వరంగల్ లో ‘ఆపరేషన్ జంజీర్’​

హనుమకొండ, వెలుగు: వరంగల్ సిటీలో తోపుడు బండ్లు రోడ్ల మీదకు వస్తుండడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో  పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ తరహాలో ‘ఆపరేషన్ జంజీర్’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా చిరువ్యాపారాలు చేసే తోపుడు బండ్లకు ఒక నిర్దిష్టమైన ప్రదేశాన్ని కేటాయించి, అక్కడే వ్యాపారం సాగించేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు రోజూ ఉదయం ట్రాఫిక్​ పోలీసులు తోపుడు బండ్లను నిర్దిష్ట ప్రదేశంలో ఉంచి, టైర్లకు తాళం వేస్తారు. ఆ తాళం చెవిని ఆ ఏరియాలో విధులు నిర్వర్తించే ట్రాఫిక్​ సిబ్బంది వద్దే భద్రపరుస్తారు.

వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో తిరిగి తాళాలను ఆయా తోపుడు బండ్ల యజమానులకు అప్పగిస్తారు. దీంతో తోపుడు బండ్లు రోడ్ల మీదకు రావడాన్ని నియంత్రించడంతో పాటు  ట్రాఫిక్​ ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని భావిస్తున్నారు. కాగా ఈ కార్యక్రమాన్ని  నగరంలో తొలిసారిగా వరంగల్ ట్రాఫిక్​ సీఐ బాబూలాల్​ ఆధ్వర్యంలో పోచమ్మ మైదాన్​ సెంటర్​ లో బుధవారం ప్రారంభించారు. ఆపరేషన్​ జంజీర్​ ఉద్దేశాన్ని చిరు వ్యాపారులకు వివరించి, తోపుడు బండ్లు కదలకుండా తాళాలు వేశారు.  ఈ కార్యక్రమంలో ఎస్సైలు రాజబాబు, డేవిడ్, ఆర్ఎస్సైలు పూర్ణచందర్రెడ్డి, శ్రవణ్ కుమార్, తోపుడు బండ్ల ఉమ్మడి వరంగల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు లింగమూర్తి, అధ్యక్షుడు ఫక్రుద్దీన్ పాల్గొన్నారు.