ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం రాబోతున్నది: భట్టి

  • తనను నాలుగో సారి ఆశీర్వదించాలని వినతి

మధిర, వెలుగు : ‘‘ఖమ్మం బిడ్డ జలగం వెంగళరావు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాకు బీపీఎల్, స్పాంజ్ ఐరన్ కంపెనీ, హెవీ వాటర్ ప్లాంట్ సహా అనేక పరిశ్రమలు ఇచ్చింది. మళ్లీ అలాంటి చాన్స్ ఖమ్మం జిల్లాకు రాబోతున్నది. మధిర బిడ్డగా నన్ను మీరు ఆశీర్వదించి గెలిపిస్తే అలాంటి అభివృద్ధిని ఖమ్మంకు తీసుకువస్తాను’’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మధిరలో గురువారం ఏర్పాటు చేసిన సభలో ప్రజలను కార్యకర్తలను, ఉద్దేశించి భట్టి విక్రమార్క ప్రసంగించారు.

ఆరోజుల్లో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా జలగం వెంగళరావు ఉన్నందున నాగార్జునసాగర్ నీళ్లు ఖమ్మం జిల్లాకు రావడం సాధ్యమైందన్నారు‌‌‌‌. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నాగార్జునసాగర్​ను కాంగ్రెస్ హయాంలో నిర్మించినందునే మధిర ప్రజలు ఇప్పుడు ఐదు వేళ్లతో అన్నం తింటున్నారని అన్నారు.