జమిలి ఎన్నికల ఆలోచన కరెక్ట్ కాదు.. అది రాజ్యాంగంపై దాడే..జేపీసీలోప్రతిపక్ష ఎంపీలు

జమిలి ఎన్నికల ఆలోచన కరెక్ట్ కాదు.. అది రాజ్యాంగంపై దాడే..జేపీసీలోప్రతిపక్ష ఎంపీలు
  • అలాంటి ఎన్నికలతో సమాఖ్య వ్యవస్థకు ముప్పు
  • జేపీసీ భేటీలో ప్రతిపక్ష ఎంపీల ఆందోళన.. రాజ్యాంగ సవరణ బిల్లును సమర్థించిన అధికార ఎంపీలు

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల ఆలోచన కరెక్టు కాదని, ఆ ఎన్నికలు నిర్వహిస్తే రాజ్యాంగం దాడిచేసినట్లేని ప్రతిపక్ష ఎంపీలు అన్నారు. అలాంటి ఎన్నికలతో సమాఖ్య వ్యవస్థకు ముప్పు కలుగుతుందని, అంతేకాకుండా రాజ్యాంగ నిర్మాణం సైతం దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 

జమిలి ఎన్నికల కోసం లోక్ సభలో ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టం సవరణ బిల్లుపై 39 మంది ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్  పార్లమెంటు కమిటీ (జేపీసీ) భేటీ బుధవారం ఢిల్లీలో జరిగింది. 

ఈ సమావేశానికి అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జమిలి ఎన్నికలపై ప్రతిపక్ష ఎంపీలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికలతో ఖర్చు ఎలా తగ్గుతుందని కాంగ్రెస్  ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు ఎంపీలు ప్రశ్నించారు.

 2004 లోక్ సభ ఎన్నికల్లో మొదటిసారిగా 543 సీట్లలో ఈవీఎంలు ఉపయోగించారని, దానితో ఏమన్నా ఖర్చు తగ్గిందా అని ప్రతిపక్ష ఎంపీలు అడిగారు. ఖర్చు తగ్గితే దానికి సంబంధించి ఏమన్నా అంచనాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. 

ఆ రెండు సవరణ బిల్లులు రాజ్యాంగానికి వ్యతిరేకం అని కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఖర్చు తగ్గించడం కన్నా ప్రజల ప్రజాస్వామ్య హక్కును కాపాడడం ముఖ్యమని పేర్కొన్నారు. ఆ రెండు బిల్లులపై అధ్యయనానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలని కోరారు.

ప్రాంతీయ పార్టీలకు నష్టమే

జమిలి ఎన్నికల ఆలోచనను సమర్థించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సైతం ఆ రెండు బిల్లులపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు నష్టం కలుగుతుందని, అంతేకాకుండా స్థానిక సమస్యలు సైతం పక్కకు తొలగిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికైన ప్రతినిధులు ఓటర్ల మధ్య ఉండే అవసరాన్ని సైతం జమిలి ఎన్నికలు తగ్గిస్తాయన్నారు. 

చివరికి రెండు, మూడు జాతీయ పార్టీల మధ్య పోరాటంగా మారుతుందన్నారు. ఈవీఎంల స్థానంలో మళ్లీ బ్యాలెట్ పేపర్లు తీసుకురావాలని ఆయన డిమాండ్  చేశారు. కాగా.. ఆ 2 సవరణ బిల్లులను అధికార బీజేపీ ఎంపీలు సమర్థించారు. 

జమిలి ఎన్నికలతో ఖర్చు భారీగా తగ్గుతుందన్నారు. ‘‘దేశంలో ఏటా ఎక్కడో ఒకచోట అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతోంది. 

ఖజానాపై భారం కూడా పెరుగుతున్నది. జమిలి ఎన్నికలతో ఎక్కడా అభివృద్ధి పనులకు ఆటంకం కలగుదు. అంతేకాకుండా దేశాభివృద్ధి సైతం దూసుకుపోతుంది” అని శివసేన (షిండే వర్గం) ఎంపీ శ్రీకాంత్  షిండే అన్నారు.