- ఈజీఎస్ లో ఆపరేషన్ సంకల్ప్
- ఎస్సీ, ఎస్టీల బీడు భూముల అభివృద్ధి
- పొలంలో ఇసుక మేటలు తొలగించుకునే చాన్స్
- ఎకరానికి పది మందికి ఉపాధి
నిర్మల్, వెలుగు: జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను పూర్తిస్థాయిలో క్రమబద్ధీకరించేందుకు సంబంధిత శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ సంకల్ప్ పేరిట ఇక నుంచి బీడు భూములను లక్ష్యంగా చేసుకొని పనులు చేపట్టాలని నిర్ణయించారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అందించిన బీడు భూములను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి సాగులోకి తీసుకురానున్నారు. నిర్మల్జిల్లావ్యాప్తంగా మొత్తం 2,300 మందికి సంబంధించిన దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా బీడు భూములు ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ సంకల్ప్ ద్వారా బీడు భూములన్నింటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే కాకుండా ఇటీవల భారీ వరదల కారణంగా చాలాచోట్ల పంట పొలాల్లో వేసిన ఇసుకమేటలను కూడా తొలగించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ పథకం కింద దిలావర్పూర్ మండలం కూస్లీ గ్రామంలో ఆపరేషన్ సంకల్ప్ మొదలుపెట్టారు.
అక్కడి ఎస్సీ, ఎస్టీల సాగుకు యోగ్యం కానీ భూములన్నింటిని అభివృద్ధి చేయనున్నారు. అయితే ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు కలిగి ఉన్న రైతులనే మొదట ఈ పథకం కింద ఎంపిక చేస్తున్నారు. ఒక్కో గ్రామంలో ఎకరానికి పదిమంది కూలీలను వినియోగిస్తూ వారికి 150 రోజుల పాటు పని కల్పించాలని నిర్ణయించారు. ఎస్సీ కార్పొరేషన్ తోపాటు గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలోని ఉపాధి హామీ విభాగం ఆపరేషన్ సంకల్ప్ అమలు కోసం ఉమ్మడి యాక్షన్ ప్లాన్ రూపొందించింది. దాదాపు వెయ్యి ఎకరాల భూమిని అభివృద్ధి చేసి సాగులోకి తీసుకురావడమే కాకుండా లక్షా 35 వేలమంది కూలీలకు ఉపాధి కల్పించనున్నారు.
రైతులకు ఎంతో ఉపయోగం
ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద చెరువులలో చిన్న గుంతలు తవ్వి మట్టి తీయడం, పెద్దగా అవసరం లేని పనులు చేపట్టడంపై అనేక విమర్శలున్నాయి. కేవలం ఉపాధి కల్పించాలన్న లక్ష్యమే తప్ప చేపడుతున్న పనులు చాలాచోట్ల నిరుపయోగంగా మారుతున్నాయి. ఆపరేషన్ సంకల్ప్తో ఇలాంటి అడ్డగోలు పనులకు అడ్డుకట్ట పడనుంది. మొదటి దశ కింద నిర్మల్జిల్లాలో ఖానాపూర్ తో పాటు దస్తూరాబాద్, సారంగాపూర్, నర్సాపూర్, కడెం, పెంబి, దిలావర్పూర్, కుబీర్, తానూర్ మండలాల్లోని ఎస్సీ, ఎస్టీ ల భూములను అభివృద్ధి చేయనున్నారు. వర్షాకాలంలో వరదల కారణంగా ఖానాపూర్ నియోజకవర్గంలోని చాలా గ్రామాలు నీట మునిగాయి. వరదతో వందల ఎకరాల పంట భూముల్లో ఇసుక మేటలు వేసింది. ఇసుక మేటలను తొలగించడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో రైతులు ఆ భూముల్లో పంటలను సాగు చేసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పెంబి, దస్తురాబాద్, కడెం మండలాలలో చాలాచోట్ల వ్యవసాయ భూములను ఇసుకమేటలు కప్పేశాయి. దీంతో ఆపరేషన్ సంకల్ప్ కింద పొలాల్లోని ఇసుకమేటలను కూడా ఉపాధి హామీ కూలీలతో తొలగించేందుకు సిద్ధమవుతున్నారు.
అందరికీ ప్రయోజనం
ఉపాధి హామీ పథకం ద్వారా ప్రస్తుతం చేస్తున్న పనులకు భిన్నంగా చేపట్టేందుకు ఆపరేషన్ సంకల్ప్ రూపొందించాం. ఇటు ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం పంపిణీ చేసిన బీడు భూములను ఉపాధి కూలీల ద్వారా అభివృద్ధి చేయించడం, అలాగే వరదల కారణంగా పంట పొలాలను ముంచెత్తిన ఇసుక మేటలను తొలగించే పనులను చేపట్టడం లక్ష్యంగా పెట్టుకున్నాం. దీంతో చేపట్టే పనులు లబ్ధిదారులకు ఉపయోగపడడంతోపాటు కూలీలకూ ప్రయోజనం చేకూరనుంది.
– విజయలక్ష్మి, పీడీ, ఈజీఎస్, నిర్మల్ జిల్లా