మహబూబాబాద్, వెలుగు : బాల కార్మికులను రక్షించడం కోసం ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం జులైలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భిక్షాటన చేస్తున్న, తప్పిపోయిన, వివిధ కంపెనీలు, షాపుల్లో పని చేస్తున్న బాల కార్మికులను గుర్తించేందుకు ఆఫీసర్లు తనిఖీలు చేపడుతున్నారు.
సంయుక్తంగా ముందుకు సాగుతున్న ఆఫీసర్లు
ఆపరేషన్ ముస్కాన్_10 లో మహబూబాబాద్జిల్లా ఏఎస్పీ జె.చెన్నయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేశారు. ఇందులో బాలల సంక్షేమ కమిటీ, పోలీస్, కార్మిక, విద్యాశాఖ, జాతీయ బాలకార్మిక నిర్మూలన సంస్థ ఆఫీసర్లు సమన్వయంతో పని చేశారు. తొర్రూరు, మహబూబాబాద్ డివిజన్ లో రెండు బృందాలతో తనిఖీలు నిర్వహించారు. హోటల్స్, ఇటుకబట్టీలు, కంపెనీలు, మెకానిక్ షాపుల్లో, మైనింగ్ ప్రాంతాల్లో, అనాథ శరణాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, బాల సదనాల నుంచి తప్పిపోయిన బాలలను సైతం గుర్తించారు. బాలల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి, పాఠశాలలో, సంక్షేమ వసతి గృహాల్లో చేర్పించేలా చర్యలను చేపడుతున్నారు.
ఆపరేషన్ ముస్కాన్ లో బాలల గుర్తింపు..
2014లో మహబూబాబాద్ జిల్లాలో 221 మంది బాలలను ఆపరేషన్స్ ముస్కాన్‌లో గుర్తించారు. 2015 లో 150 మంది బాలలు, 2016 లో 25 మంది, 2017--–18లో మొత్తం 59 మంది బాల కార్మికులను గుర్తించారు. 2021లో 127 మంది బాలలను, 2022లో 35 మంది బాలకార్మికులను గుర్తించారు, 11 మందిపై కేసులు నమోదు చేశారు. 2023లో 28 మందిని గుర్తించారు, 18 కేసులను నమోదు చేశారు. 2024లో 20 మంది బాలలకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించి, 5 కేసులు నమోదు చేశారు.
బాలలు బడిలోనే ఉండాలి..
బాలలతో పనులు చేయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. 14 ఏండ్లలోపు బాలబాలికలను పనిలో పెట్టుకొని శారీరకంగా, మానసికంగా హింసించే వారిపై జువైనల్ చట్టంకింద కేసులు నమోదు చేస్తున్నాం. ఈ ఏడాది జిల్లాలో 5 మంది పై కేసులు నమోదు చేశాం. పిల్లలతో పని చేయించే వారిని చూస్తే టోల్ ఫ్రీ నెంబర్1098కి సమాచారం ఇవ్వాలి.
- డాక్టర్ ఎస్.నాగవాణి, సీడబ్ల్యూసీ చైర్మన్, మహబూబాబాద్ జిల్లా