రాష్ట్రపతి ముర్ముకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ

రాష్ట్రపతి ముర్ముకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ

న్యూఢిల్లీ: బెంగాల్‎లో న్యాయంగా ఎంపికైన స్కూల్ టీచర్లు, నాన్​టీచింగ్ సిబ్బంది ఉద్యోగాల్లో కొనసాగించేలా అనుమతించే విషయంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము జోక్యం చేసుకోవాలని లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు.  సుప్రీం తీర్పుతో పశ్చిమ బెంగాల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో వేలాది మంది అర్హత కలిగిన టీచర్లు ఉన్నారని తెలిపారు. వారి విషయంలో జోక్యం చేసుకోవాలని ముర్మును అభ్యర్థిస్తూ మంగళవారం ‘ఎక్స్’లో పోస్ట్​ చేశారు. 

అలాగే ఈ అంశంపై బాధిత ఉపాధ్యాయుల వేదిక అయిన శిక్షక్ శిక్షికా అధికార్ మంచా ప్రతినిధి బృందం తనను కలిసి మీకు లేఖ రాయమని అభ్యర్థించిందని పేర్కొన్నారు. ఆ మేరకు ఈ నెల 7న రాష్ట్రపతికి రాసిన లేఖను కూడా ఎక్స్​లో పోస్ట్ చేశారు. ఎంపికైన అభ్యర్థులంతా కళంకితులు కాదని, న్యాయమైన మార్గాల ద్వారా చాలా మంది ఎంపికయ్యారని, కొందరు మాత్రం తప్పుడు, అన్యాయమైన మార్గంలో ఎంపికయ్యారని తెలిపారు. 

‘‘నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలను తీవ్రంగా ఖండించాలి, నేరస్థులను శిక్షించాలి. అయితే న్యాయంగా ఎంపికైన వారిని తప్పుడు మార్గంలో ఎంపికైన వారితో సమానంగా శిక్షించడం తీవ్రమైన అన్యాయం” అని పేర్కొన్నారు. ఈ టీచర్లంతా పదేండ్లు పని చేశారని ఇప్పుడు వారిని తొలగించడం వల్ల లక్షల మంది విద్యార్థులకు సడెన్‎గా టీచర్లు  లేకుండా పోతారని వారి చదువులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఒక గురువుగా పనిచేసిన మీరు న్యాయంగా ఎంపికైన టీచర్లు, వారి కుటుంబాలు, అలాగే విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని, వారి మనోవేదనను అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్టు తెలిపారు.