దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే.. ప్రభుత్వం ఏంచేసినా సపోర్టు చేస్తం

దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే.. ప్రభుత్వం ఏంచేసినా సపోర్టు చేస్తం

న్యూఢిల్లీ: పహల్గాంలో పర్యాటకులను కాల్చి చంపినందుకు టెర్రర్ క్యాంపులన్నింటినీ తుడిచిపెట్టేయాలని, ముష్కరులపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతిపక్ష నేతలతో కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ రాహుల్గాంధీ, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, టీఎంసీ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ, ఎన్సీపీ (శరద్  పవార్  వర్గం) నుంచి సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్, మజ్లిస్  పార్టీ ఎంపీ అసదుద్దీన్  ఒవైసీ, బీజేడీ లీడర్ సంశిత్ పాత్ర, టీడీపీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు, శివసేన నుంచి శ్రీకాంత్ షిండే, ఆర్జేడీ నుంచి ప్రేమ్ చంద్  గుప్తా, డీఎంకే నుంచి శివ, ఎస్పీ నుంచి రామ్ గోపాల్  యాదవ్  ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

కేంద్ర ప్రభుత్వం నుంచి రక్షణ మంత్రి రాజ్ నాథ్  సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, హోం మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు  నిర్మలా సీతారామన్, నడ్డా, కిరణ్​ రిజిజు పాల్గొన్నారు. సమావేశానికి ముందు లీడర్లందరూ పహల్గాంలో ముష్కరుల చేతిలో చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం మౌనం పాటించారు. టెర్రరిస్టుల చర్యను పార్టీలకు అతీతంగా నేతలు ఖండించారు.

మీటింగ్ అయిపోయాక మీడియాతో లీడర్లు మాట్లాడారు. దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందేనని అన్నారు. కేంద్రం ఏ చర్యలు తీసుకున్నా సపోర్టు చేస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో ప్రతిపక్షం తరపున కేంద్రానికి అండగా ఉంటామని చెప్పారు. కాగా.. భద్రతా వైఫల్యం జరిగిందని, పహల్గాం ఘటనలో సెక్యూరిటీ ల్యాప్స్ నిజమే అని అఖిలపక్ష సమావేశంలో  కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.