
మొత్తం 1558 పోస్టుల్లో మల్టీటాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ (గ్రూప్-సి నాన్ గెజిటెడ్ నాన్-మినిస్టీరియల్) 1198 ఖాళీలు, హవల్దార్ (గ్రూప్-సి, నాన్ మినిస్టీరియల్) 360 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తుదారులు పదో తరగతి పరీక్ష పాసవ్వాలి. వయసు 1 ఆగస్టు 2023 నాటికి పోస్టును అనుసరించి 18-నుంచి 25 సంవత్సరాలు, 18 నుంచి -27 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ట వయసులో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పది నుంచి పదిహేనేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో రూ. 100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిళలు ఫీజు చెల్లించనవసరం లేదు.
జీతం: హవల్దార్ పోస్టుకు లెవెల్-1, ఏడో పే కమిషన్ ప్రకారం మూలవేతనం రూ.18,000 ఉంటుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ అన్నీ కలిపి రూ.31,000 వేతనం వరకూ అందుకోవచ్చు. ఎంటీఎస్ అభ్యర్థులకు వేతనం రూ.35,000 వరకూ ఉంటుంది. అయితే పనిచేసే ప్రాంతాన్ని బట్టి వేతనంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. పెన్షన్ స్కీమ్, శాలరీ ఎరియర్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, వ్యక్తిగత, కుటుంబానికి మెడికల్ ఇన్సూరెన్స్.. మొదలైన సౌకర్యాలూ ఉంటాయి.
సెలెక్షన్ ప్రాసెస్: ఎంటీఎస్ పోస్టులకు అభ్యర్థులను సెషన్-1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. హవల్దార్ పోస్టుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షను హిందీ, ఇంగ్లీష్‌తోపాటు తమిళ్, తెలుగు, ఉర్దూ లాంటి 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు.
సీబీటీ ఎగ్జామ్: కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు సెషన్లు ఉంటాయి. సెషన్-1లో న్యూమరికల్ అండ్ మేథమెటికల్ ఎబిలిటీకి 20 ప్రశ్నలు (60 మార్కులు). రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్‌కు 20 ప్రశ్నలు (60 మార్కులు). వ్యవధి 45 నిమిషాలు. సెషన్-2లో జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు (75 మార్కులు), ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 25 ప్రశ్నలు (75 మార్కులు). వ్యవధి 45 నిమిషాలు. రెండు సెషన్లనూ ఒకేరోజున నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండూ రాయాలి. ఏ ఒక్కటి రాయకపోయినా అనర్హులుగా ప్రకటిస్తారు. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు ఉంటుంది.
ఎగ్జామ్ రూల్స్: సెషన్-1లో నెగెటివ్ మార్కులు ఉండవు. సెషన్-2లో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు. ఎంటీఎస్ పోస్టుకు సెషన్-1లో పాసయితేనే సెషన్-2లోని మార్కులు లెక్కిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే అన్‌రిజర్వుడ్ అభ్యర్థులు 30 శాతం, ఓబీఎస్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 25 శాతం, ఇతర కేటగిరీల అభ్యర్థులు 20 శాతం మార్కులు సంపాదించాలి. సెషన్-2లో సాధించిన మార్కుల ఆధారంగానే ఎంటీఎస్ అభ్యర్థుల షార్ట్‌లిస్టు చేస్తారు. హవల్దార్ పోస్టుకు అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ)కు హాజరుకావాలి.
సిలబస్ : జనరల్ అవేర్‌నెస్: హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్-కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రం పదోతరగతి స్థాయిలో ఉంటుంది.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్: దీంట్లోని ప్రశ్నలు అభ్యర్థి ఇంగ్లీష్ భాషా ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఉంటాయి. ఒకాబ్యులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటానిమ్స్‌ను సరిగా ఉపయోగించడం, పేరాగ్రాఫ్ ఇచ్చి ప్రశ్నలకు సమాధానాలు రాయమనడం.. మొదలైనవి ఉంటాయి.
న్యూమరికల్ మేథమెటికల్ ఎబిలిటీ: ఇంటిజర్స్ అండ్ హోల్ నంబర్స్, ఎల్‌సీఎం-హెచ్‌సీఎఫ్, డెసిమల్స్-ఫ్రాక్షన్స్, రిలేషన్‌షిప్ బిట్వీన్ నంబర్స్, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, బాడ్‌మాస్, పర్సంటేజ్, రేషియో- ప్రపోర్షన్స్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ -లాస్, డిస్కాంట్, బేసిక్
జామెట్రీ ఫిగర్స్, డిస్టెన్స్-టైమ్, లైన్స్-యాంగిల్స్, ఇంటర్‌ప్రెటేషన్ ఆఫ్ సింపుల్ గ్రాఫ్స్ ఆన్ డేటా, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ మొదలైన అంశాలుంటాయి.
రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్: దీంట్లోని ప్రశ్నలు అభ్యర్థుల అవగాహన సామర్థ్యాన్నీ, తార్కికంగా ఆలోచించే నైపుణ్యాన్నీ పరీక్షించేలా ఉంటాయి. ఆల్ఫా-న్యూమరిక్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్, ఫాలోయింగ్ డైరెక్షన్స్, సిమిలారిటీస్-డిఫరెన్సెస్, జంబ్లింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎనాలిసిస్, నాన్-వెర్బల్ రీజనింగ్ బేస్డ్ ఆన్ డయాగ్రమ్స్, ఏజ్, కాలిక్యులేషన్స్, క్యాలెండర్-క్లాక్ మొదలైనవి.
ప్రిపరేషన్ ప్లాన్: పరీక్షకు హాజరయ్యేలోగా అందుబాటులో ఉన్న సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రణాళిక ప్రకారం ఏయే అంశాలకు ఎంత సమయాన్ని కేటాయించాలనేది టైమ్‌టేబుల్ వేసుకోవాలి. ఒక్కో సబ్జెక్టుకు నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవాలి. ప్రశ్నపత్రంలో అన్నీ తెలిసినవే ఉన్నప్పటికీ వాటిని సకాలంలో పూర్తిచేయలేకపోవచ్చు. ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే నిర్దిష్ట సమయంలోనే ఆన్సర్ చేయవచ్చు. హవల్దార్ పోస్టుకు పోటీపడే అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. కాబట్టి వేగంగా నడవడాన్ని ప్రతిరోజూ సాధన చేయాలి.