ముఖ్యమంత్రి కేసీఆర్ టూర్ నేపథ్యంలో పలు జిల్లాలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. కేసీఆర్ టూర్ లో ఆందోళనలు, నిరసనలు చేస్తారనే కారణంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పోలీసుల అదుపులోకి తీసుకుంటున్నారు.
కేసీఆర్ పర్యటన నేపథ్యంలో..
* మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో నాయకుల ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తొర్రూరు, పెద్దవంగర మండలాల్లోని బీజేపీ, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
* మహబూబాబాద్ జిల్లా మరిపెడలోనూ కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం నాయకులు, అంగన్ వాడీ కార్యకర్తలను సైతం ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. మహబుబాబాద్, కేసముద్రం, నెళ్లికుదురు మండలాల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులను అరెస్టు చేశారు.
* డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ ఎంఎల్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు.
* జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి, టేకుమట్ల, చిట్యాల మండలంలోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
పంటల పరిశీలనకు కేసీఆర్
రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించనున్నారు. మార్చి 23వ తేదీన ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. వర్షాలతో నష్టపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు.. భారీ బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు.
షెడ్యూల్ ఇదే..
మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాకు వెళ్లి అక్కడి పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. 12 గంటల 55 నిమిషాలకు నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని దుగ్గొండి మండలం అడవిరంగాపూర్ వద్ద నష్టపోయిన పంటలను పరిశీలించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతిరాథోడ్, నర్సంపేట MLA పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలిస్తున్నారు.