ఆపరేషన్ కశ్మీర్ ఇలా జరిగింది..!

కాశ్మీర్​ విషయంలో కాపీరైట్​ ఉన్నట్లుగా ఫీలయ్యే పార్టీలన్నీ ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఆవగింజంత సమాచారం పొక్కకుండా మోడీ–షా జోడీ మంత్రాంగం నడిపించింది. కాశ్మీర్​లోకి పారామిలిటరీ ఫోర్స్​ని దింపినా, అమరనాథ్​ యాత్రను నిలిపేసినా, టూరిస్టుల్నీ స్టూడెంట్లను పంపేసినా… అదేదో మిలిటెన్సీకి సంబంధించిన సెక్యూరిటీ చెక్​గానే భావించాయి.  పొలిటికల్​ ఆపరేషన్​ని రెండు నెలల ముందే మొదలైందని గ్రహించలేకపోయాయి. బ్యూరోక్రాట్లను, మిలిటరీని,  లా ఎక్స్​పర్ట్​లను, పార్టీ ఎంపీలను కో–ఆర్డినేట్​ చేసుకుంటూ సక్సెస్​ చేసింది మోడీ సర్కారు.

ఆపరేషన్ కాశ్మీర్ ఓ టాప్ సీక్రెట్.  ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు హోం మంత్రి అమిత్ షా ఈ ఆపరేషన్​ని నిర్వహించారు. ఆవగింజంత సమాచారం కూడా మూడో కంటికి తెలియకుండా సక్సెస్ చేశారు. కొన్ని రోజులుగా కాశ్మీర్​లోకి పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించడం గమనించినవారికి ఏదో జరుగుతోందన్న  హింట్ సూచనప్రాయంగా అందింది. అంతే తప్ప, కాశ్మీర్​కి ప్రత్యేక హక్కులు కట్టబెట్టిన ఆర్టికల్ 370తో పాటు 35–ఏను కూడా రద్దు చేస్తూ సోమవారం పార్లమెంట్​లో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టేంత వరకు ఎవరికీ ఏమీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

జూన్ మూడో వారంలోనే షురూ

ఇంత సీక్రెట్​గా జరిపిన పొలిటికల్​ ఆపరేషన్​ వెనుక చాలా కథ జరిగింది. జూన్ మూడో వారంలోనే ఆపరేషన్ కాశ్మీర్ మొదలైంది. చత్తీస్​గఢ్ కేడర్​కి చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యాన్ని  జమ్మూ కాశ్మీర్​కి డిప్యుటేషన్​పై పంపించింది. కాశ్మీర్​ కొత్త చీఫ్ సెక్రెటరీగా నియమించింది. దీంతోనే  ఆపరేషన్ కాశ్మీర్ మొదలైందని భావించాలి. సుబ్రహ్మణ్యానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాత పరిచయాలున్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో ఆయన కొంతకాలం జాయింట్ సెక్రెటరీగా పని చేశారు.

ఆపరేషన్ కాశ్మీర్​కి నాయకత్వం వహించిన కేంద్ర మంత్రి అమిత్ షా ముందుగా తనకంటూ ఒక కోర్ టీం ఏర్పాటు చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ చీఫ్ సెక్రెటరీ బి.వి.ఆర్​.సుబ్రహ్మణ్యం, లా మినిస్ట్రీ సెక్రెటరీ అలోక్ శ్రీవాత్సవ, మరో సీనియర్ బ్యూరోక్రాట్ ఆర్.ఎస్.వర్మ, అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్, కేంద్ర హోం మినిస్ట్రీ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ కోర్ టీం లో సభ్యులు. ఆపరేషన్ కాశ్మీర్​కి సంబంధించి తలెత్తే న్యాయపరమైన చిక్కుల గురించి కేంద్ర లా మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్​తో అమిత్ షా కూలంకషంగా చర్చించారు. అంతా ఓకే అనుకున్నాక  ఆపరేషన్ ప్రారంభించారు.

ఆర్టికల్ 370ని రద్దు చేస్తే కాశ్మీర్ లోయలో ఏం జరిగే అవకాశాలున్నాయి? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుందా? వస్తే  పరిస్థితిని కంట్రోల్​ చేయడానికి భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయా?… ఇలా అనేక అంశాలపై అమిత్ షా దృష్టి పెట్టారు. ఆ తర్వాత ప్రధాని మోడీ సలహా మేరకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్​తో రెండుసార్లు భేటీ అయ్యారు. కాశ్మీర్ లోయలో పరిస్థితులపై ఆయనతో చర్చించారు. గ్రౌండ్ రియాలిటీస్ గురించి తెలుసుకోవడానికి అజిత్ దోవల్ కాశ్మీర్ లోయకు ప్రయాణమయ్యారు. మూడు రోజులు అక్కడే ఉండి లా అండ్ ఆర్డర్ పరిస్థితి స్వయంగా పరిశీలించారు. తర్వాత అమరనాథ్ యాత్రను కుదిస్తూ జూలై 26న  నిర్ణయం తీసుకున్నారు. కాశ్మీర్ లోయ నుంచి వెళ్లిపోవలసిందిగా టూరిస్టులను కోరారు. అక్కడ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. శ్రీనగర్​లోని నేషనల్​ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్​ (ఎన్​ఐటీ)లో చదువుతున్న స్టూడెంట్లను వారి వారి సొంత రాష్ట్రాలకు పంపేశారు. పనిలో పనిగా వంద కంపెనీల పారా మిలటరీ దళాలను కాశ్మీర్ కు తరలించారు.

ఆగస్టు 4న ఏం జరిగింది?

ఆపరేషన్ కాశ్మీర్​లో నాలుగో తేదీ (ఆదివారం) రాత్రి ఎంతో కీలకమైంది. చీఫ్ సెక్రెటరీ సుబ్రహ్మణ్యం నుంచి రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు అందాయి. దీంతో  కాశ్మీర్​లోని ముఖ్యమైన పొలిటికల్ లీడర్లను హౌస్ అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి మొబైల్స్  తీసేసుకున్నారు. ఇళ్లకున్న లాండ్ లైన్ ఫోన్​ సర్వీస్ తొలగించారు. ఒకవైపు కాశ్మీర్ లోయలో ఇదిలా జరుగుతుంటే… మరో వైపు ఢిల్లీలో ఎవరికి అప్పగించిన పనులు వాళ్లు చేయడం మొదలెట్టారు. రాజ్యసభలో ఎన్డీయేకు బలం తక్కువ కావడంతో  బిల్లు పాస్ కావడానికి అవసరమైన సంఖ్యా బలం ఉండేట్లు చూడాల్సిన బాధ్యతను పార్టీ ఎంపీలు అనిల్ బలూనీ,  భూపేంద్ర యాదవ్ తీసుకున్నారు. తగినంత మంది ఎంపీలను రాజ్యసభకు తీసుకువచ్చే పనిని వాళ్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఐదో తేదీన సభ్యులందరూ తప్పనిసరిగా రాజ్యసభకు హాజరు కావాలని బీజేపీ తరఫున విప్ కూడా జారీ చేశారు.  చివరి క్షణంలో బీఎస్పీ నాయకుడు సతీశ్ మిశ్రాతో మాట్లాడి ఆయన మద్దతు కూడగట్టుకున్నారు.

కథ క్లైమాక్స్​కి చేరుకుంటుందన్న దశలో ఐదో తేదీన కేంద్ర కేబినెట్ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలోనే జమ్మూ కాశ్మీర్​కి సంబంధించి ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ  నిర్ణయం తీసుకున్నట్లు  కేంద్రం బాహాటంగా వెల్లడించింది. ఇంకేముంది… కొన్ని గంటల్లోనే రాజ్యసభ సమావేశాల్లో ప్రభుత్వం తరఫున బిల్లును అమిత్ షా ప్రవేశపెట్టారు. మరికొన్ని గంటల్లోనే మోడీ, అమిత్ షా ఆశించింది జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఆపరేషన్ కాశ్మీర్  సక్సెస్ అయింది.