మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine). కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా(Shakthi prathap singh hada) తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మనుషీ చిల్లర హీరోయిన్ గా నటించారు. ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసింది ఈ మూవీ. పలువాయిదాల వల్ల ఈ సినిమా నేడు(మార్చ్ 1) ప్రేక్షకుల మునుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? వరుణ్ తేజ్ కు హిట్ పడిందా? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
అర్జున్ రుద్ర దేవ్(వరుణ్ తేజ్) భారతీయ వైమానిక దళ వింగ్ కమాండర్. అహనా గిల్(మానుషి చిల్లర్) అక్కడే పని చేసే రాడార్ ఆఫీసర్. ఇద్దరు ప్రేమలో ఉంటారు. ఒకసారి రుద్ర ప్రాజెక్ట్ వజ్ర చేపట్టి విఫలం అవుతాడు. ఆ ప్రాజెక్టులో తన ప్రాణ స్నేహితుడు కబీర్(నవదీప్) ప్రాణాలు కోల్పోతాడు. దీంతో.. ప్రాజెక్ట్ వజ్రను బ్యాన్ చేస్తారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. ఆ గాయాలను నుంచి కోలుకున్న రుద్ర 2019లో చేపట్టిన ఆపరేషన్ వాలెంటైన్ ప్రాజెక్టు కోసం రంగంలోకి దిగుతాడు. ఇంతకీ ఆపరేషన్ వాలైంటైన్ ఏంటి? దాని లక్ష్యం ఏంటి? అది ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? రుద్ర చేపట్టిన ప్రాజెక్ట్ వజ్ర ఎందుకోసం? అనేది ఆపరేషన్ వాలెంటైన్ మిగతా కథ.
విశ్లేషణ:
నిజం చెప్పాలంటే రెండు దేశాల మధ్య యుద్ధం అనగానే మనకు సైనిక దళమే గుర్తొస్తుంది. కానీ, వాటిలో నావికా, వైమానికి దళం పాత్ర కూడా ఎక్కువే. ఈ విషయం చాలా మందికి తెలియదు. కారణం.. సైనిక దళం బ్యాక్డ్రాప్ లో చాలా సినిమాలు రావడమే. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా సరికొత్త కాన్సెప్ట్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా వచ్చిన సినిమానే ఆపరేషన్ వాలెంటైన్.
2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిని భారతీయులు ఇప్పటికి మర్చిపోలేరు. ఈ దాడిలో 40 మంది జవాన్లు వీర మరణం పొందగా.. దానికి ప్రతీకారంగా బాల్‌కోట్ స్ట్రైక్ నిర్వహించి సక్సెస్ అయింది భారత్. ఈ ఘటనల ఆధారంగానే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్. యుద్ధంలో భారత వైమానిక దళం పాత్ర, అది ఎలా ఆపరేట్ అవుతుంది, గగనతలంలో వాళ్ళు చేసే పోరాటాలు వంటి విషయాలను ఈ సినిమాలో చాలా క్లియర్ గా చూపించారు. ఆ సీన్స్ ఆడియన్స్ సరికొత్త అనుభూతిని అందిస్తాయి.
అయితే.. యుద్ధ సన్నివేశాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల ఎమోషన్ మిస్ అయిందేమో అనే ఫీయింగ్ కలుగుతుంది. పుల్వామా అటాక్ కి సంబందించిన సీన్స్ ను ఇంకాస్త హృద్యంగా తెరకెక్కించాల్సింది అనిపిస్తుంది. ఫస్టాప్ మొత్తం పైలెట్ల టెస్ట్, హీరో హీరోయిన్ల లవ్, వంటి సీన్స్ తో ముందుకు సాగుతుంది. ఇక ఇంటర్వెల్ సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ఇక అసలు కథంతా సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. పాకిస్తాన్‌పై దాడి, పాకిస్తాన్ చేపట్టిన ఆపరేషన్ నెహ్రుని తిప్పికొట్టే విధానం, చివరల్లో ఆపరేషన్ వజ్రని ప్రయోగించడం తీరు నెక్స్ట్ లెవల్లో ఉంటుంది.
నటీనటులు:
ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వరుణ్ తేజ్ గురించి. అర్జున్ రుద్ర దేవ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. వింగ్ కమాండర్‌గా ఆయన బాడీ లాంగ్వెజ్, మాటలు, యాక్షన్ ప్రతీది నిజమైన సైనికుడిగానే అనిపిస్తాయి. ఈ సినిమా కోసం వరుణ్ పడిన కష్టమంతా తెరపై క్లియర్ గా కనిపించింది. రాడార్ ఆఫీసర్ గా మానుషి చిల్లర్ అద్భుతంగా నటించారు. తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇక కబీర్‌గా నవదీప్, మిర్ సర్వర్, రుహానీ శర్మ కూడా తమ పాత్రల మేర ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాకి ప్రధాన బలం అంటే మిక్కి జే మేయర్ నేపథ్య సంగీతం. ఆయన ఇచ్చిన మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. ప్రత్యేకంగా వందేమాతరం సాంగ్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఇక హరి కె. వేదాంతం సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ అనే చెప్పాలి. ప్రతి సీన్ చాలా రిచ్‌గా చూపించాడు. సినిమా మూడ్ ను మైంటైన్ చేశాడు. ఇక ఎడిటింగ్, నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.
ఇక ఆపరేషన్ వాలెంటైన్ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇదొక గొప్ప ప్రయత్నం. అందరు తప్పకుండ చూడొచ్చు.