ఆపరేషన్ సక్సెస్.. దుందుభి నదిలో చిక్కుకున్న ‘చెంచు’ కుటుంబం సేఫ్

అచ్చంపేట, వెలుగు: చేపల వేటకు వెళ్లి దుందుభి వాగులో మూడు రోజుల పాటు చిక్కిన చెంచు కుటుంబాన్ని ఎన్డీఆర్ఎఫ్​టీమ్​రెస్క్యూ చేసి కాపాడింది. నాగర్​కర్నూల్​జిల్లా అచ్చంపేట మండలం సిద్ధాపూర్ సమీపంలోని గుర్రాలబండ వద్ద జరిగిన ఘడిండి రిజర్వాటన వివరాలిలా ఉన్నాయి.. నల్గొండ జిల్లా దేవర కొండ మండలం గోనబోయిన పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దెయ్యం గుండ్ల గ్రామానికి చెందిన చెంచు కుటుంబం యర్ అలుగులో చేపలు పట్టేందుకు శుక్రవారం వెళ్లింది. ఆది వారం నుంచి దుందుభి వరద ఉధృతి పెరగడంతో నది మధ్యలో ఉన్న పెద్ద బండపై 10 మంది తలదాచుకున్నారు. 

మూడు రోజులైనా చేపల వేటకు వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో వారి బంధువులు వెతకగా దుందుభి నదిలో చిక్కుకున్నట్లు సోమవారం రాత్రి గుర్తించారు. వెంటనే అచ్చంపేట, దేవర కొండ పోలీస్, రెవెన్యూ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. స్పందించిన అచ్చంపేట, దేవర కొండ డీఎస్పీలు శ్రీనువాసులు, గిరిబాబు, ఆర్డీవో మాధవి అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ టీమ్, మత్స్యకారులను రప్పించి సురక్షితంగా వారిని ఒడ్డుకు చేర్చారు. ఘటనా స్థలానికి అచ్చంపేట, దేవర కొండ ఎమ్మెల్యేలు వంశీ కృష్ణ, బాలు నాయక్  చేరుకుని బాధితులతో మాట్లాడారు. 

జెల్ల బయ్యన్న(10), జెల్ల సత్తయ్య(30), జెల్ల గురువయ్య(60), జెల్ల నీరంజనమ్మ(70), జెల్ల శివ(15), జెల్ల పాపయ్య(25), జెల్ల అంజలి(5), జెల్ల అశ్విని (11), జెల్ల అఖిల్(17), జెల్ల యాదమ్మ(27)లను వెంటనే అచ్చంపేట ఏరియా హాస్పిటల్‎కు తరలించి వైద్య సేవలు అందించారు. వరదల్లో చిక్కుకున్న చెంచు కుటుంబాన్ని కాపాడిన అచ్చంపేట, దేవరకొండ రెవెన్యూ, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్  సిబ్బందిని ఎమ్మెల్యేలు అభినందించారు. అచ్చంపేట సీఐ రవీందర్, అచ్చంపేట, సిద్దాపూర్  ఎస్ఐలు రాములు, పవన్ కుమార్, తహసీల్దార్  మురళీ మోహన్, 30 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.