కర్రె గుట్టలపై బాటిల్‌‌ బాంబులు.. బలగాలకు చాలెంజింగ్ గామారిన ‘ఆపరేషన్‌‌ కర్రెగుట్టలు’

కర్రె గుట్టలపై బాటిల్‌‌ బాంబులు.. బలగాలకు చాలెంజింగ్ గామారిన ‘ఆపరేషన్‌‌ కర్రెగుట్టలు’
  • వాటితో పాటు ఐఈడీ, టిఫిన్‌‌ బాక్స్‌‌, కుక్కర్‌‌ బాంబులు
  • నిర్వీర్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్న భద్రతా బలగాలు
  • బీర్‌‌బాటిల్‌‌ బాంబులను కనుగొనడం ఇదే మొదటిసారి అంటున్న జవాన్లు
  • బలగాలకు చాలెంజింగ్ గామారిన ‘ఆపరేషన్‌‌ కర్రెగుట్టలు’

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: ఇన్నాళ్లూ ఐఈడీ, టిఫిన్‌‌ బాక్స్‌‌, కుక్కర్‌‌ బాంబులను వాడిన మావోయిస్టులు తాజాగా బీర్‌‌ బాటిల్‌‌ బాంబులను అమరుస్తున్నారు. కర్రెగుట్టలపై కూంబింగ్‌‌ చేస్తున్న భద్రతా బలగాలు సోమవారం బీర్‌‌బాటిల్‌‌ బాంబులను, వాటికి అమర్చిన వైర్లను గుర్తించాయి. ఇలాంటి బాంబులను కనుగొనడం ఇదే మొదటిసారి అని పోలీస్‌‌ వర్గాలు చెబుతున్నాయి.

బాంబు స్క్వాడ్‌‌ సాయంతో వీటిని నిర్వీర్యం చేసుకుంటూ బలగాలు ముందుకు సాగుతున్నాయి. కాగా, శనివారం కర్రె గుట్టల్లోని జోలా గ్రామం వద్ద  ఓ జవాన్‌‌  ఐఈడీ బాంబ్‌‌పై కాలు వేయడంతో అది పేలి తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడ ఏ బాంబు ఉందో తెలియని పరిస్థితుల్లో జవాన్లు  ప్రతి  అడుగును ఆచితూచి వేస్తున్నారు. 

కాలిబాటలో బాంబులు
కర్రె గుట్టలపై భద్రతాబలగాలు చేపట్టిన ఆపరేషన్‌‌ ఏడో రోజుకు చేరుకుంది. సోమవారం జవాన్లు కూంబింగ్‌‌ చేస్తున్న సమయంలో తీసిన ఓ వీడియో బయటకు వచ్చింది. అడవిలో జవాన్లు నడిచే కాలిబాటలో వైర్లు కనిపించడంతో కర్రలతో తవ్వి చూడగా బీర్‌‌ బాటిల్‌‌ బాంబ్‌‌ బయటపడింది. దానిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బస్తర్‌‌ ఫైటర్స్‌‌, డీఆర్‌‌జీ టీమ్స్​ భూమిలోంచి బీర్‌‌ బాటిల్‌‌ బాంబ్‌‌ను బయటకు తీస్తున్న దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి.

శనివారం కర్రె గుట్టల్లోని జోలా గ్రామంలో సెర్చ్‌‌ ఆపరేషన్‌‌లో పాల్గొన్న జవాన్‌‌ మున్సిఫ్‌‌ ఖాన్ ఐఈడీ బాంబ్‌‌పై కాలు వేయడంతో అది పేలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని గుట్ట కిందికి తీసుకొచ్చి హెలికాప్టర్‌‌లో హాస్పిటల్‌‌కు తరలించారు. ఇప్పుడు కొత్తగా బీర్‌‌ బాటిల్‌‌ బాంబులు బయటపడుతుండడంతో ఆపరేషన్‌‌లో పాల్గొనడం జవాన్లకు సవాల్‌‌గా మారింది.

భద్రతా బలగాలకు సవాళ్లు
కర్రె గుట్టలపై బేస్‌‌ క్యాంప్‌‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్న భద్రతాబలగాలకు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. ‘బచావో కర్రె గుట్టలు’ పేరిట ఆపరేషన్‌‌ స్టార్ట్‌‌ చేసి వారం రోజులు అవుతోంది. ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో  రైఫిల్స్‌‌, రోజువారీ వస్తువులను భుజాన వేసుకొని కొండలు ఎక్కుతున్న జవాన్లలో చాలా మంది డీ హైడ్రేషన్‌‌కు గురవుతున్నారు. అలాంటి వారిని హెలికాప్టర్‌‌ ద్వారా బీజాపూర్‌‌, వెంకటాపూర్‌‌ హాస్పిటల్స్‌‌కు తీసుకువస్తున్నారు. వారి స్థానంలో బ్యాకప్‌‌ పార్టీని గుట్టలపైకి పంపుతున్నారు.

ఇదీగాక మావోయిస్టుల కోసం వెతుకుతున్న జవాన్లకు ఆదివారం ఓ రాతి గుహ కనిపించింది. కర్రె గుట్టల్లో ఇలాంటి గుహలు అనేకం ఉన్నాయని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. గుట్టలపై ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ ఇలాంటి గుహలు పెద్ద సంఖ్యలోనే కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంతకాలం వీటిని షెల్టర్లుగా ఉపయోగించుకున్న మావోయిస్టులు బలగాలు వచ్చే సరికే ఖాళీ చేసి వెళ్తున్నాయి. దీంతో వారికి సమాచారం ఎలా వెళ్తుందో తెలియక భద్రతా బలగాలు ఆలోచనలో పడ్డాయి.