బెంగళూరులో ప్రతిపక్ష నేతలు..నేడు కూటమిపై చర్చ

 

  • బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహాలు
  • 26 పార్టీల లీడర్లతో సోనియా సమావేశం
  • యూపీఏ పేరు మార్చాలన్న డిమాండ్​పై కసరత్తు
  • లోక్​సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
  • సీట్ల పంపకాల వేదిక కాదంటున్న నేతలు

బెంగళూరు: కేంద్రంలో బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా బెంగళూరులో ప్రతిపక్ష లీడర్లు భేటీ అయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ భేటీ.. సోమవారం సాయంత్రం ఓ ప్రైవేట్ హోటల్​లో ప్రారంభమైంది. మొత్తం 26 పార్టీల లీడర్లు ఈ మీటింగ్​కు అటెండ్ అవుతున్నారు. అయితే, ఇప్పటికే కొంత మంది బెంగళూరుకు చేరుకోగా.. మరికొందరు మంగళవారం జరిగే ప్రధాన భేటీకి హాజరుకానున్నారు. సోమవారం బెంగళూరుకు చేరుకున్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సీనియర్‌‌‌‌ లీడర్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలు పార్టీల నేతలకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఘన స్వాగతం పలికారు. ఖర్గే, సోనియా ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో.. రాబోయే లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చిస్తారు. యూపీఏ పేరును మార్చాలన్న ప్రతిపక్షాల డిమాండ్​పైనా డిస్కస్ చేస్తారు. 

మరిన్ని రాజకీయ అంశాలపై చర్చకు ఆస్కారం

సోమవారం సాయంత్రం సోనియా అధ్యక్షతన అనధికారిక సమావేశం జరిగింది. మంగళవారం భేటీకి సంబంధించిన ఎజెండా అంశాలను రూపొందించినట్లు సమాచారం. ఫ్రంట్ పేరు, రాబోయే కాలానికి సంబంధించిన రోడ్​మ్యాప్​ను మంగళవారం రూపొందించే అవకాశాలున్నాయని తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై కూడా చర్చించి వ్యూహాన్ని రూపొందించే చాన్స్ ఉందన్నారు. మణిపూర్​లో హింస, బాలాసోర్ రైలు ప్రమాదం, గవర్నర్ల పాత్ర వంటి కీలక అంశాలపై చర్చిస్తారని వివరించారు. సీట్ల పంపకాల ఒప్పందంపై చర్చించడానికి ఈ భేటీ సరైన వేదిక కాదని పలువురు ప్రతిపక్ష నాయకులు స్పష్టం చేస్తున్నారు. తర్వాత సోనియా ఇచ్చిన విందులో లీడర్లందరూ పాల్గొన్నారు.
 
అవినీతిపై పోరాటం: సిద్ధరామయ్య

నిరంకుశత్వం, మతతత్వం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు దేశంలోని ప్రతిపక్షాలను హృదయపూర్వకంగా కర్నాటకకు స్వాగతిస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య అన్నారు. కాగా, ప్రతిపక్షాల మీటింగ్​కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం మధ్యాహ్నమే బెంగళూరు చేరుకున్నారు. మరోవైపు, ప్రతిపక్షాలన్నీ భేటీ అవుతున్న టైంలోనే సీపీఎం సీనియర్ లీడర్ సీతారాం ఏచూరి తృణమూల్ కాంగ్రెస్​ను ఉద్దేశిస్తూ కీలక కామెంట్లు చేశారు. బెంగాల్​లో టీఎంసీతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారు. 

ALSO READ:మంత్రి హరీశ్ ను కలిసిన కాంట్రాక్ట్ ​ల్యాబ్ టెక్నీషియన్లను 

ఫస్ట్​ డే మీటింగ్​కు శరద్ పవార్ డుమ్మా

సోమవారం మీటింగ్​కు ఎన్సీపీ చీఫ్ శరద్​పవార్ అటెండ్ కాలేదు. మంగళవారం మీటింగ్​కు వస్తారని ఖర్గే తెలిపారు. సోమవారం మీటింగ్​కు బీహార్ సీఎం నితీశ్ ​కుమార్, ఆప్ తరఫున సీఎం కేజ్రీవాల్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా అటెండ్ అయ్యారు. ఆర్జేడీ చీఫ్ లాలూ, తేజస్వీ యాదవ్ ​కూడా 
హాజరయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్లు ఓమర్ అబ్దుల్లా, ఫరూఖ్ అబ్దుల్లా, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, తమిళనాడు సీఎం స్టాలిన్, పీడీపీ చీఫ్ ముఫ్తీ, ఆర్​ఎల్​డీ చీఫ్ జయంత్ చౌదరితో పాటు మరిన్ని ప్రాంతీయ పార్టీల లీడర్లు అటెండ్ అయ్యారు. 

ప్రజలే బుద్ధి చెబుతారు : జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్

ప్రతిపక్షాల భేటీ సందర్భంగా సోమవారం బెంగళూరులో నిర్వహించిన జాయింట్ ప్రెస్​మీట్​లో కాంగ్రెస్ లీడర్లు జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. ప్రతిపక్షాల ఐక్యత ఇండియన్ పాలిటిక్స్ హిస్టరీలో గేమ్ చేంజర్ అన్నారు. ‘‘మేము సమావేశం అవుతున్నామనే మోదీకి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు గుర్తుకొచ్చాయి. పాలనలో పూర్తిగా విఫలమైన బీజేపీకి ప్రజలే  బుద్ధి చెబుతారు” అని విమర్శించారు. 

 మోదీ భయపడుతున్నారు: ఖర్గే

ప్రతిపక్షాలు సమావేశమవుతుంటే బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. అపోజిషన్​ను ఎదుర్కొనేందుకు తానే సరిపోతానని మోదీ చెప్పార ని, అలాంటప్పుడు 30 పార్టీలను ఏకతాటిపైకి తేవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఎన్డీయే భాగస్వామ్య పార్టీ ల భేటీని ఉద్దేశిస్తూ ఖర్గే విమర్శించారు.