ప్రతిపక్షాలది రాద్ధాంతం

ప్రతిపక్షాలది రాద్ధాంతం
  • మూసీ నిర్వాసితులను అన్నివిధాలా ఆదుకుంటం: మంత్రి పొన్నం
  • డబుల్​బెడ్రూంతోపాటు మెప్మా ద్వారా సెల్ఫ్​ ఎంప్లాయ్​మెంట్ కల్పిస్తం 
  • సోషల్​ మీడియాలో వచ్చే పుకార్లను ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి

సిద్దిపేట/జనగామ, వెలుగు: మూసీ నిర్వాసితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్​గౌడ్​భరోసా ఇచ్చారు. వారికి డబుల్​బెడ్​రూం ఇండ్లతోపాటు ఉపాధి  అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటే.. ప్రతిపక్షాలు మాత్రం రాజకీయం చేస్తూ వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నాయని ఫైర్​అయ్యారు. ఆదివారం సిద్దిపేటలో పొన్నం ప్రభాకర్​ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూసీ రివర్ ఫ్రంట్​పై సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. మూసీ నదికి ఇరువైపులా నివాసం ఏర్పరచుకున్న వారిని బలవంతంగా ఖాళీ చేయించడం లేదని, అలాంటి ప్రచారాలు  చేయడం సరికాదని అన్నారు.

మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరుతో పాటు మెప్మా ఆధ్వర్యంలో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. మూసీ నిర్వాసితుల పట్ల ప్రతిపక్షాలు, హరీశ్​రావులాంటి నాయకులు రాజకీయం చేస్తున్నారని, అది మంచి పద్ధతికాదని హితవు పలికారు. తెలంగాణకు హైదారాబాద్  గుండెకాయలాంటిదని, అక్కడ  దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. కొందరు వాటిని వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలే కృష్ణా, గోదావరి జలాలను తరలించి,  హైదారాబాద్ ప్రజల దాహార్తిని తీర్చాయని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి చర్యలు చేపట్టకపోగా వర్షాలు వస్తే హైదారాబాద్ లో నాళాలు పొంగిపొర్లి  ప్రజలు అష్టకష్టాలు పడ్డారని అన్నారు.

హైదారాబాద్ లోని పలు  ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని, మూసీని మంచి పర్యాటక కేంద్రంగా డెవలప్​ చేస్తామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంతో నిర్వాసితులైన వారి పట్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అందరికి తెలుసునని, వారి ఆందోళనలను పోలీసుల లాఠీచార్జీతో అణచివేసిందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు సమస్యలపై నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వలేదని, ఇప్పుడు మూసీ నిర్వాసితులతో సంప్రదింపులు జరిపి, వారికి అన్యాయం జరగకుండా సమన్వయపరుస్తున్నట్టు తెలిపారు. అధికారంలో లేమనే బాధతో బీఆర్ఎస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో హైడ్రాను  ప్రతిఒక్కరూ స్వాగతిస్తున్నారని చెప్పారు. రాబోయే కాలంలో అన్ని చెరువులను రక్షించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుంటామని అన్నారు.  

కులగణన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలు 

కులగణన పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని  పొన్నం ప్రభాకర్‌‌ చెప్పారు. సర్దార్‌‌ సర్వాయి పాపన్న స్ఫూర్తితో ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నదని తెలిపారు. జనగామ జిల్లా లింగాల ఘన్‌‌పూర్‌‌లో ఏర్పాటు చేసిన సర్దార్‌‌ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆదివారం పొన్నం ప్రభాకర్​ ఆవిష్కరించారు. గౌడ్స్‌‌కు కాటమయ్య రక్షా కిట్లను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సర్వాయి పాపన్నగౌడ్‌‌ పోరాట చరిత్రను బయటకు రాకుండా కుట్ర జరిగిందని అన్నారు. గౌడ్స్‌‌కు రావాల్సిన ఎక్స్‌‌గ్రేషియా బకాయిలను దసరాలోపు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెండేండ్లలో  ప్రతి గౌడ్‌‌కు రక్షా కిట్స్‌‌ను అందిస్తామని చెప్పారు. జనగామ జిల్లా పేరును సర్దార్‌‌ సర్వాయి పాపన్న జిల్లాగా మార్చాలని సీఎం రేవంత్‌‌రెడ్డిని కోరామని, త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని 25 వేల స్కూళ్లలో రూ.1,100 కోట్లతో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌‌ ఎంపీ కడియం కావ్య, స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్‌‌ రిజ్వాన్‌‌ బాషా షేక్‌‌, డీసీపీ రాజమహేంద్రనాయక్‌‌, తదితరులు పాల్గొన్నారు.