భారతీయులకు సంకెళ్లు వేసిన విశ్వ గురువు ఎందుకు మాట్లాడట్లే..? ప్రతిపక్ష ఎంపీలు

భారతీయులకు సంకెళ్లు వేసిన విశ్వ గురువు ఎందుకు మాట్లాడట్లే..? ప్రతిపక్ష ఎంపీలు
  • ఇండియన్స్​ తరలింపులో అమెరికా అమానవీయ చర్యపై 
  • విశ్వ గురువు ఎందుకు మాట్లాడడం లేదు
  • ప్రతిపక్ష ఎంపీల ఫైర్​.. పార్లమెంట్​ ఎదుట చేతులకు బేడీలతో నిరసన 
  • ఆందోళనలో పాల్గొన్న ఖర్గే, రాహుల్, అఖిలేశ్, ఎంపీలు​ 
  • తెలంగాణ నుంచి పాల్గొన్న ఎంపీలు వంశీ, చామల, అనిల్, రఘురామి రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ఇండియన్స్​పట్ల అమెరికా వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష ఎంపీలు మండిపడ్డారు. దేశ పౌరుల చేతికి సంకెళ్లు వేసి పంపినా మౌనంగానే ఉంటారా..? అని కేంద్రంపై ఫైర్​అయ్యారు. గురువారం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మకర ద్వార్ వద్ద చేతులకు బేడీలు వేసుకొని ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్​ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, గౌరవ్ గొగోయ్, ఇతర ఎంపీలు పాల్గొన్నారు.  తెలంగాణ నుంచి ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామి రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. విశ్వ గురువుగా చెప్పుకునే ఆయన (ప్రధాని మోదీ) ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ‘అమెరికా ప్రెసిడెంట్​ట్రంప్, భారత ప్రధాని మోదీ చాలా మంచి స్నేహితులని అంటారు. మరి ఇలాంటి సందర్భంలో ఎందుకు ట్రంప్‎తో మాట్లాడలేదు. మనవాళ్లను తీసుకురావడానికి ఒక విమానం పంపలేమా..? మనుషులతో ఇలాగే ప్రవర్తిస్తారా..? ’’ అని నిలదీశారు. దీనిపై విదేశాంగ శాఖ మంత్రి, ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

కేంద్రం ఎందుకు స్పందించలే: అఖిలేశ్​యాదవ్​

భారత్‎ను విశ్వ గురువుగా మార్చాలనే కలను చూపిస్తున్న వారు ఇప్పుడెందుకు స్పందించడం లేదని ప్రధాని మోదీని పరోక్షంగా అఖిలేశ్​యాదవ్​ విమర్శించారు. దేశ పౌరులకు బానిసల తరహాలో బేడీలు వేసి, అమానవీయ పరిస్థితుల్లో బహిష్కరించడం సరికాదని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నుంచి పిల్లలను, మహిళలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. మనవాళ్లను బహిష్కరిస్తున్నారని ముందుగానే తెలిసినప్పుడు..  భారత సర్కారు ఎందుకు స్పందించలేకపోయిందని కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఔజ్లా మండిపడ్డారు. 

అంతకుముందు అమెరికా నుంచి అమానవీయంగా భారతీయుల్ని బహిష్కరించడంపై చర్చకు పట్టుబడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. దేశ ప్రజల్ని మరింత అమానవీయంగా మార్చకుండా, స్వదేశంలో, -విదేశాల్లో  ప్రతి భారతీయుడి గౌరవాన్ని నిలబెట్టేందుకు ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని తీర్మానంలో పొందుపరిచారు. 

మోదీ మౌనం బాధాకరం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

భారతీయులను అవమానకరంగా సంకెళ్లతో బంధించి, సైనిక విమానంలో పంపడం ఘోరమని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ మౌనంగా ఉండడం బాధాకరమని వ్యాఖ్యానించారు. చేతికి సంకెళ్లు వేసుకొని వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వారికి మరో రూపంలో అవకాశం కల్పించేదాకా పోరాడుతామని భరోసా చెప్పారు. ఈ ఘటనతోపాటు భవిష్యత్తులో ఇలాంటి అవమానకర పరిస్థితులు రాకుండా కేంద్రం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.