- మావోయిస్టు అగ్ర నేతలే లక్ష్యంగా చత్తీస్‌గఢ్ దండకారణ్యంలోకి చొచ్చుకెళ్తున్న గ్రేహౌండ్స్
- బేస్ క్యాంప్‌లతో కంగారెత్తిస్తున్న ‘కగార్’
- వచ్చే నెల 2 నుంచి పీఎల్జీఏ వారోత్సవాలు
- కాంగ్రెస్, బీజేపీ నేతలను అలర్ట్ చేస్తున్న పోలీసులు
భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం, వెలుగు: 2026 మార్చి లోపు మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు కదులుతున్నది. మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా చత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్ను పద్యవ్యూహంగా మార్చింది. ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా ప్రతి 5 కిలోమీటర్లకు ఒక బేస్‌క్యాంపు ఏర్పాటు చేయడంతోపాటు దండకారణ్యంలోకి చొచ్చుకెళ్లేందుకు పెద్ద ఎత్తున బలగాలను తరలిస్తున్నది. మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న అబూజ్‌మడ్‌లో కేంద్ర, రాష్ట్ర బలగాలను మోహరిస్తున్నది. ఇటీవల వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టులు పెద్ద ఎత్తున మృతిచెందుతుండగా.. వారినుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాకుండా కాంగ్రెస్, బీజేపీ నేతలను కేంద్రం అలర్ట్ చేస్తున్నది. మరో వైపు నక్సల్స్‌ను అరికట్టడంలో ఆరితేరిన తెలంగాణ గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలోకి దిగుతున్నారు.
ఈ ఏడాదిలో 250 మందికి పైగా మృతి
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో దాదాపు 250 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. తెలంగాణలో ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 42 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. ఇందులో ఐదుగురు ముఖ్యమైన కేడర్ నేతలున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ల పేరిట మావోయిస్టులు మృతిచెందుతుండడంతో తెలంగాణ పోలీసులు ‘చేయూత’ ప్రోగ్రాం ద్వారా లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ 29 మంది మావోయిస్టులు సరెండర్ కాగా, ఇందులో 21 మంది కీలక మావోయిస్టు నేతలున్నారు.
బేస్ క్యాంప్‌లతో కంగారెత్తిస్తున్న కగార్..
ఓ వైపు చత్తీస్‌గఢ్‌లో పదుల సంఖ్యలో, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మూడుకు పైగా బేస్ క్యాంపులను కేంద్ర బలగాలు, పోలీసులు ఏర్పాటు చేశారు. మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్కగార్’ లో భాగంగా బేస్ క్యాంప్‌లతో మావోయిస్టులకు దడపుట్టిస్తున్నారు. ఈ బేస్ క్యాంపులు మావోయిస్టులకు మరణ శాసనాలుగా మారుతున్నాయి. దండకారణ్యంలో ప్రతి 5 కిలోమీటర్లకు బేస్ క్యాంపులను కేంద్ర బలగాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇదే క్రమంలో తెలంగాణ ముఖ ద్వారాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో బేస్ క్యాంపుల ఏర్పాటు మావోయిస్టులను అడవి దాటకుండా చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. బేస్ క్యాంపుల ఏర్పాటుతో స్థానికంగా ఉన్న గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు.
దద్దరిల్లుతున్న దండకారణ్యం
అటు పోలీసులు, ఇటు మావోయిస్టుల బూట్ల చప్పుళ్లు, తుపాకుల మోతతో కొద్ది నెలలుగా దండకారణ్యం దద్దిరిల్లుతున్నది. ఇన్ఫార్మర్ల పేరిట పలువురిని మావోయిస్టులు ఇటీవలి కాలంలో కాల్చి చంపారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలతో పాటు చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, బస్తర్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు, మావోయిస్టుల సంచారంతో గిరిజనులు క్షణమొక యుగంగా జీవనం సాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో జరిగిన వరుస పోలీస్ ఎన్ కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందినప్పటికీ.. అదును దొరికినప్పుడల్లా పోలీసులపై మావోయిస్టులు గెరిల్లా దాడులకు పాల్పడుతూ టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నారు. పెరుగుతున్న పోలీసు దాడులతో మావోయిస్టులు ఓ చోట స్థిరంగా ఉండలేని పరిస్థితి నెలకొన్నదని ఓ పోలీస్ ఆఫీసర్ పేర్కొన్నారు.
తెలంగాణలోకి చొరబడకుండా పక్కా స్కెచ్
తెలంగాణ–చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతం గుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి తెలంగాణలోకి మావోయిస్టులు రాకుండా భద్రాద్రి పోలీస్‌లు ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. ఈ క్రమంలోనే చత్తీస్‌గఢ్ పోలీసులకు అండగా ఉండడంతోపాటు సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు లేకుండా నిర్మూలించేందుకు తెలంగాణ పోలీసులు, గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు దండకారణ్యంలోకి చొచ్చుకెళ్లేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సమీపంలోని చత్తీస్ గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్ 10 మంది మావోయిస్టులు మృతి చెందారు.
భద్రాద్రి జిల్లాలోని సారపాక ఐటీసీలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలీస్ ఉన్నతాధికారుల సమావేశంలో పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై తెలంగాణ పోలీసులు ఆపరేషన్ మొదలెట్టే అవకాశాలున్నాయి. జిల్లాలో మావోయిస్టులు అడుగు పెట్టిన మరుక్షణంలో వారిని ఎన్కౌంటర్ లేదా అరెస్టు చేయడం లేదా లొంగిపోయేలా ఒత్తిడి తీసుకువచ్చేలా భద్రాద్రి పోలీస్‌లు పక్కాగా స్కెచ్ వేసి, ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలి కాలంలో గుండాల అటవీ ప్రాంతంతోపాటు కరకగూడెం అడవుల్లో పోలీస్ ఎన్కౌంటర్ల పేరిట మావోయిస్టు యాక్షన్ టీంలకు చెక్ పెట్టారు. దండకారణ్యంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ బి. రోహిత్ రాజు ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తూ.. ముందుకు సాగుతున్నారు. మావోయిస్టుల కదలికలపై ఎస్పీ నిత్యం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల పోలీస్ ఆఫీసర్లతో వీడియో, టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారు.
పీఎల్ జీఓ వారోత్సవాల నేపథ్యంలో అలర్ట్
మావోయిస్టులు వచ్చే నెల 2వ తేదీనుంచి పీఎల్జీఓ వారోత్సవాలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. పోలీసులనుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ ఈ వారోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలంటూ మావోయిస్టు నేతలు ప్రకటనలిస్తున్నారు. గ్రామాల్లో పోస్టర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. కేంద్రంతోపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నేతలను అప్రమత్తం చేస్తున్నారు. తమకు తెలియకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించవద్దని ప్రజాప్రతినిధులు, నేతలకు సూచిస్తున్నారు.