
హైదరాబాద్/వెంకటాపురం: కర్రెగుట్ట చుట్టూ యుద్ధవాతావరణం నెలకొంది. ఆపరేషన్ కగార్ పేరుతో 20 వేల మంది భద్రతా బలగాలు తెలంగాణ–ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టను చుట్టుముట్టాయి. అదే సమయంలో హెలిక్యాప్టర్ ద్వారా ఆపరేషన్ కూడా నడుస్తోంది. మూడు రోజులుగా ఈ ఆపరేషన్ నడుస్తోంది. కర్రె గుట్టపై దాదాపు వెయ్యి మంది మావోయిస్టులు డెన్ ఏర్పాటు చేసుకున్నట్టు సీఆర్పీఎఫ్ అనుమానిస్తోంది. కర్రెగుట్టపై ది మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటి వరకు దండకారణ్యంలోని అబూజ్ మడ్ ప్రాంతాన్ని దాదాపుగా స్వాధీనం చేసుకున్నాయి కేంద్రబలగాలు. అబూజ్ మడ్ కు ఆనుకొని కర్రెగుట్ట మొదలవుతుంది.
కర్రెగుట్టకు సంబంధించి.. బీజాపూర్ జిల్లాలోని ఊసూరు బ్లాక్, ఆవు పల్లి, పూజారి కాంకేడ్ ప్రాంతాలు ఛత్తీస్ గఢ్లో ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలకు విస్తరించి ఉన్నాయి. కర్రె గుట్టలపై తెలంగాణలో పాముడూరు, తడపల, జెల్ల, డోలి, చెలిమల, బండారు పల్లి, ముకునూరు గ్రామాలుండేవి. ఈ గ్రామాలను గతంలోనే ఖాళీ చేయించి వారికి వేరే ప్రాంతాల్లో పునరావాసం కల్పించారు. అయితే పెనుగోలు గ్రామస్తులు మాత్రం అక్కడే ఉన్నారు.
ఆబూజ్ మడ్ పై కేంద్ర బలగాలు ఆపరేషన్ మొదలు పెట్టగానే మావోయిస్టులు సమీపంలోనే ఉన్న కర్రెగుట్టకు మారినట్టు తెలెస్తోంది. ఇక్కడ డెన్ లు ఏర్పాటు చేసుకొని ఆయుధాలను దాచినట్టు చెబుతున్నారు. ఇక్కడికి పోలీసులు, భద్రతా బలగాలు రాకుండా గుట్ట చుట్టూ ల్యాండ్ మైన్స్ పెట్టినట్టు సమాచారం. పలువురు ఆదివాసీలు వేట కోసం కర్రెగుట్టకు వెళ్లి ఇటీవల మృత్యువాత కూడా పడ్డారు.
దండకారణ్యం టు కర్రెగుట్ట
మావోయిస్టులు కర్రెగుట్టపై డెన్ ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం అందుకున్న కేంద్ర బలగాలు స్పెషల్ ఆపరేషన్ కు శ్రీకారం చుట్టాయి. మూడు వైపుల నుంచి గుట్టను చుట్టుముట్టాయి. దీంతో పాటు హెలిక్యాప్టర్లు, డ్రోన్ల ద్వారా అణువనువూ తనిఖీ చేస్తున్నాయి. అబూజ్ మడ్ పరిధిలోని ఆదివాసీ గూడేలకు రోడ్లు వేసుకుంటూ ఆపరేషన్ మొదలు పెట్టిన సీఆర్పీఎఫ్ బలగాలు ప్రస్తుతం కర్రెగుట్ట వద్దకు చేరుకున్నాయి. అయితే ఈ ఆపరేషన్ రాష్ట్ర పోలీసులకు సంబంధం లేకుండా జరుగుతోంది. అదే విధంగా ఫారెస్టు అధికారులు సైతం కర్రెగుట్ట వైపు రావద్దంటూ సీఆర్పీఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చే వరకు స్థానిక పోలీసులు ఎంటర్ అయ్యే అవకాశం లేదు.
సేఫ్టీ ప్లేస్గా కర్రెగుట్ట!
మావోయిస్టులు కర్రెగుట్టను సేఫ్టీ ప్లేస్గా భావిస్తున్నారు. ఇదొక గుట్టల సముదాయం.. ఒక గుట్ట దిగగానే కొంత మైదాన ప్రాంతం ఉంటుంది.. ఆ వెంటనే గుట్ట స్టార్ట్ అవుతుంది. గుట్టల కింద సహజ సిద్ధంగా ఉండే బంకర్లు, సొరంగ మార్గాలున్నాయి. ఒక్కో బంకర్ చాలా విశాలంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సెలయేళ్లు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. మూడు కాలాలూ నీటి వసతి ఉంటుందని అంటున్నారు. అయితే అబూజ్ మడ్ను సీఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్న దరిమిలా.. మావోయిస్టులు కర్రెగుట్టలను సేఫ్టీ ప్లేస్ గా భావించే భారీ మొత్తంలో ఆయుధాలను తీసుకొని ఇక్కడికి వచ్చి ఉంటారని తెలుస్తోంది. ఇక్కడే డెన్ ఏర్పాటు చేసి ఉంటారనే అనుమానాలున్నాయి.
బేస్ క్యాంప్ దిశగా అడుగులు
ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రెగుట్టపై బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకొనేందుకు సీఆర్పీఎఫ్, భద్రతా బలగాలు రెడీ అవుతున్నాయి. ఇక్కడ ఆయుధాలను భద్రపర్చిన మావోయిస్టులు తిరిగి వస్తే వారిని పట్టుకోవడమే ఈ బేస్ క్యాంప్ లక్ష్యమని అంటున్నారు. ఈ ఆపరేషన్ మూడు నెలల పాటు కొనసాగుతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా మావోయిస్టుల ఏరివేతలో ఇది అతి పెద్ద ఆపరేషన్ గా చెబుతున్నారు.