- అక్రమ నిర్మాణాల కూల్చివేతపై అధికారుల కసరత్తు
- నది పరిసరాల్లో 13 వేల అక్రమ కట్టడాలు ఉన్నట్లు గుర్తింపు
- ముందుగా షెడ్లు, దుకాణాలు, గోదాములు నేలమట్టం!
- ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే ఇండ్ల కూల్చివేతలు
హైదరాబాద్ సిటీ, వెలుగు:మూసీ పరీవాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలు, కబ్జాల తొలగింపుపై అధికారులు ఫోకస్‌పెట్టారు. అక్కడి బస్తీలను ఖాళీ చేసే ప్రక్రియ ఎలా నిర్వహించాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా అక్రమ నిర్మాణాల తొలగింపు సందర్భంగా స్థానికుల నుంచి వ్యతిరేకత రాకుండా.. ముందే వారికి సర్ధిచెప్పాలని నిర్ణయించారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో.. అర్హులను ఎంపిక చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ సమక్షంలో రెవెన్యూ అధికారులు సెక్రటేరియెట్‌లో ప్రత్యేక సమావేశమై చర్చించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లతో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ కమిషనర్ గౌతమి పాల్గొన్నారు.
నది సరిహద్దుల గుర్తింపుపై సమాలోచనలు
మూసీ నది సరిహద్దులను గుర్తించే విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సరిహద్దులను గుర్తిస్తే ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై క్లారిటీ వస్తుందని ఆఫీసర్లు చెప్తున్నారు. అయితే జీవో 168 ప్రకారం ముందుగా ప్రకటించినట్టుగానే మూసీకి ఇరువైపులా 50 మీటర్ల చొప్పున బఫర్ జోన్‌ను ప్రకటించాలని నిర్ణయించారు. సరిహద్దుల విషయంలో నిజాం హయాంలో మూసీకి ఇరువైపులా రాతి కట్టడాలను ఫెన్సింగ్ మాదిరిగా నిర్మించారు.
ఇప్పటికీ చాదర్‌ఘాట్, పురానాపూల్, హైకోర్టు తదితర ప్రాంతాల్లో ఈ రాతి నిర్మాణాలను గుర్తించవచ్చు. దీనినే నది సరిహద్దుగా నిర్ణయించాలా? లేక రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వేల ప్రకారం సరిహద్దులను నిర్ణయించాలా? అనే విషయంపై అధికారులు సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.
ముందుగా షెడ్లు, గోదాములు నేలమట్టం!
ఇటు తూర్పున గౌరెల్లి నుంచి పశ్చిమాన నార్సింగి వద్ద ఓఆర్ఆర్ వరకూ 55 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మూసీ నదిలో దాదాపు 13 వేల వరకు అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు అధికారుల సర్వేలో తేలింది. ఇందులో దాదాపు 4 వేల వరకు షెడ్లు, దుకాణాలు, గోదాములు, మెకానిక్ షాపులు వంటివి ఉన్నాయని గుర్తించారు. ముందుగా షెడ్లు, దుకాణాలు, గోదాములు, మెకానిక్ షాపులను తొలగించి.. బస్తీలు, కాలనీల్లోని వారికి ప్రత్యామ్నాయ చూపించిన తర్వాతే అక్రమ ఇండ్లను కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో హైదరాబాద్ పరిధిలోని మూసీలో నిర్మాణాలు, నివాసాలను ఎలా తొలగించాలి? నిర్వాసితులకు చేసే సాయం ఎలా ఉండాలన్న దానిపై హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.
కూల్చివేతల బాధ్యత హైడ్రాకే!
మూసీ పరీవాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులు హైడ్రాకే అప్పగించనున్నట్లు తెలుస్తున్నది. మంగళవారం సెక్రటేరియెట్‌లో జరిగిన సమావేశంలో హైడ్రా అధికారులు కూడా పాల్గొనడంతో వారికే అప్పగిస్తారన్న చర్చ జరుగుతున్నది.