కుల గణనను వ్యతిరేకిస్తే ప్రజా ద్రోహులే: మేధావుల సదస్సులో ప్రొఫెసర్ మురళి మనోహర్

హైదరాబాద్: కుల గణనను వ్యతిరేకిస్తే ప్రజా ద్రోహులేనని మేధావి వర్గం అభిప్రాయపడింది. తెలంగాణలో జరుగుతున్న  కుల గణనపై  మేధావుల సదస్సు జరిగింది. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో కుల గణనకు వ్యతిరేకులను నిరసిస్తూ పీపుల్స్ కమిటీ ఆధ్వర్యంలో మేధావుల మీడియా సమావేశం జరిగింది.

ఈ మీడియా సమావేశంలో ప్రొఫెసర్ మురళి మనోహర్ మాట్లాడుతూ.. తెలంగాణ కుల గణనపై తప్పుడు, వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 75 ఏళ్ల తరువాత రాష్ట్రంలో కుల గణన జరుగుతుందని, కొన్ని కులాలే అధికారాన్ని చెలాయిస్తున్నాయని చెప్పారు. 75 ఏళ్ల నుంచి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్న ఇంకా వెనుకబాటుతనం ఉందని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం 100 స్కీమ్లు అమలు చేస్తున్నా లెక్కలు లేవని, మేక్ ఇన్ ఇండియాలో కుల వృతులను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అన్ని కమిషన్లు కుల గణన చేయాలని చెప్పిన ప్రభుత్వాలు గణన చేయలేదని తెలిపారు.

ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంటే అడ్డు పడుతున్నారని, సమగ్ర సర్వే చేసిన లెక్కలు బయట పెట్టలేదని, సోషియో ఎకనామిక్ సర్వే చేసిన బయట పెట్టలేదని ప్రొఫెసర్ మురళి మనోహర్ గుర్తుచేశారు. అభివృద్ధికి కొన్ని కులాలు చాలా దూరంగా ఉన్నాయని, ఒకప్పుడు కుల గణనను ఒప్పుకుని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.

ప్రొఫెసర్ సింహాద్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కుల గణనపై చర్చ జరుగుతోందని, జనాభా లెక్కలు వల్ల ఎన్నో అంశాలు బయటకు వస్తాయని తెలిపారు. కుల గణనలో కులం ప్రత్యేకమైందని, 2024 ఎన్నికల్లో గణన చేస్తామని ఇండియా కూటమి ప్రకటించిందని గుర్తుచేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారని, బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్ధం కావట్లేదని విస్మయం వ్యక్తం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక  కుల గణన చేయడాన్ని స్వాగతిస్తున్నామని ప్రొఫెసర్ చెప్పారు. బీహార్లో గణనకు మద్దతు ఇచ్చిన బీజేపీ ఇక్కడ ఎందుకు వ్యతిరేకిస్తుందని ప్రశ్నించారు. ఎన్యుమరేటర్లు వస్తే అడ్డుకుంటున్నారని, ఇది కరెక్టు కాదని చెప్పారు.

అంబేద్కర్ ఇచ్చిన  రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా సమానత్వాన్ని చాటుతూ గణన జరగడం మంచి పరిణామమని, రాజకీయ పార్టీలు కుల గణనను అడ్డుకోవడం దురదృష్టకరమని ప్రొఫెసర్ సింహాద్రి వ్యాఖ్యానించారు. సంపన్న కుటుంబాలే ఈ గణనను అడ్డుకుంటున్నాయని, సర్వేను వ్యతికేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ తీరును ప్రొఫెసర్ ఖండించారు. కుల గణనకు అందరూ మద్దతు ఇచ్చి సహకారాన్ని అందించాలని ఆయన కోరారు.