లోక్​సభలో నీట్ హీట్​..చర్చకు విపక్షాల పట్టు

లోక్​సభలో నీట్ హీట్​..చర్చకు విపక్షాల పట్టు
  •     రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలోనే చర్చిద్దామన్న పాలక వర్గం
  •     తన మైక్​ కట్​ చేశారన్న రాహుల్​, కట్​ చేసే సిస్టమే లేదన్న స్పీకర్​
  •     రాజ్యసభలో వెల్​లోకి దూసుకొచ్చిన ప్రతిపక్ష నేత ఖర్గే, ఇతర సభ్యులు
  •     చైర్మన్ జగదీప్​ ధన్​ఖడ్​, ఏఐసీసీ చీఫ్​ మధ్య మాటల యుద్ధం
  •     పలుమార్లు సభ వాయిదా వేసిన చైర్మన్​
  •     వాకౌట్​ చేసిన ప్రతిపక్షం

న్యూఢిల్లీ: నీట్ ఎగ్జాంలో అవకతవకల అంశంపై లోక్​సభ దద్దరిల్లింది. శుక్రవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే నీట్ అంశంపై చర్చను చేపట్టాలంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. అయితే, సభా సంప్రదాయం ప్రకారం.. ముందుగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చిద్దామంటూ పాలక ఎన్డీయే పక్షం స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వెల్ లోకి దూసుకెళ్లి నిరసనలు తెలిపారు. చివరకు తీవ్ర గందరగోళం మధ్య సభ సోమవారానికి వాయిదా పడింది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో గురువారం ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేయగా.. శుక్రవారం ఉదయం 11 గంటలకు లోక్ సభ ప్రారంభం కాగానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. అయితే, అన్ని ప్రొసీడింగ్స్​ను పక్కన పెట్టి నీట్ యూజీ, యూజీసీ నెట్ పేపర్ లీకేజీల అంశంపై మాత్రమే చర్చించాలంటూ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా దీనికోసమే పట్టుబట్టారు. ధన్యవాద తీర్మానంపై చర్చలోనే ఈ అంశాలన్నింటినీ చర్చిద్దామని, ఎగ్జాంలపై ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం ఇచ్చేందుకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు స్పష్టం చేశారు.

నీట్ పేపర్ లీక్ పై 22 నోటీసులు.. 

నీట్ పేపర్ లీక్ కేసు అంశంపై తనకు 22 నోటీసులు అందాయని స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. నీట్ ఎగ్జాంలో అవకతవకలపై హైలెవల్ ఎంక్వైరీ చేయిస్తామని రాష్ట్రపతి తన ప్రసంగంలో తెలిపారని అన్నారు. ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు,
ఆపై సోమవారానికి వాయిదా వేశారు. 

తన మైక్ ఆఫ్​ చేశారన్న రాహుల్​.. అలాంటిదేంలేదని స్పీకర్​ వివరణ

లోక్ సభలో మాట్లాడుతుండగా తన మైక్ ఆఫ్​ చేశారని, దానిని ఆన్ చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. ‘‘మైక్రోఫోన్​ను స్విచ్ ఆఫ్ చేసేందుకు నా వద్ద ఎలాంటి బటన్ లేదు.  ఇప్పుడు మైక్ లను కట్ చేసే మెకానిజం సభలో లేదు”అని తెలిపారు. వీరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘‘నీట్​పై ప్రధాని మోదీ సైలెంట్​గా ఉంటే.. రాహుల్ గాంధీ మాత్రమే యువత కోసం సభలో గళమెత్తారు” అని పేర్కొంది. 

సభా మర్యాదను కాపాడరా?: రిజిజు

పార్లమెంట్​లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ తర్వాతే ఇతర ప్రొసీడింగ్స్ జరగడం సంప్రదాయంగా వస్తోందని, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు దీనిని ఉల్లంఘిస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మండిపడ్డారు. శుక్రవారం పార్లమెంట్ కాంప్లెక్స్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఏ అంశంపై చర్చించేందుకైనా ప్రభుత్వం సిద్ధం. కానీ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అన్నీ పక్కనపెట్టాలని పట్టుబట్టడం సరికాదు” అని అన్నారు.

ఫస్ట్ ‘నీట్’పై చర్చించాలె: రాహుల్

దేశ యువత భవిష్యత్తుకు సంబంధించిన నీట్ ఎగ్జాం అంశంపైనే మొదట చర్చ జరగాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. శుక్రవారం పార్లమెంట్ కాంప్లెక్స్​లో మీడియాతో మాట్లాడారు. ‘‘నేడు నీట్ అత్యంత ముఖ్యమైన అంశం. ముందుగా దీనిపైనే చర్చించాలని ప్రతిపక్షాలన్నీ నిర్ణయించాయి. సభలో అర్థవంతమైన చర్చ జరిపి, యువతకు మంచి సందేశం పంపాలని ప్రధానిని కోరుతున్నా” అని ఆయన తెలిపారు.