లోక్ సభలో గందరగోళం.. కుంభమేళా తొక్కిసలాటపై చర్చకు విపక్షాల పట్టు

లోక్ సభలో గందరగోళం.. కుంభమేళా తొక్కిసలాటపై చర్చకు విపక్షాల పట్టు

న్యూఢిల్లీ: లోక్ సభలో ప్రతిపక్ష ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. మూడో రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే  విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఇటీవల కుంభమేళాలో జరిగిన తొక్కి సలాటపై సభలో చర్చ పెట్టాలని విపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. తొక్కిసలాటలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటే.. యూపీ ప్రభుత్వం తక్కువగా చూపిస్తోందని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష సభ్యులతో ఆందోళనతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ విపక్ష ఎంపీలను వారించారు. సభ కార్యాకలాపాలకు ఆటంకం కలిగించొద్దని.. సభ్యులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చొవాలని స్పీకర్ కోరారు. అయినప్పటికీ విపక్ష ఎంపీలు అలాగే నిరసన కంటిన్యూ చేశారు. ప్రతిపక్ష ఎంపీల ఆందోళనల నడుమే సభ కొనసాగుతోంది. 

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‎రాజ్‎లో అట్టహాసంగా జరుగుతోన్న మహా కుంభమేళాలో 2025, జనవరి 29న తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. మౌని అమావాస్య కావడంతో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో భక్తుల మధ్య తొక్కి సలాట జరిగింది. ఈ విషాద ఘటనలో 30 మంది భక్తులు మృతి చెందగా.. మరో 60 మంది గాయపడ్డట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. 

ALSO READ : ఢిల్లీ ఎన్నికల్లో సీఎంల జోరు.. ఆయా పార్టీల తరఫున హోరాహోరీ ప్రచారం

అయితే.. ఈ తొక్కి సలాటలో మరణాల సంఖ్య 30 కంటే ఎక్కువే ఉందని.. యూపీ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీఐపీల మీద దృష్టి పెట్టి సామాన్య భక్తులకు సరైన వసతులు కల్పించకపోవడంతోనే ఈ తొక్కి సలాట జరిగిందని.. దీనిపై లోక్ సభలో చర్చ పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.