లీ పట్టీతోపాటు ఇతర పౌష్టికాహారం అందించేవారు. కానీ తర్వాత మావోయిస్ట్‌‌ పార్టీలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడడంతో మహిళా మావోయిస్టుల పోషకాహారంపై దృష్టి పెట్టడం లేదు. దీంతో ఎన్‌‌కౌంటర్ల సమయంలో వీరు బలగాలకు ఈజీగా దొరకడం, తుపాకీ తూటాలకు బలికావడం జరుగుతోందని 
ఎక్స్​పర్ట్స్​చెప్తున్నారు.

ఆపరేషన్‌‌ కగార్‌‌లో 102 మంది మహిళా మావోయిస్టులు మృతి

ఆపరేషన్‌‌ కగార్‌‌ మొదలయ్యాక 2024లో 217 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో 80 మంది మహిళ మావోయిస్టులే ఉన్నారు. 2025లో ఇప్పటి వరకు జరిగిన ఎన్‌‌కౌంటర్లలో 86 మంది మావోయిస్టులు చనిపోగా, ఇందులో 22 మంది వరకు మహిళలు ఉన్నారు.

మొత్తం మీద 102 మంది మహిళా మావోయిస్టులు నేలకొరిగారు. ఈ నెల 9న బీజాపూర్‌‌ జిల్లా నేషనల్‌‌ పార్క్‌‌ ఏరియాలో జరిగిన భారీ ఎన్‌‌కౌంటర్లలో 31 మంది మావోయిస్టులు చనిపోగా ఇందులో 11 మంది మహిళా నక్సల్స్‌‌ ఉన్నారు. ఈ ఎన్‌‌కౌంటర్లలో మహిళా కమాండోస్‌‌దే కీలకపాత్ర. మహిళా జవాన్లు అబూజ్‌‌మాఢ్‌‌ అడవుల్లో 70 కిలోమీటర్లకు పైగా కాలినడకన వెళ్లి కూంబింగ్‌‌లో పాల్గొంటున్నారు. 

‘దంతేశ్వరి ఫైటర్స్’ పేరుతో మహిళా కమాండోస్​

దంతెవాడ జిల్లాలో దంతేశ్వరి మాత అంటే ఆదివాసీలకు ఆరాధ్య దైవం. ఆ అమ్మవారి స్ఫూర్తితో ఛత్తీస్‌‌గఢ్‌‌ ప్రభుత్వం మహిళ పోలీసులతో ‘దంతేశ్వరి ఫైటర్స్’ పేరుతో మహిళా కమాండోస్‌‌ను రిక్రూట్‌‌ చేసింది. వీరికి అడవులు, నదులు, వాగులు పరివాహక ప్రాంతాల్లో అన్ని కాలాల్లోనూ ఆపరేషన్స్‌‌ నిర్వహించేలా ట్రైనింగ్‌‌ ఇచ్చారు. ఇదే తరహాలో ‘బస్తర్‌‌ ఫైటర్స్‌‌’ పేరుతో డిస్ట్రిక్ట్ రిజర్వ్‌‌ గార్డ్స్‌‌ (డీఆర్జీ) మహిళా కమాండోస్‌‌ను సైతం నియమించారు. ఇందులోనూ లొంగిపోయిన మావోయిస్టులనే ఎక్కువ సంఖ్యలో నియమించుకున్నారు. దండకారణ్యంపై పట్టు ఉన్న మహిళా జవాన్లు ఇప్పుడు మావోయిస్టుల ఏరివేతలో ముఖ్యభూమిక పోషిస్తున్నారు.

చత్తీస్‌‌గఢ్‌‌ ప్రభుత్వం 2021లో బస్తర్‌‌ రీజియన్‌‌లో 451 మంది మహిళా కమాండోస్‌‌ను నియమించుకుంది. దంతేశ్వరి లడకీ ఫైటర్స్‌‌ పేరుతో 97 మంది మహిళా కమాండోస్‌‌ను నియమించగా అందులో 37 మంది లొంగిపోయిన మావోయిస్టులే ఉన్నారు. మిగిలిన వారు కూడా మావోయిస్టు ప్రాబల్య గ్రామాల్లోని బాధిత కుటుంబాల నుంచే రిక్రూట్‌‌ అయ్యారు. ఈ 548 మంది మహిళా కమాండోస్‌‌కు ట్రైనింగ్‌‌లో భాగంగా నిత్యం పౌష్టికాహారం అందించి అధునాతన ఆయుధాలతో కూంబింగ్‌‌ ఆపరేషన్లు చేపట్టడం, గస్తీ కాయడం వంటివి నేర్పించారు. దట్టమైన అడవుల్లో సైతం ఆపరేషన్లు చేయడంలో మహిళా కమాండోలు దిట్ట.