ఇంత జరుగుతున్నా మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు?

ఇంత జరుగుతున్నా మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు?

న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల జరిగిన విద్వేష ప్రసంగాలు, అల్లర్లు, హింసపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించాయి. దేశంలో జరుగుతున్న అల్లర్లపై శనివారం 13 ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇందులో కాంగ్రెస్‌‌‌‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్‌‌‌‌ శరద్‌‌‌‌ పవార్‌‌‌‌‌‌‌‌, పశ్చిమబెంగాల్‌‌‌‌ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌‌‌‌, జార్ఖండ్‌‌‌‌ సీఎం హేమంత్‌‌‌‌ సొరెన్‌‌‌‌ తదితరులు ఉన్నారు. కాగా, ప్రజలు, దేశంలోని రాజకీయ పార్టీలు శాంతి, సామరస్యాన్ని కాపాడాలని కోరారు. ప్రజలు తినే తిండి, వేసుకునే బట్టలు, నమ్మకాలు/విశ్వాసాలు, పండుగలు, భాషకు సంబంధించిన సమస్యలపై కూడా వారు ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో మతోన్మాదాన్ని ప్రచారం చేస్తున్న వారికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. ఇలాంటి ప్రైవేట్‌‌‌‌ సాయుధ గుంపులను కొంతమంది ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. శతాబ్దాలుగా సామాజిక సామరస్యానికి నిర్వచనంగా ఉన్న మన దేశాన్ని మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమాజంలో విభజనను పెంచడానికి ప్రయత్నిస్తున్న వారిని ఎదుర్కోవడానికి నిబద్ధతతో పనిచేయనున్నట్లు వారు తేల్చిచెప్పారు.